Life After Cancer : క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత.. జీవితం తిరిగి మామూలుగా కావడం అంత సులభం కాదు. మళ్లీ సాధారణ స్థితికి రావాలంటే ముఖ్యంగా కొన్ని విషయాలపై ఫోకస్ చేయాలి అంటున్నారు మణిపాల్ హాస్పిటల్​కు చెందిన సర్జికల్ ఆంకాలజీ డాక్టర్ మాధవి నాయర్. కొత్త కోలుకున్నా లేదా చాలా సంవత్సరాలుగా క్యాన్సర్​తో ఇబ్బంది పడి బయటపడినా.. ఆరోగ్యంపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దీర్ఘకాలిక ఆరోగ్యంపై, జీవన నాణ్యతలో గొప్ప వ్యత్యాసం చూపే కొన్ని లైఫ్​స్టైల్ ఛేంజ్​లు ఇక్కడ ఉన్నాయంటున్నారు.

రెగ్యులర్ చెకప్స్

క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత.. ఫాలో-అప్ షెడ్యూల్‌ కచ్చితంగా పాటించాలి. సాధారణంగా ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు.. ఏదైనా పునరావృతమయ్యే పరిస్థితి ఉంటే.. ముందుగానే గుర్తించే సౌలభ్యం ఉంటుంది. కాబట్టి మొదటి కొన్ని సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు మాధవి. కొన్ని సందర్భాల్లో కణితి రకం, స్థానాన్ని బట్టి.. రెగ్యులర్ చెకప్స్ ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలంటున్నారు. కాబట్టి మీరు బాగానే ఉన్నా వీటిని స్కిప్ చేయకండి. 

జీవనశైలిలో చేయాల్సిన మార్పులు

చికిత్స ముగిసిన తర్వాత.. శరీరం కోలుకోవడానికి కచ్చితంగా టైమ్ పడుతుంది. కాబట్టి ఆ సమయంలో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

  • వ్యాయామం : రెగ్యులర్ వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు నడవాలి. ఇది మీరు దీర్ఘకాలికంగా కోలుకోవడానికి సహాయం చేస్తుంది. అలాగే మీ శక్తిని పెంచుతుంది. వ్యాయామం వల్ల మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు.
  • సమతుల్య ఆహారం : హోల్ ఫుడ్స్, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తక్కువ ప్రాసెస్ చేసిన ఆహారంపై దృష్టి పెట్టాలి. అలా అని ప్రతీ దానికి దూరంగా ఉండాలని కాదు.. శరీరం కోలుకోవడానికి ఏది అవసరమో అది ఇవ్వాలి. 
  • ఒత్తిడి : యోగా, సంగీతం, జర్నలింగ్ లేదా మిమ్మల్ని అలసిపోయే వాటికి దూరంగా ఉంచే పనులు చేయాలని చెప్తున్నారు. మనస్సును శాంతింపజేసే వాటిని కనుగొని దానికి సమయం కేటాయించాల్సి ఉంటుంది. 

జీవితాన్ని ఆస్వాదించే హక్కు మీకు ఉందని గుర్తించాలి. క్యాన్సర్​ నుంచి బయట పడిన తర్వాత శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి అనేది ఒక లగ్జరీ కాదని.. నయం కావడంలో ఒక భాగమని రోగితో సహా కుటుంబ సభ్యులు గుర్తించి సపోర్ట్ చేయాలి.

ఈ అపోహలు నమ్మకండి

  • క్యాన్సర్‌ ఉంటే స్వీట్స్ తినకూడదా? : క్యాన్సర్ కణాలు సాధారణ కణాల కంటే ఎక్కువ చక్కెరను వినియోగిస్తాయి. కానీ చక్కెర తినడం వల్ల క్యాన్సర్ వ్యాప్తి చెందదు. చక్కెరను తగ్గించడం వల్ల కణితి కూడా తగ్గదు. అయినప్పటికీ మంటను తగ్గించడానికి, రోగనిరోధక శక్తికి మద్దతు ఇవ్వడానికి చక్కెరను పరిమితంగా తీసుకోవడం మంచిది.
  • క్యాన్సర్ అంటువ్యాధా? : క్యాన్సర్ అంటువ్యాధి కాదు. అయితే HPV, HBV లేదా HIV వంటి కొన్ని వైరస్‌లు క్యాన్సర్‌కు దారితీస్తాయి. కాబట్టి ఇది క్యాన్సర్ వ్యాప్తి కాదు, వైరస్ వ్యాప్తి.
  • బయాప్సీలు క్యాన్సర్‌ను వ్యాప్తి చేస్తాయా? : ఈ భయం చాలామందిలో ఉంటుంది. కానీ ఇది నిజం కాదు. రోగ నిర్ధారణ, చికిత్సను ప్లాన్ చేయడంలో బయాప్సీలు ముఖ్యమైన భాగం. అత్యధిక కేసుల్లో అవి క్యాన్సర్‌ను వ్యాప్తి చేయవు.
  • ప్రత్యామ్నాయ చికిత్సలు ఉన్నాయా? : చాలా మంది రోగులు హోమియోపతి లేదా మూలికా నివారణల వంటి ఎంపికలకోసం అన్వేషిస్తారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఏదైనా కొత్తది ప్రారంభించే ముందు మీ క్యాన్సర్ వైద్యుడితో మాట్లాడండి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.