ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి నిద్ర చాలా ముఖ్యం. అలసిన శరీరానికి విశ్రాంతి చాలా అవసరం అందుకే రాత్రి నిద్రకి అధిక ప్రాధాన్యత ఇస్తారు. శరీరం తిరిగి శక్తిని పొందటం కోసం ప్రతిరోజు కనీసం 7-9 గంటలు నిద్రపోవాలని చెబుతారు. కానీ మనలో చాలా మందికి నిద్రలేమి సమస్యలు, ఒత్తిళ్ళ కారణంగా కంటి నిండా నిద్ర కరువైంది. అటువంటి వారికి పవర్ న్యాప్స్ చక్కగా ఉపయోగపడతాయి. అదేనండీ అప్పుడప్పుడూ కాసేపు కునుకు. రోజు మొత్తం మీద పగటి వేళ కనీసం 8 నుంచి 30 నిమిషాల వరకు చిన్న కునుకు తీయడం మంచిదట. ఎప్పుడైనా, ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. రోజులో వేర్వేరు సమయాల్లో పవర్ న్యాప్స్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పవర్ న్యాప్స్ కి రోజులో సరైన సమయం ఉందా?
పగటి పూట పవర్ న్యాప్ తీసుకోవడానికి సరైన సమయం లేదని నిపుణులు అంటున్నారు. అది వ్యక్తి వ్యక్తిగత కారకాలపై ఆధారపడి ఉంటుంది. ఉదయం 9-5 వరకు పనిలో ఉండే వ్యక్తులు నిద్రించడానికి ఉత్తమ సమయం భోజనం తర్వాత లేదా మధ్యలో కూడా తీసుకోవచ్చు. కొన్ని సార్లు ఇది మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల మధ్య ఉంటుంది. సాయంత్రం 4 తర్వాత నిద్రపోవడం అంత ఆరోగ్యం కాదు. ఎందుకంటే పగటి పూట ఆలస్యంగా నిద్ర పోతే అది రాత్రిపూట నిద్రకు అంతరాయం కలిగిస్తుంది. సిర్కాడియన్ రిథమ్ కి ఆటంకం ఏర్పడుతుంది.
అప్పుడప్పుడు కునుకు మంచిదే కదా అని గంటలు గంటలు పడుకుంటే మాత్రం మెదడు పనితీరుని గణనీయంగా దెబ్బతీస్తుంది. అందుకే ఎక్కువ సేపు కాకుండా కొన్ని నిమిషాల నిద్ర ఆరోగ్యానికి మంచి చేస్తుంది.
పవర్ న్యాప్ ఆరోగ్య ప్రయోజనాలు
రెగ్యులర్ పవర్ న్యాప్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. సృజనాత్మకత బాగుంటుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే అవకాశం ఉంది. గుండె ఆరోగ్యానికి అప్పుడప్పుడు కునుకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
దుష్ప్రభావాలు ఉన్నాయ్
రెగ్యులర్ న్యాపింగ్ వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. రోజుకి గంట లేదా అంతకంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారికి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 1.82 రెట్లు ఎక్కువ అని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే కాసేపు కునుకు మాత్రమే ఆరోగ్యకరం. కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా కూడా తరచూ నిద్రవస్తుంది.
పవర్ న్యాప్స్ Vs మెడిటేషన్
ఇవి రెండు పూర్తి భిన్నంగా ఉంటాయి. ధ్యానం చేసే వాళ్ళు స్పృహలో ఉంటారు. కానీ నిద్రపోయేవాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళతారు. రెండింటి వల్ల రక్తపోటు, ఒత్తిడి స్థాయిలు, ఆందోళన తగ్గడంతో పాటు మెరుగైన మానసిక స్థితి ఏర్పడుతుంది. ధ్యానం చేయడం వల్ల మనసు, శరీరం ప్రశాంతంగా ఉంటాయి. 18-60 సంవత్సరాల వయస్సు వాళ్ళు కనీసం 7 లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోవడం వల్ల రోగనిరోధక్ వ్యవస్థ బాగుటుంది. గుండెని రక్షించడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరు బాగుంటుంది.
దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడే వాళ్ళకి తగినంత నిద్రలేకపోవడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, ఊబకాయం, డిప్రెషన్ కు గురవుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మీ బుజ్జాయి చర్మ సంరక్షణ ఎలా చేస్తున్నారు? ఈ జాగ్రత్తలు తప్పనిసరి