ఆల్కహాల్ తీసుకోవడం వల్ల 60కి పైగా వ్యాధుల ముప్పు పెరుగుతుందని కొత్త అధ్యయనం వివరాలు వెల్లడి చేస్తోంది. వీటిలో గౌట్, క్యాటరాక్ట్, ఫ్యాక్చర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్ వంటి వన్నీ కూడా బూజింగ్ వల్ల రావచ్చని కొత్త అధ్యయనం చెబుతోంది.


పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకునే వారిలో లివర్ సిర్రోసిస్, స్ట్రోక్, అనేక రకాల క్యాన్సర్లకు గురయ్యే ప్రమాదం ఉంటుందని ఆక్స్ ఫర్డ్ పాపులేషన్ హెల్త్, పెకింగ్ యూనివర్సిటి, చైనీస్ అకాడెమీ నిర్వహించిన పరిశోధన ఈ వివరాలను వెల్లడించారు. మద్యం వల్ల ఇది వరకు తెలిసిన దానికంటే కూడా ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వారి పరిశోధనలు తెలుపుతున్నాయని ఆక్స్ ఫర్డ్ పాపులేషన్ హెల్త్ రీసెర్చ్ ఫెలో పేపర్ ప్రధాన రచయిత ఫెక్ కీమ్ చెప్పారు.


అధ్యయనంలో భాగంగా చైనాలో 512,000 మందిని వారి జీవనశైలీ, వారి ఆల్కహాల్ అలవాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. పురుషుల్లో మూడింట ఒక వంతు క్రమం తప్పకుండా బూజ్ చేస్తుంటే స్త్రీలలో కేవలం రెండు శాతం మాత్రమే ఇలా బూజింగ్ లో ఉండేవారు ఉన్నారట. అధ్యయన కారులు సుమారు 12 సంవత్సరాల పాటు పురుషుల ఆరోగ్య రికార్డులను పరిశీలించారు. ఆల్కహాల్ తీసుకోవడం వీరిలో అనారోగ్యాలకు కారణమా కాదా స్పష్టం చేయడానికి జన్యువిశ్లేషణ కూడా చేశారు. అయితే పురుషుల్లో గుర్తించిన 207 వ్యాధుల్లో, ఆల్కహాల్ వినియోగం 61 వ్యాధులకు ప్రత్యక్షకారణం అని ఈ బృందం నిర్ధారించింది.


లివర్ సిర్రోసిస్, స్ట్రోక్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ల వంటి 28 రకాల వ్యాధులు ఆల్కహాల్ వల్ల వచ్చేవిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. అయితే వీటిలో లేని గౌట్, క్యాటరాక్ట్, ఫ్యాక్చర్స్, గ్యాస్ట్రిక్ అల్సర్ల వంటి మరో 33 రకాల వ్యాధులు కూడా ఆల్కహాల్ వల్లే వస్తాయని ఈ కొత్త అధ్యయనం చెబుతోంది. అప్పుడప్పుడు తాగేవారితో పోలిస్తే క్రమం తప్పకుండా రోజూ మద్యం సేవించే పురుషుల్లో వీటిలో ఏ వ్యాధైనా రావచ్చని ఈ అధ్యయనం చెబుతోంది.


ప్రతి రోజూ తాగడం, తాగిన ప్రతి సారీ ఎక్కువగా తాగడం తో పాటు సరైన ఆహార అలవాట్లు లేకపోవడం వల్ల లివర్ సిర్రోసిస్ ప్రమాదం ఎక్కువ అవుతుంది. సిర్రోసిస్ లో కాలేయం మీద మచ్చలు పడతాయి. కాలేయం పనితీరు సన్నగిల్లుతుంది. ఇది చివరికి లివర్ ఫెయిల్యూర్ కు కారణం అవుతుంది. ప్రాణాంతకం కూడా కావచ్చు.


రోజుకు నాలుగు డ్రింక్స్ కంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వారి జన్యు విశ్లేషణలో ఆల్కహాల్ సంబంధిత వ్యాధుల బారిన పడిన 14 శాతం ఎక్కువగా ఉన్నట్టు నిర్ధారణ జరిగింది. అంతేకాదు వీరిలో స్ట్రోక్ బారిన పడే ప్రమాదం కూడా ఎక్కువే.


ఆల్కహాల్.. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మూడు మిలియన్ల మరణాలకు కారణమవుతోంది. వారానికి 14 యూనిట్లకు మించి ఆల్కహాల్ తాగకూడదని ఈ అధ్యయనం సూచిస్తోంది. 14 యూనిట్లు.. ఆరు బీర్ బాటిళ్లు, 10 చిన్న గ్లాసుల వైన్ కు సమానం.


Also read : వేసవిలో షవర్, బాత్ టబ్‌లో స్నానం యమ డేంజర్ - ఈ బ్యాక్టీరియా ప్రాణం తీస్తుందట!


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.