చిన్న పిల్లలు పక్క తడపడం సహజం.కానీ కొందరు పెద్ద వాళ్లు కూడా పక్క తడుపుతుంటారు. అది చాలా చిన్న విషయంగా భావిస్తారు. అది ఒక ఆరోగ్యసమస్యగా గుర్తించే వారు చాలా తక్కువ. నిద్రలో అసంకల్పితంగా మూత్రవిసర్జన చేయడం అనేది ప్రాణాంతక ఆరోగ్య సమస్యకు కారణం కావచ్చని ఒక కొత్త అధ్యయనం చెప్పింది. కార్డియక్ అరిథ్మియా అని పిలిచే గుండె వ్యాధి లక్షణంగా కొన్ని సార్లు పక్క తడపడాన్ని కూడా పరిగణించాల్సి వస్తుందని తెలిపింది. కార్డియాక్ అరిథ్మియా అంటే గుండె లయ తప్పడం. ఒక్కోసారి చాలా వేగంగా కొట్టుకుంటుంది, ఒక్కోసారి చాలా నెమ్మదిగా కొట్టుకుంటుంది. ఇలా కొట్టుకోవడం వల్ల అవయవాలకు రక్తం పంపిణీ సక్రమంగా జరగదు. ఒక్కోసారి ఈ పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుంది.
ఆమె మరణంతో...
పక్కతడపడాన్ని వైద్యపరిభాషలో ‘ఎన్యూరెసిస్ నోక్టర్నా’ అని పిలుస్తారు. ఈ సమస్యకు చికిత్స చేసే వైద్యులు సాధారణంగా మూత్రమార్గాన్ని, శరీర నిర్మాణాన్ని చెక్ చేస్తారు. అలాగే మూర్ఛ, స్లీప్ అప్నియా వంటి రోగాలు ఉన్నాయేమో చూస్తారు. మత్తుమందుల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటరు.కానీ 23 అమ్మాయి మరణం పక్క తడపడాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని వైద్యులకు తెలిసేలా చేసింది. ఆమెకు గుండె అతి వేగంగా కొట్టుకునే క్యూటీ సిండ్రోమ్ ఉంది. మరణించే ముందు రెండు సార్లు నిద్రలో పక్క తడిపింది. అంతకు మించి మరే లక్షణం బయటపడలేదు. దీంతో పక్క తడపడాన్ని కూడా కచ్చితంగా ఒక లక్షణంగా పరిగణనలోకి తీసుకోవాలని తెలిసింది పరిశోధకులకు.
సర్వే చేస్తే...
వీరు పక్కతడపడం అనే సమస్య వచ్చిన రోగికి ఎలాంటి పరీక్షలు చేయించుకోమని చెబుతారో తెలపాలంటూ ఓ ఆన్ లైన్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే పూర్తిగా వైద్యుల కోసం. ఈ సర్వేలో 346 మంది వైద్యులు స్పందించారు. వారిలో చిన్నపిల్లల డాక్టర్లు, వైద్యవిద్యార్థులు, ఫ్యామిలీ డాక్టర్లు, చాలా సీనియర్ వైద్యులు కూడా ఉన్నారు. వారిలో అధికశాతం మంది యూరిన్ ఎనాలసిస్ (మూత్ర పరీక్ష), మూత్రపిండాలకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించుకోమని చెబుతామని తెలిపారు. మరికొందరు మధుమేహం, మూత్రవిసర్జనలో అసాధారణతలు తెలుసుకునేందుకు కూడా పరీక్షలను రాస్తామని తెలిపారు. కేవలం ఒక శాతం మంది వైద్యులు మాత్రమే ఎలక్ట్రో కార్డియోగ్రాఫ్ పరీక్ష సూచిస్తామని తెలిపారు.
దీన్ని బట్టి చాలా వైద్యులకు దీర్ఘకాలిక పక్కతడిపే సమస్య వల్ల రాత్రి పూట అరిథ్మోజెనిక్ మూర్ఛలు సంభవించే అవకాశం ఉందని వైద్యులలో ప్రాథమిక అవగాహన లేదని చెప్పారు అధ్యయనకర్తలు. ఇది తమను చాలా ఆశ్చర్యపరిచిందని తెలిపారు. పక్క తడిపే అలవాటు ఉన్నవారిలో గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవాలని, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ తో ఇది గుర్తించడం చాలా సులభమని అన్నారు. తగిన చికిత్స సకాలంలో అందించకపోతే ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు.