Diabetes: ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది పెద్దల్లో ఒకరి మధుమేహం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు యాభై కోట్ల మంది డయాబెటిక్ రోగులు ఉన్నట్టు అంచనా. ఏటా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మనదేశంలో దాదాపు 7.7 కోట్ల మంది మధుమేహులు ఉన్నారు. మరో ఇరవై ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా. మధుమేహం రాకుండా అడ్డుకోవాలంటే చక్కని జీవనశైలిని అలవర్చుకోవాలి. చిన్న వయసులో వచ్చేది టైప్ 1 డయాబెటిస్, పెద్దయ్యాక వయసుతో పాటూ వచ్చేది టైప్ 2 డయాబెటిస్. ఇప్పుడు ఎక్కువ మందిని కాటేస్తోంది టైప్ 2 డయాబెటిస్.
మందులు వాడకుండా...
డయాబెటిస్ వచ్చాక చాలా మంది మందులు వాడతారు. కానీ మందులు వాడకుండా మధుమేహాన్ని తిప్పికొట్టగలమా అనే ప్రశ్న ఎంతో మందిని వేధిస్తోంది. దీనికి వైద్యనిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే డయాబెటిస్. పెరగకుండా చూసుకుంటే చాలు మధుమేహం అదుపులో ఉన్నట్టు. అది పెరగకుండా ఉండాలంటే ఆహార నియమాలు పాటించాలి. వ్యాయామం చేయాలి. ఒత్తిడికి గురవ్వకుండా ప్రశాంతంగా ఉండాలి. అయితే ఒకసారి మధుమేహం వచ్చాక, వాటికి మందులు వాడడం ప్రారంభించాక దాన్ని పూర్తిగా తిప్పికొట్టడం సాధ్యం కాదు అని చెబుతున్నారు వైద్యులు.
తల్లిదండ్రులిద్దరికీ మధుమేహం ఉన్నప్పుడు వారసత్వంగా పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. దాన్ని అడ్డుకోవడం అసాధ్యం. శరీరంలో అధికంగా కొవ్వు చేరినా కూడా డయాబెటిస్ త్వరగా వచ్చేస్తుంది. మధుమేహం రాకుండా అడ్డుకోలేం కానీ, వచ్చాక అదుపులో మాత్రం ఉంచుకోగలం అని వివరిస్తున్నారు వైద్య నిపుణులు. అధిక కేలరీలు కలిగిన ఆహారాన్ని తినేవారి, అధికంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్‌లుండే ఆహారం తినేవారి రక్తంలో అధిక ఇన్సులిన్ స్థాయిలకు దారితీస్తుంది. శరీరం ఇన్సులిన్‌కు నిరోధకతను కలిగి ఉన్నప్పుడు, శరీరంలో అధిక ఇన్సులిన్ స్థాయిలు పేరుకుపోతాయి. ఇది ప్యాంక్రియాస్ పై భారాన్ని పెంచుతుంది. అలాగే అధిక ఇన్సులిన్ స్థాయిలు ఆకలిని కూడా విపరీతంగా పెంచుతాయి. అధిక ఆకలి కూడా మధుమేహ లక్షణమే. ఒకసారి మధుమేహం వచ్చాక దాన్ని పూర్తిగా నయం చేయడం కుదరదు. మందులు వాడడం ఆపేయకూడదు.
రోజూ గంట పాటూ వ్యాయామం చేయడం, ఉప్పు, పంచదార,బెల్లం వంటివి దూరంగా పెట్టడం, తాజా పండ్లు, కూరగాయలు తినడం వంటి వాటి ద్వారా డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచవచ్చు.
Also read: బ్రేకప్ అయ్యాక మానసికంగా కుంగిపోయారా? ఇలా బయటపడండి
Also read: ఉల్లిపాయ తొక్కలు పడేయకుండా పొడి చేసి దాచుకుంటే వంటల్లో ఇలా వాడుకోవచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.