ఇంట్లో ఉప్మా చేస్తే చాలా వరకు మిగిలిపోతుంది. కారణం ఎక్కువమందికి నచ్చకపోవడమే.అలా ఉప్మా మిగిలిపోయినప్పుడు పడేయకుండా బోండాలు చేసుకుని తింటే బావుంటాయి. పిల్లలకు ఇవి బాగా నచ్చుతాయి. ఉప్మా తినని పిల్లలకు ఇలా బోండాలు చేసి పెడితే తినేస్తారు. ఆలూ బోండాలాగే ఉప్మా బోండాలు కూడా చాలా రుచిగా వస్తాయి.
కావాల్సిన పదార్థాలు
వండిన ఉప్మా - రెండు కప్పులు
బియ్యప్పిండి - రెండు స్పూన్లు
కారం - అర టీస్పూను
వాము - అర టీస్పూను
బేకింగ్ సొడా - పావు టీస్పూను
శెనగపిండి - ఒక కప్పు
నీళ్లు - తగినన్ని
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయిండానికి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
తయారీ ఇలా
1. ఉప్మా మీకు నచ్చిన విధంగా వండుకోవాలి. చల్లారాక వాటిని ఉండలుగా చుట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండి, బేకింగ్ సోడా, బియ్యప్పిండి, వాము, కారం, ఉప్పు వేసుకుని బాగా కలపాలి.
3. కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుని ఉండలు కట్టకుండా కలపాలి. బోండాలు వేసుకోవడానికి వీలుగా చిక్కగా కలుపుకోవాలి.
4. కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలపాలి.
5. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. నూనె వేడెక్కాక రుబ్బులో ముంచుకున్న ఉప్మా ఉండల్ని తీసి నూనెలో వేసి వేయించాలి.
7. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే మంచి రుచిగా ఉంటాయి.
ఉప్మా అనే పదం ఉప్పు, మావు అనే రెండు తమిళ పదాల నుంచి పుట్టింది. అదే తెలుగు ఉప్మాగా మారింది. ఉప్మాను కొంతమంది బొంబాయి రవ్వతో చేస్తే, మరికొందరు గోధుమ నూకతో చేస్తారు. ఉప్మా తినడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది తినడం వల్ల చాలా త్వరగా జీర్ణం కాదు. పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఉప్మా మంచి ఎంపిక.
Also read: బిర్యానీల్లో వాడే ఈ మసాలా పేరేంటో తెలుసా? అది మొక్కల నుంచి రాదు
Also read: దీర్ఘకాలం నుంచి శరీరం దురద పెడుతోందా? అది క్యాన్సర్ కూడా కావచ్చు