Lokesh Yuvagalam : జనవరి నెలాఖరులో కుప్పం నుంచి  ప్రారంభమైన  యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరింది.  2500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.  లోకేష్‌లో వచ్చిన మార్పులు.. భవిష్యత్‌ నాయకుడిగా  ఎదిగిన వైనం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాశమవుతోంది. గతంలో లోకేష్‌కు సాఫ్ట్ ఇమేజ్ ఉండేది. నీట్ షేవ్ తో ఉండేవారు. రాజకీయాలకు అది సూట్ కాదన్న అభిప్రాయం ఉంది. అలాగే స్టాన్ ఫర్డ్ లో చదువుకుని వచ్చారు కాబట్టి క్లాస్ అనుకున్నారు. అందుకే మాస్ రాజకీయ నేతగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. పైగా ఆయన తెలుగు ప్రసంగాల్లో దొర్లే తప్పులూ విపక్ష పార్టీల ట్రోలింగ్ కు ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు ఆ మైనస్‌లన్నీ అంతర్థానం అయిపోయాయి. అన్నింటికీ లోకేష్‌ తన పాదయాత్రతో సమాధానం ఇచ్చారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. 


లోకేష్‌కు టీడీపీలో పూర్తి స్థాయి అంగీకారం 


 ఇప్పుడు లోకేష్‌ను పార్టీలోని సీనియర్‌ నేతలు అంగీకరించారు. పార్టీ కేడర్‌ అంగీకరించింది. టీడీపీకి మూడో తరం నాయకుడు వచ్చేశాడని పార్టీ నేతలు.. కేడర్‌ ఫిక్స్‌ అయిపోయారు. ఇందులో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం అక్కర్లేదు. పాదయాత్రకు వెళ్లే ముందు ఒకటి కాదు రెండు కాదు లోకేషుకు చాలా మైనస్సులే ఉన్నాయి. పార్టీలోనే లోకేష్‌కు పూర్తి స్థాయిలో యాక్సెప్టెన్సీ లేదు. లోకేష్‌కు మాస్‌ ఇమేజ్‌ లేదు. లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేవు. అధికారంలో ఉండి.. మంత్రిగా ఉండి.. సీఎం తనయుడుగా ఉండి కూడా ఎన్నికల్లో గెలవలేకపోయాడు. అద్భుతమైన వక్త కాదు. అసలు పాదయాత్ర చేయగలరా..? మధ్యలోనే ఆపేస్తారా..? ఇదీ లోకేష్‌ విషయంలో ఉన్న మైనస్సులు. నిజం చెప్పాలంటే ఓ తండ్రి చాటు బిడ్డగా లోకేష్‌ తన పాదయాత్రను ప్రారంభించారు.ఇన్ని మైనస్సులు అధిగమించి తన మీద.. తన నాయకత్వం మీద నమ్మకం కలిగించాలంటే మామూలు విషయం కాదు. కానీ లోకేష్‌ 2,500 కిలోమీటర్ల పాదయాత్రలో చేసి చూపించారు. 


మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దక్కని ప్రాధాన్యం


లోకేష్ టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. కనీసం ఎమ్మెల్యే కూడా కాదు. ఓ టీడీపీ నేత అంతే. అందుకో.. మరో ఇతర కారణాలో కానీ..  మయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలో లోకేష్‌ పాదయాత్రకు ఇవ్వాల్సినంత ప్రయార్టీ ఇవ్వడం లేదు.. లోకేష్‌కు రావాల్సినంత ఎలివేషన్‌ రావడం లేదు. కానీ క్షేత్ర స్థాయిలో లోకేష్‌కు ఓ రేంజ్‌లో ఇమేజ్‌ బిల్డప్‌ అవుతోదంని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.   పార్టీ కంటే.. కేడర్‌ కంటే తనకెవరు ముఖ్యం కాదని స్పష్టంగా.. ఎలాంటి మొహమాటాలు.. శషభిషలు లేకుండా లోకేష్‌ చెప్పేస్తున్నారని పార్టీలో చాలా మంది చెప్పుకుంటున్నారు. అదే టైంలో పాదయాత్రతో సంబంధం లేకుండా పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. పార్టీలో పదవులు అనుభవించి.. ప్రతిపక్షంలోకి వచ్చాక సైలెంట్‌ అయి.. తోక జాడించిన.. జాడిస్తోన్నా కొందరు సీనియర్‌ లీడర్లకు లోకేష్‌ ముచ్చెమటలు పట్టించారు. తన కెరీర్‌లో ఎన్నడూ భయపడని విధంగా లోకేష్‌ వారిని భయంతో పరుగులు పెట్టించిన సందర్భాలు ఈ 185 రోజుల్లో చాలానే ఉన్నాయి. ఇది లోకేష్‌లోని నాయకత్వ పరిపక్వతకు అద్దం పడుతోందని  టీడీపీ వర్గలు చెబుతున్నాయి.  


ప్రజల్లోనూ ప్రత్యేక నేతగా ఇమేజ్ తెచ్చుకుంటున్న లోకేష్ 


ఇక జనంతో మమేకం అయ్యే విషయంలో కూడా లోకేష్‌   చాలా మెరుగయ్యారు.   ఓ అన్నలా.. ఓ కొడుకులా.. ఓ మనవడిలా.. ఓ స్నేహితుడిలా.. ఇలా అందరిలోనూ కలిసిపోతున్నారు లోకేష్‌. కొందరు వృద్ధులు లోకేష్‌కు నమస్కారం చేస్తుంటే.. మీరు నమస్కారం చేయడం కాదు.. ఆశీర్వదించండంటూ లోకేష్‌ తిరిగి అభివాదం చేస్తూ వారి ఆశీర్వాదం తీసుకోవడం వంటి సంఘటనలు చూస్తుంటే లోకేష్‌లో కలివిడితనం ప్రజల్ని ఆకట్టుకుంటోంది.  లోకేష్‌ పాదయాత్రకు.. లోకేష్‌ బహిరంగసభలకు వచ్చే జనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పాదయాత్రకు ముందు లోకేష్‌కు ఎలాంటి మాస్‌ ఇమేజ్‌ లేదు. కానీ జనం లోకేష్‌ను చూడడానికి ఎగబడుతున్నారు. సెల్ఫీల కోసం వేల మంది క్యూలైన్లలో ఉంటున్నారు. ఎలా అయినా లోకేష్ పాదయాత్రలో ప్రత్యేక చూపించుకున్నారు. నాయకుడిగా తనను తాను ప్రజల ముందు ఆవిష్కరించుకున్నారు.