ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా అవార్డుల పండుగ ఆస్కార్. ఇందులో నామినేషన్ పొందినా చాలు ఆ సినిమాకు ఎంతో పేరు వస్తుంది. ఈ ఏడాది మూడు సినిమాలే మనదేశం నుంచి పోటీ పడినప్పటికీ ఒకే ఒక్క సినిమా చోటు దక్కించుకుంది. సూర్య ‘జై భీమ్’, మోహన్ లాల్ ‘మరక్కార్’ నామినేషన్లోకి వెళ్లలేకపోయాయి. ఇక ‘రైటింగ్ విత్ ఫైర్’ అనే సినిమా మాత్రం భారతీయుల ఆస్కార్ ఆశలను సజీవంగా ఉంచింది. ఉత్తమ డాక్యుమెంటరీ కేటగిరీలో నామినేషన్ సాధించింది. ఇప్పుడు ఈ సినిమా మనదేశంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఏంటీ డాక్యుమెంటరీ...
చాలా డాక్యుమెంటరీలు నిజజీవిత కథల నుంచే పుడతాయి. అలాగే ‘రైటింగ్ విత్ ఫైర్’ కూడా కొందరి మహిళ నిజ జీవితం. ఉత్తరప్రదేశ్‌ల్లోని కర్వి అనే పట్టణంలో 2002లో ప్రారంభమైంది ‘ఖబర్ లెహరియా’ అనే చిన్న పత్రిక ప్రస్థానం. స్థానిక వార్తలను అందించే పత్రిక అది. ఆ పత్రిక స్థానికంగా మాట్లాడే హిందీ మాండలికం ‘బుందేలి’ భాషలో ప్రచురితం అవుతుంది. ఆ తరువాత మహోభా, లక్నో, వారణాసిలలో కూడా ఈ పత్రిక ప్రారంభమైంది. ఆ పట్టణాల్లో కూడా స్థానిక మాండలిక భాషలైన అవధి, భోజ్‌పురి భాషల్లో వార్తలను అందిస్తారు. 2012లో వారి రీడర్‌షిప్ 20,000 ఉండేది. రోజుకు 6000 పేపర్లు అమ్మేవారు. ఒక ఎన్జీవో స్థానికుల కోసం ఈ పేపర్‌ను మొదలు పెట్టింది.
మహిళా రాజ్యం...
2013లో ఖబర్ లెహరియా.కామ్ పేరుతో వెబ్ సైట్ లాంఛ్ అయ్యింది. గతంలో తమ పత్రికలో అచ్చయిన మంచి కథనానలు ఇందులో తిరిగి పోస్టు చేసేవారు. 2016లో పేపర్ మొత్తం డిజిటల్ ఫార్మాట్ కు మారింది. వీడియో ఛానెల్ కూడా మొదలైంది. ఈ మొత్తాన్ని ఆడవారే చూసుకోవడం మొదలుపెట్టారు. అలాగని వారేమీ ఉన్నత చదువులు చదివిన వారు కాదు, అంతా సామాన్యులు. గ్రామాల్లోని కాస్తో కూస్తో చదువుకున్న మహిళలు. బయట తిరుగుతూ వార్తలు సేకరించేవారే. వాటిని రాసి అప్ డేట్ చేసేది వారే, అంతేకాదు ఫోన్లలో వీడియోలు తీస్తూ వీడియో ఛానెల్ ను రన్ చేసేది మహిళలే. అందులో అధికంగా దళిత మహిళలు ఉన్నారు. వారికి ఫీల్డ్ లో చాలా ఇబ్బందులు, మాటలు ఎదురయ్యేవి. వాటన్నింటినీ తట్టుకుని ధైర్యంగా వార్తలు సేకరిస్తారు ఈ మహిళలు. ప్రస్తుతం ఖబర్ లెహరియా కోసం 40 మంది స్త్రీలు పనిచేస్తున్నారు. వారంతా ఎన్నోఏళ్లుగా ఎంతగా కష్టపడి, కుల వివక్షను, లింగ వివక్షను ఎదుర్కొంటూ పనిచేస్తున్నరనే కోణంలో సినిమా తీశారు. అదే ‘రైటింగ్ విత్ ఫైర్’.
ఈ సినిమాను సుస్మిత్ ఘోషో్, రింటూ థామస్ కలిసి దర్శకత్వం వహించారు. నిర్మాతలుగా, ఎడిటర్లుగా కూడా వారే వ్యవహరించారు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్లలో చోటు కూడా దక్కించుకుంది.