మీకు చాక్లెట్లంటే బాగా ఇష్టమా? వాటి రుచికి బాగా అలవాటు పడిపోయారా? అయితే, మీరు ఈ విషయం తప్పకుండా తెలుసుకోవల్సిందే. కొన్ని చాక్లెట్లలో పసువుల రక్తాన్ని కలుపుతారట. వామ్మో.. అనుకుంటున్నారా? డోన్ట్ వర్రీ.. ఇండియాలో విక్రయించే చాక్లెట్ బ్రాండ్లు ఇంకా ఆ సాంప్రదాయాన్ని అరువు తెచ్చుకోలేదు. ఈ ట్రెండ్ కేవలం రష్యాలో మాత్రమే అమల్లో ఉంది.


మీరు ఎప్పుడైనా రష్యా వెళ్లినట్లయితే.. తప్పకుండా మీరు తినే చాక్లెట్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే.. వాటిలో ఆవు రక్తాన్ని కలుపుతారట. ఇదేదో కొత్తగా ప్రవేశపెట్టిన ట్రెండ్ కాదు. రష్యాలో ప్రాచీన కాలం నుంచి రక్తాన్ని ఆహారంలో కలుపుకుని తినే సాంప్రదాయం ఉందట. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే మీరు.. గూగుల్‌లో Hematogen అని సెర్చ్ చేసి చూడండి. ఆగండి.. ఆగండి.. మీకంత శ్రమ ఎందుకు? ఆ చాక్లెట్ గురించి ఆసక్తికర విషయాలను ఇక్కడే తెలుసుకోండి. అప్పటికీ నమ్మకం కలగకపోతే.. సెర్చ్ చేసి తెలుసుకోండి. మరి.. బ్లడ్ చాక్లెట్ల గురించి తెలుసుకుందామా.. 


ఇలాంటివి వినడానికి.. చదవడానికి కొత్తగానే కాదు, చెత్తగానూ ఉండవచ్చు. కానీ, వారు అలాంటి సాంప్రదాయాలను పాటించడం వెనుక తప్పకుండా ఒక మంచి కారణం ఉంటుంది. హెమటోజెన్ (Hematogen) అనేది రష్యాలో మాత్రమే లభించే అరుదైన చాక్లెట్ లేదా కాండీ బార్. వాస్తవానికి ఇది ఒక మెడికల్ ప్రొడక్ట్. అయితే, పిల్లలు ఇష్టపడేలా దీన్ని.. చక్కెర, పాల మిశ్రమానికి వెనిలా రుచిని జోడించి చాక్లెట్‌లా తయారు చేస్తారు. ఇందులో సుమారు 5 శాతం ఆవు రక్తాన్ని కలుపుతారు. తియ్యగా ఉండటం వల్ల పిల్లలు మారం చేయకుండానే తినేస్తారు. 

రక్తాన్ని ఎందుకు కలుపుతారు?: పిల్లల్లో ఏర్పడే రక్తహీనత (Anemia), పోషకాహార లోపం (Malnutrition) తదితర సమస్యలకు ఈ చాక్లెట్లను ఔషదంగా భావిస్తారు. అలాగే, రష్యాలో చలి తీవ్రత కూడా ఎక్కువ. రక్తాన్ని కలిపిన చాక్లెట్లు తినే చిన్నారులకు అక్కడి చలిని తట్టుకోనే శక్తి వస్తుందట. అలాగే గోళ్లు, జుట్టు, చర్మ సంబంధిత సమస్యలు కూడా దరిచేరవట. వాస్తవానికి ఇది పూర్వికుల సాంప్రదాయం. ఒకప్పుడు జంతువుల నుంచి తీసిన తాజా రక్తాన్ని వేడి వేడి ఆహారం మీద వేసుకుని తినేవారట. రక్తం ఎక్కువ రోజులు నిల్వ ఉండదనే ఉద్దేశంతో చాక్లెట్లు, ఇతర ఆహార పదార్థాలను తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ సాంప్రదాయం రష్యాలో ఇప్పటికీ అమల్లో ఉందట. రష్యా, దాని పొరుగు దేశాల్లో కూడా ఈ చాక్లెట్లు లభ్యమవుతాయి. 


Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!


చాక్లెట్ తయారీదారులు నేరుగా దీన్ని ప్రాసెస్ చేసిన ఆవు రక్తాన్ని ఇందులో కలిపామని చాక్లెట్ కాగితం మీద రాయరు. టెక్నికల్‌గా.. దాన్ని ‘బ్లాక్ ఫుడ్ అల్బుమిన్’ అని పేర్కొంటారు. ఈ చాక్లెట్ చాలా మృదువుగా.. చూడగానే నోరూరించే చాక్లెట్ బార్‌లా కనిపిస్తుంది. రుచి కూడా బాగానే ఉంటుంది. కానీ, కాస్త మెటాలిక్ రుచిని కలిగి ఉంటుంది. రక్తం మంచిది కదా అని మీరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయకండి. ఎందుకంటే అది అలర్జీలకు కూడా తయారు చేవచ్చు. ఈ చాక్లెట్లలో శుభ్రం చేసిన స్వచ్ఛమైన హిమోగ్లోబిన్ మాత్రమే కలుపుతారు. ఎన్నో పరీక్షల తర్వాతే మార్కెట్లో విక్రయిస్తారు. 


Also Read: సోయా తింటే పురుషుల్లో ఆ శక్తి తగ్గుతుందా? సంతానం కష్టమేనా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి