శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి క్యాన్సర్. శరీరంలోని కణాలు అనియంత్రితంగా పెరిగినప్పుడు ఆరోగ్యకరమైన కణజాలాలు నాశనం అవుతాయి. అప్పుడు క్యాన్సర్ కణాలు అభివృద్ధి జరుగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. 2018లో 9.6 మిలియన్ల మరణాలు క్యాన్సర్ వల్ల సంభవించినట్టు తెలుస్తోంది. ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, కోలోరేక్టల్, కడుపు, కాలేయ క్యాన్సర్ పురుషుల్లో అత్యంత సాధారణంగా కనిపిస్తుంది. ఇక మహిళల్లో రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయ, థైరాయిడ్ క్యాన్సర్ సర్వసాధారణంగా వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
సకాలంలో గుర్తించి క్యాన్సర్ కి సరైన చికిత్స అందిస్తే తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడం చాలా ముఖ్యం. ఆ వ్యాధిని సూచించే కొన్ని సంకేతాలు పసిగట్టగలగాలి. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
నిరంతర దగ్గు
వైరల్ ఇన్ఫెక్షన్స్, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ (GERD) వంటి వ్యాధులు కూడా నిరంతర దగ్గుకు కారణం కావచ్చు. నిరంతరం తీవ్రంగా దగ్గు వస్తే అది ఊపిరితిత్తుల క్యాన్సర్ ను సూచిస్తుంది. ఒక్కోసారి పొడి దగ్గుగా కూడా ఉంటుంది. తర్వాత దగ్గినప్పుడు రక్తం లేదా కఫం రావచ్చు.
పేగుల్లో మార్పులు
యూకే నేషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం పేగు క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి పేగుల్లో నిరంతరం మార్పులు జరుగుతాయి. ఇవి అనేక లక్షణాలను బయటకి చూపిస్తాయి. తరచుగా టాయిలెట్ కి వెళ్ళడం, మలంలో రక్తం రావడం, పైల్స్ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.
శరీరంలో ఎక్కడైనా గడ్డ
శరీరంలో అకస్మాత్తుగా కనిపించే గడ్డలు ఆందోళన కలిగిస్తాయి. అవి క్యాన్సర్ కానప్పటికీ ఒక్కోసారి వాపు వస్తుంది. క్యాన్సర్ గడ్డల పరిమాణం పెరుగుతుంది. రొమ్ము, వృషణం లేదా మెడ, చేతులు, కాళ్ళలో ఈ గడ్డలు కనిపిస్తాయి. క్రమం తప్పకుండా స్వీయ పరీక్ష చేసుకోవాలి.
పుట్టుమచ్చల్లో మార్పులు
పుట్టుమచ్చ పరిమాణం, ఆకారం, రంగులో మార్పులను తేలికగా తీసుకోకూడదు. ఇది మెలనోమాను సూచిస్తుంది. ఇది చర్మ క్యాన్సర్ తీవ్రమైన రకం. మయో క్లినిక్ ప్రకారం ఇది మెలనిన్ ఉత్పత్తి చేసే కణాలలో అభివృద్ధి చెందుతుంది. ఇది చర్మం రంగు కూడా మారుస్తుంది.
బరువు తగ్గడం
క్యాన్సర్ తో బాధపడే వ్యక్తులు స్పష్టమైన కారణం లేకుండానే బరువు తగ్గిపోతారు. ఇది వ్యాధి మొదటి సంకేతం. కడుపు, ప్యాంక్రియాస్, అన్నవాహిక, ఊపిరితిత్తులను ప్రభావితం చేసే క్యాన్సర్ లలో ఈ విధంగా బరువు తగ్గడం చాలా తరచుగా జరుగుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ (ACS) పేర్కొంది.
నొప్పి, అసౌకర్యం
శరీర భాగాలలో నొప్పి మంట అనేది కొన్ని సారు వారాలు, నెలల పాటు ఉంటుంది. దీనికి ఎటువంటి కారణం ఉండదు. కానీ నొప్పి అనేది స్థిరంగా ఉంటే మాత్రం తీవ్రంగా పరిగణించాలి.
ఆహారం మింగడంలో ఇబ్బంది
ఆహారాన్ని మింగడం కష్టంగా అనిపిస్తే అది డిస్ఫాగియాతో బాధపడుతున్నట్టు. మెడలో కణితి పెరుగుతున్న క్యాన్సర్ రోగుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇది ఆహార మార్గాన్ని బ్లాక్ చేస్తుంది. ఆహారాన్ని మింగడం కష్టతరం అవుతుంది.
మూత్రంలో రక్తం
మూత్రాశయ క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణం ఇది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో హెమటూరియా అని పిలుస్తారు. ఇది నొప్పి లేకుండా ఉంటుంది. యూకే నివేదిక ప్రకారం ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న కొంతమంది పురుషుల్లో ఈ లక్షణం కనిపిస్తుంది. ప్రొస్టేట్ నుంచి రక్తస్రావం జరగడం వల్ల ఇలా అవుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.