Weather Updates: తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. కొన్ని రోజుల కిందటి వరకు ఏపీలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. తాజాగా తెలంగాణలో వర్షాల ప్రభావంతో చలి తీవ్రత అధికమైంది. రెండు వైపుల నుంచి వీచే గాలులతో ఉదయం వేళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏపీ, యానాంలలో ఉత్తర, ఈశాన్య దిశల నుంచి చలిగాలులు తక్కువ ఎత్తులో వేగంగా వీస్తున్నాయి. దీని ఫలితంగా రాష్ట్రంలో మరో మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, కోస్తాంధ్రలో మాత్రం చలి తగ్గడం లేదు.


ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీచే గాలులలో ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం  ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన లేదు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అత్యల్పంగా నందిగామలో 16.3 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కళింగపట్నంలో 17.1 డిగ్రీలు, జంగమేశ్వరపురంలో 18.2 డిగ్రీలు, బాపట్లలో 18.3, అమరావతిలో 19.2 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.






రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుంది. వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండవని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి ప్రభావం కాస్త తగ్గింది. ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలు, నంద్యాలలో 19.6 డిగ్రీలు, కర్నూలులో 20 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.


తెలంగాణలో వర్షాలు..
తెలంగాణలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళ కొన్ని చోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.


Also Read: Chiru Jagan Meet : చిరంజీవి, నాగార్జున కాక ఇంకెవరు ? జగన్‌తో భేటీకి వెళ్లే ప్రముఖులు ఎవరు?


Also Read: Gold-Silver Price: బంగారం కొనేవారికి షాక్! నేడు రూ.200 ఎగబాకిన ధర, అదే దారిలో వెండి కూడా..