Adani Group Buyback: అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ (Hindenburg Research) నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ ‍‌(Adani Group) కంపెనీలకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యి, షేర్లు నేల చూపులు చూస్తున్న తరుణంలో... మరో కొత్త వార్త బయటకు వచ్చింది.


గ్రూప్‌ కంపెనీలైన అంబుజా సిమెంట్స్ (Ambuja Cements), అదానీ పోర్ట్స్‌లో ‍‌(Adani Ports) షేర్ల బైబ్యాక్‌ ‍‌(share buyback) కోసం గౌతమ్‌ అదానీ ప్రయత్నాలు చేస్తున్నారని, రాక-పోక లెక్కలను పరిశీలిస్తున్నారన్నది కొత్త వార్త.


బైబ్యాక్‌ వార్త ఉత్తదేనట
అయితే... ఈ వార్తను అదానీ గ్రూప్ ఖండించింది. జాతీయ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న సదరు వార్తలో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.


"షేర్ బైబ్యాక్ వార్తలకు సంబంధించి మా వద్ద ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చెబుతున్నాం. కాబట్టి, జాతీయ మీడియాలో వచ్చిన వార్తల వాస్తవికతపై వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు" అని అదానీ పోర్ట్స్ ఇటీవలి ఫైలింగ్‌లో తెలిపింది.


అంబుజా సిమెంట్స్ కూడా, షేర్ల బైబ్యాక్ కోసం ఎలాంటి ప్రణాళికలు తమ వద్ద లేవని  ప్రత్యేక ఫైలింగ్‌ ద్వారా స్పష్టం చేసింది, అలాంటి వార్తలను తిరస్కరించింది.


అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్‌ కంపెనీల్లో కలిపి రూ. 3,000 కోట్ల విలువైన షేర్లను మార్కెట్‌ నుంచి తిరిగి కొనాలని (బైబ్యాక్‌) అదానీ గ్రూప్ ఆలోచిస్తున్నట్లు గతంలో ఒక జాతీయ పత్రిక వార్తలు రాసింది.


అంబుజా సిమెంట్స్, అదానీ పోర్ట్స్ షేర్లు గత వారం బాగా పతనమై, కనిష్ట స్థాయులకు పడిపోయాయి. సరిగ్గా, షేర్లు పతనమైన సమయంలో బైబ్యాక్‌ ఊహాగానాలతో ఒక వార్త బయటకు వచ్చింది. దీంతో అవి తిరిగి పుంజుకున్నాయి. ఇవాళ 
(మంగళవారం, జనవరి 31, 2023) మార్నింగ్‌ సెషన్‌లో.. అంబుజా సిమెంట్స్ షేర్‌ ధర 4% పైగా పెరిగి రూ. 404 వద్దకు చేరగా, అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ షేర్‌ ధర 2% పెరిగింది.


అంబుజా సిమెంట్స్ షేర్లు శుక్రవారం (జనవరి 25, 2023) నాడు దాదాపు 25% పడిపోయాయి. 2006 తర్వాత ఇదే ఒక్క రోజులో వచ్చిన (intra-day) గరిష్ట పతనం. అదానీ పోర్ట్స్ షేర్లు గత వారం 23%, శుక్రవారం ఒక్కరోజే 16.3% క్షీణించాయి, దాదాపు రెండు సంవత్సరాల కనిష్ట స్థాయిలో ముగిశాయి.


అంబుజా సిమెంట్స్ - అదానీ పోర్ట్స్‌ ఆర్థిక చరిత్ర


దేశంలోని మిగిలి సిమెంట్ కంపెనీలతో పోలిస్తే.. అంబుజా సిమెంట్స్ బ్యాలెన్స్ షీట్, ఈక్విటీపై రాబడి (return on equity) టాప్‌ ప్లేస్‌లో ఉన్నాయి.


వచ్చే ఐదేళ్లలో ACC, అంబుజా సిమెంట్స్ ఉమ్మడి సామర్థ్యాన్ని 140 MTPAకి పెంచాలని (ప్రస్తుత స్థాయి నుంచి ఇది రెట్టింపు) అదానీ గ్రూప్ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. 2022 సెప్టెంబర్ 30 నాటికి, అంబుజా సిమెంట్స్ వద్ద రూ. 3,479 కోట్లకు సమానమైన నగదు, నగదుకు సమానమైన నిల్వలు ఉన్నాయి.


బలమైన ఆపరేటింగ్ క్యాష్‌ ఫ్లోస్‌ ఉన్న అదానీ పోర్ట్స్, ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలను అందించే సమీకృత రవాణా సంస్థగా మారాలని, FY25 నాటికి 500 మిలియన్‌ టన్నుల కార్గో హ్యాండ్లింగ్‌ లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదలతో పని చేస్తోంది. 


2022 సెప్టెంబర్ 30 నాటికి ఈ కంపెనీ దగ్గర రూ. 5,835 కోట్ల నగదు, నగదుకు సమానమైన నిల్వలు ఉన్నాయి. అదానీ పోర్ట్స్ నికర రుణం 2022 మార్చి నెల చివరి నాటికి ఉన్న రూ. 31,700 కోట్ల నుంచి అదే సంవత్సరం సెప్టెంబర్ నెల చివరి నాటికి రూ. 35,800 కోట్లకు పెరిగింది. అంటే.. ఆరు నెలల్లో నికర రుణం రూ. రూ. 4,100 కోట్లు పెరిగింది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.