దేవుడి మీద భక్తితో చాలా మంది తరచూ ఉపవాసం ఉంటారు. దీని వల్ల అనేక వైద్య ప్రయోజనాలు ఉంటాయి. మతపరమైన కారణాలతో పాటు ఉపవాసం మానవ శరీరానికి, మెదడుకి అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇది శరీర పనితీరుని మెరుగుపరుస్తుంది. హార్మోన్లు, కణాలు, జన్యువుల పనితీరుని మారుస్తుంది. కొంతకాలం ఆహారం తీసుకోనప్పుడు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. శరీరం హార్మోన్ల స్థాయిలని మారుస్తుంది.


ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి


అడపాదడపా ఉపవాసం వల్ల ఇన్సులిన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. కొవ్వుని కరిగించే ప్రక్రియ సులభతరం చేస్తుంది. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రక్త స్థాయిలు పెరుగుతాయి. అధిక కొవ్వుని కాల్చి కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. శరీర కణాల నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ముఖ్యమైన పనులు చేస్తుంది. దీర్ఘాయువు, వ్యాధి రక్షణకు సంబంధించిన అనేక జన్యువులు, అణువుల్లో మార్పులు తీసుకొస్తుంది.


బరువు తగ్గిస్తుంది


బరువు తగ్గించుకోవడం కోసం కూడా కొంతమంది తరచూ ఉపవాసం ఉంటారు. హార్మోన్ పనితీరుని మెరుగుపరుస్తుంది. తక్కువ ఇన్సులిన్ స్థాయిలు, అధిక హ్యూమన్ గ్రోత్ హార్మోన్ స్థాయిలు, నోర్‌పైన్‌ఫ్రైన్ స్థాయిలు కొవ్వుని విచ్చిన్నం చేస్తాయి. ఇది జీవక్రియ రేటుని పెంచుతుంది. కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. అడపాదడపా ఉపవాసం వల్ల కండరాల నష్టం తక్కువగా ఉంటుంది.


టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది


ఇటీవలి కాలంలో మధుమేహం బారిన ఎక్కువ మంది పడుతున్నారు. ఉపవాసం చేయడం వల్ల ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. టైప్ 2 మధుమేహం నుంచి రక్షణగా నిలుస్తుంది. అడపాదడపా ఉపవాసం చేసే వారి మీద అధ్యయనం జరిపారు. ప్రీ డయాబెటిస్ ఉన్నవారిలో 8-12 వారాల వ్యవధితలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 3-6 శాతం తగ్గింది. ఫాస్టింగ్ ఇన్సులిన్ 20-31 శాతం తగ్గింది.


ఆక్సీకరణ ఒత్తిడి తగ్గిస్తుంది


వృద్ధాప్యం, దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ఆక్సీకరణ ఒత్తిడి ఒక కారణం. ఇది ప్రీ రాడికల్స్ వల్ల నష్టం కలిగిస్తుంది. అడపాదడపా ఉపవాసం ఈ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి.


గుండె ఆరోగ్యానికి మేలు


గుండె జబ్బులు ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద కిల్లర్ గా మారిపోయాయి. గుండె జబ్బుల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఆ సమస్యల నుంచి బయటపడేందుకు అడపాదడపా ఉపవాసం చక్కగా ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.


కణాలను రిపేర్ చేస్తుంది


శరీరంలోని కణాలు సెల్యులార్ వ్యర్థాలను తొలగిగించే పనిని ఆటోఫాగి అని అంటారు. ఇది పనిచేయని ప్రోటీన్లని విచ్చిన్నం చేస్తుంది. క్యాన్సర్, అల్జీమర్స్ వ్యాధి, న్యూరోడెజేనరేటివ్ వ్యాధులతో సహాయ అనేక వ్యాధుల నుంచి రక్షణగా నిలుస్తుంది. క్యాన్సర్ కణాల అనియంత్రిత పెరుగుదలని తగ్గిస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే జీవక్రియపై ఉపవాసం అనేక ప్రయోజనకరమైన ప్రభావాలను చూపుతుంది.


మెదడుకి మేలు


శరీరానికి ఏది మంచో ఏది చెడు అనేది మెదడు చెప్తుంది. ఇది మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీవక్రియ లక్షణాలను మెరుగుపరుస్తుంది. కొత్త నరాల పెరుగుదలని పెంచుతుందని అనేక అధ్యయనాలు చెప్తుంది. మెదడు దెబ్బతినకుండా కాపాడుతుంది. బ్రెయిన్ డెరైవ్డ్ న్యూరోట్రోఫిక్ ఫ్యాక్టర్ (BDNF) అనే మెదడు హార్మోన్ స్థాయిలను కూడా పెంచుతుంది. BDNF లోపం డిప్రెషన్, అనేక ఇతర మెదడు సమస్యలకు కారణమవుతుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది.


జీవితకాలం పొడిగిస్తుంది


ఎలుకల మీద జరిపిన అధ్యయనంలో ఉపవాసం జీవితకాలాన్ని పొడిగించగలదని తేలింది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.