మసాలా దోశె, కారం దోశె, ఉప్మా దోశె, రవ్వ దోశె... ఇలా రకరకాల దోశెలు ఉన్నాయి. ఎప్పుడూ వీటినే తింటే బోరు కొట్టేస్తుంది. కొత్తగా క్యాబేజీ దోశెను కూడా ఓసారి ప్రయత్నించండి. దీని రుచి అదిరిపోతుంది. రుచి కొత్తగా అనిపిస్తుంది కూడా. పిల్లలు కచ్చితంగా నచ్చే అవకాశం ఉంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. ఓసారి చేసి తిన్నారంటే మీరే మళ్లీ మళ్లీ వండుకుంటారు.
కావాల్సిన పదార్థాలు
బియ్యం - రెండు కప్పులు
ఎండు మిర్చి - రెండు
ఉల్లిపాయ - ఒకటి
జీలకర్ర - రెండు స్పూన్లు
చింతపండు - చిన్న ఉండ
కొత్తిమీర - ఒక కట్ట
క్యాబేజీ - కప్పు
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
తయారీ ఇలా
1. బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ బియ్యాన్ని మెత్తగా రుబ్బాలి.
2. ఆ బియ్యంలోనే జీలకర్ర, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, చింతపండు వేసి మెత్తగా రుబ్బాలి. అవసరం అయితే నీటిని కలపాలి.
3. ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
4. ఉల్లిపాయలు, క్యాబేజీలను చాలా సన్నగా తరగాలి.
5. వీటిని బియ్యం మిశ్రమంలో వేయాలి. ఉండలు కట్టకుండా బాగా కలపాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి.
7. పెనంపై బియ్యం మిశ్రయాన్ని గరిటెతో వేసి దోశెలా పలుచగా రుద్దాలి.
8. రెండు వైపులా బాగా కాల్చాక తీసి ప్లేటులో వేసుకోవాలి.
9. కొబ్బరి చట్నీతో ఈ దోశెలు తినడం వల్ల మంచి రుచిగా ఉంటుంది.
క్యాబేజీ దోశె తినడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. దీనిలో సల్ఫోరఫేన్, కామెంఫెరాల్ అని పిలిచే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ శరీరంలో వాపులు, నొప్పులు తగ్గేందుకు సహకరిస్తాయి. కాబట్టి రుమటాయిడ్ ఆర్ధరైటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు క్యాబేజిని తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇది ముందుంటుంది. ఎముకలు, రక్తనాళాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు క్యాబేజీ మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి అవసరం అయిన శక్తివంతమైన సమ్మేళనాలు ఈ కూరగాయలో పుష్కలంగా ఉంటాయి. హైబీపీ ఉన్న వారు కూడా క్యాబేజీని అధికంగా తినాలి. ఇందులో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. అందుకే హైబీపీ ఉన్న వారు కచ్చితంగా క్యాబేజీని ఆహారంలో భాగం చేసుకోవాలి. వారానికి రెండు సార్లు తింటే ఆరోగ్యపరంగా మేలు జరుగుతుంది.
Also read: కొబ్బరి మీగడ తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది, వారానికోసారి తినండి చాలు
Also read: నా భార్య తనకి కావలసినప్పుడు మాత్రమే నాకు దగ్గరవుతోంది, నా ఆసక్తి పట్టించుకోవడం లేదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.