Idli Dosa Weight Loss : ఇడ్లీ లేదా దోశ బ్రేక్​ఫాస్ట్​గా లేకుంటే ఆరోజు.. అసలు రోజే కాదు కొందరికి. చాలామంది వీటిని చాలా ఇష్టంగా తింటారు. కానీ బరువు తగ్గాలంటే ఇడ్లీ, దోశ తినకూడదని కొందరు చెప్తూ ఉంటారు. అసలు బ్రేక్​ఫాస్ట్​గా ఇడ్లీ, దోశ తినొచ్చా? వీటివల్ల నిజంగానే బరువు పెరుగుతారా? బరువు తగ్గాలనుకుంటే వీటిని ఎలా తీసుకోవాలి? నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఇడ్లీలకు ఎందుకు దూరమవుతున్నారు?

ఈ మధ్యకాలంలో ఇన్​స్టాగ్రామ్​ వంటి సోషల్ మీడియాలో చాలామంది ఫుడ్ ద్వారా, ఆరోగ్యం ద్వారా ఎక్కువమందికి రీచ్​ అవ్వాలనే ఉద్దేశంతో రకరకాల ఇన్​ఫర్మేషన్​ను షేర్ చేసేస్తున్నారు. దీంతో అవి నిజమో.. కాదో తెలుసుకోకుండానే.. అదే నిజమనే భ్రమలో  చాలామంది నచ్చిన ఫుడ్స్​కి దూరమైపోతున్నారు. అలాంటి వాటిలో ఈ ఇడ్లీ, దోశ, బరువు కాన్సెప్ట్ కూడా. ఒకప్పుడు అందరూ ఇష్టంగా తినే ఈ ఫుడ్ ఇప్పుడెందుకు దూరం చేసుకోవాల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

వైట్ కార్బ్స్ భయం

కొందరు చెప్పేది ఏంటంటే.. ఇడ్లీ, దోశలలో వైట్ కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి అని చెప్పి వీడియోలు చేస్తారు. అయితే దీనిపై స్పందించిన ఫిట్​నెస్ కోచ్ విశ్వభారత్ అది పూర్తిగా ఫేక్ అని.. ఇడ్లీ, దోశలను తీసుకునేవిధంగా తీసుకుంటే బరువు అదుపులోనే ఉంటుందని తెలిపారు. అలాగే వాటిని తింటే ఏమవుతుందో.. ఎలా తింటే మంచిదో కూడా టిప్స్ ఇచ్చారు. 

పుష్కలంగా తినొచ్చు

హీరోలు నాని, అడవి శేష్​లకు పర్సనల్​ ట్రైనర్​గా చేస్తోన్న విశ్వభారత్.. యూజర్స్​ రొటీన్​గా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు. అలా ఒకరు అడిగిన ఈ ఇడ్లీ, దోశ క్వశ్చన్​కు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. "ఇడ్లీ లేదా దోశను చేయడానికి మినపప్పు, బియ్యం ఉపయోగిస్తారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే అయినప్పుడు రెండు కలిపి చేసిన దోశ లేదా ఇడ్లీ తింటే ఆరోగ్యానికి మంచిది కాదనడం అర్థం లేదు.ఇడ్లీ, దోశలతో కలిపి తీసుకునే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలు వంటి ఇతర చట్నీలు కూడా మంచి పోషకాలతో నిండి ఉండేవే తీసుకుంటారు. వాటిలో నెయ్యి వేసుకుని తింటే హెల్తీ ఫ్యాట్స్ కూడా శరీరానికి అందుతాయి. కాబట్టి బ్రేక్​ఫాస్ట్​లో ఇడ్లీ, దోశ పుష్కలంగా తినొచ్చు" అని తెలిపారు. అయితే తినమన్నారు కదా అని ఎక్కువగా తింటే నిజంగానే బరువు పెరుగుతారన్నారు.

తగినంత తింటే ఏదైనా మంచిదే

ఏ ఫుడ్ తీసుకున్నా దానిని తక్కువ మోతాదులో తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. కానీ నోటికి రుచిగా, ఇంట్రెస్టింగ్​గా ఉంది కదా అని ఎక్కువగా తింటేనే అసలు ప్రాబ్లమ్ అని విశ్వ వివరించారు. కాబట్టి ఇడ్లీ, దోశలను కూడా మీ కేలరీలకు తగ్గట్లుగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.  సోషల్ మీడియాలో వైట్ కార్బ్స్ అనే భయంపేరుతో చాలామంది ఇడ్లీ, దోశలకు దూరమవుతున్నారు. అయితే ఈ భయం అవసరం లేదు. మితంగా తీసుకుంటే ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే మీరు ప్రోటీన్, స్ప్రౌట్స్ వంటివి కూడా వాటితో కలిపి తీసుకుంటే మరీ మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.