ఎంతోమందికి ముల్లంగిని చూస్తే చులకన, ఎందుకంటే దాని వాసన పచ్చిగా ఉంటుంది. దానితో రుచికరమైన వంటకాలు వండుకోవడం చాలా తక్కువ. అందుకే అది తిన్నా తినకపోయినా ఒకటే అనుకుంటారు ఎంతో మంది. వాటి ధర కూడా తక్కువగానే ఉంటుంది. ఎప్పుడైతే డిమాండ్ ఉండదో, ధర తగ్గడం సాధారణమే. నిజానికి ముల్లంగి చేసే మేలు ఎంతో ఎక్కువ. దాన్ని చులకనగా చూడడం మానేసి ఆహారంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించండి. ముల్లంగితో రకరకాల వంటకాలు వండుకొని తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మన రోగనిరోధక చేయాల్సిన బలోపేతం చేసి తరుచూ జలుబు, దగ్గు, జ్వరం బారిన పడకుండా చేసే శక్తి ముల్లంగికి ఉంది. ఈ ముల్లంగితో పరోటాలు, పచ్చళ్లు, వేపుళ్ళు తయారు చేసుకోవచ్చు. రుచి కోసం చూడకుండా ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండుసార్లు ముల్లంగిని తినడం చాలా అవసరం. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఒక సందేహం ఉంది... తాము ముల్లంగిని తినవచ్చా లేదా అని. వారు నిస్సందేహంగా ముల్లంగిని తీసుకోవచ్చు. దీనిలో ఫైబర్, నీటి శాతం అధికంగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ. కాబట్టి ముల్లంగిని తినడం వల్ల వారికి ఎలాంటి సమస్యలు రావు. పైగా ఎంతో ఆరోగ్యం కూడా. ఇది బరువు పెరగకుండా అడ్డుకుంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా ఎంత తిన్నా ఆరోగ్యమే కానీ అనారోగ్యాలు రావు. కాబట్టి ముల్లంగిని ఏదో రకంగా ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం.
అధిక రక్తపోటు ఉన్నవారు ముల్లంగిని తరచూ తినాలి. దీనిలో పొటాషియం అధికంగా ఉంటుంది. రోజూ తింటే రక్తనాళాల్లోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. దీనివల్ల బీపీ పెరిగే అవకాశం ఉండదు. అంటే హై బీపీ అదుపులో ఉంటుంది. ఈ కూరగాయలో జింక్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ముల్లంగిని తినేవారిలో చర్మవ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే ముల్లంగి మన రక్తంలో రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతుంది. కాలేయానికి ముల్లంగి చేసే మేలు అంతా ఇంతా కాదు. ముల్లంగిని తినడం వల్ల కాలేయ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా పచ్చ కామెర్లు రాకుండా ఉంటాయి. కాలేయంలో ఉండే మలినాలను తొలగించే శక్తి ముల్లంగికి ఉంది. అయితే ముల్లంగి తిన్న తర్వాత పాలు తాగకపోవడమే మంచిది. అలాగే ముల్లంగిని దోసకాయలను కలిపి వండకండి. ఇవి కడుపు నొప్పికి, మంటకు కారణం కావచ్చు.
Also read: ఐస్‌బాత్ చేస్తున్న హీరోయిన్లు, ఆ స్నానం వల్ల ఎన్నో ఉపయోగాలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.