Wet Hair Care : కొన్నిసార్లు పెద్ద పెద్ద తప్పులే కాదు.. చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. జుట్టు విషయంలో కూడా అంతే. తెలియకుండా చేసే చిన్న పొరపాట్లే జుట్టు రాలడానికి కారణమవుతాయి. ముఖ్యంగా తలస్నానం చేసేప్పుడు తెలియకుండా చేసే తప్పుల వల్ల మీ జుట్టు రాలిపోవడంతో పాటు.. డ్యామేజ్ అయ్యే అవకాశాలే ఎక్కువ. పైగా జుట్టు రాలిపోతుందని ఒత్తిడి తీసుకున్నా కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందట. చలికాలంలో వాతావరణంలో మార్పుల వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. ఇంతకీ తలస్నానం చేసేప్పుడు రెగ్యూలర్​గా చేసే తప్పులేంటి? జుట్టు సంరక్షణ, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


అమ్మో వేడి వేడి నీళ్లే..


చలికాలంలో చల్లని నీటితో స్నానం చేయడం కాస్త కష్టమే. కానీ కొందరు తలస్నానం చేసేందుకు వేడి వేడి నీళ్లను ఉపయోగిస్తారు. జుట్టును డ్యామేజ్​ చేసే వాటిలో వేడి నీళ్లు కూడా ఓ కారణమే. వేడినీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజమైన నూనెలు దూరమైపోతాయి.  స్కాల్ప్, జుట్టు పొడిబారి డ్యామేజ్​ హెయిర్​ ఇస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలిపోవడానికి కారణమవుతుంది. అయితే మీరు గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు. ఇవి తలని మృదువుగా శుభ్రం చేయడంతో పాటు.. జుట్టులోని సహజమైన తేమను కోల్పోకుండా చేస్తాయి. 


షాంపూను ఎక్కువగా వాడేస్తే..


జుట్టుకు త్వరగా నురగ రావాలని, లేదా ఎక్కువ షాంపూ ఉపయోగిస్తే జుట్టుకు మంచిదని చాలా మంది భావిస్తారు. దానిలో భాగంగానే తలకు ఎక్కువ షాంపూ అప్లై చేస్తారు. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు పొడిబారిపోతుంది. అంతేకాకుండా జుట్టు సహజమైన తేమను కోల్పోయి గడ్డి మాదిరిగా తయారవుతుంది. కాబట్టి షాంపూను తక్కువగా ఉపయోగించాలి. పైగా నేరుగా షాంపూను తలకు అప్లై చేయకుండా.. దానిని కాస్త నీటితో డైల్యూట్ చేసి స్కాల్ప్​కు అప్లై చేయాలి. ఈ చిట్కా వల్ల షాంపూ వినియోగం కూడా తగ్గుతుంది. అయితే మీరు ఏ షాంపూ ఉపయోగించినా అది సల్ఫేట్, పారాబెన్ ఫ్రీ ఉండేవి ఎంచుకోండి. 


కండీషనర్​ పెట్టకుంటే కష్టమే


తలస్నానం అంటే షాంపూ లేదా కుంకుడు కాయలతో తల అంటుకోవడమే అనుకుంటారు చాలామంది. అందుకే షాంపూ తర్వాత జుట్టును అలాగే వదిలేస్తారు. అయితే జుట్టుకు షాంపూ ఎంత ముఖ్యమో.. దాని వెంటనే కండీషనర్​ అప్లై చేయడం కూడా అంతే ముఖ్యం. జుట్టును కండీషనింగ్ చేయకుండా అది పొడిబారిపోయి.. చిక్కులతో నిండిపోయి ఉంటుంది. చివర్లు చిట్లిపోతాయి. ఈ సమస్య రాకూడదంటే.. మీ జుట్టుకు కండీషనర్​ అప్లై చేయాలి. స్కాల్ప్​కు కండీషనర్​ అప్లై చేయకూడదు. అయితే కండీషనర్ అప్లై చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును బాగా కడగండి. ఇది మీకు ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తుంది. 


జుట్టును ఆరబెట్టేందుకు టెక్నిక్స్


తలస్నానం చేసిన తర్వాత స్కాల్ప్ సున్నితంగా మారుతుంది. జుట్టులో కూడా బలం తగ్గిపోతుంది. ఆ సమయంలో జుట్టును ఆరబెట్టుకునేందుకు కొందరు టవల్​తో జుట్టును తెగ బాదేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు డ్రై అవ్వడం కాదు.. బాగా రాలిపోతుంది. అంతేకాకుండా జుట్టు తెగిపోయేలా చేస్తుంది. కాబట్టి తలస్నానం తర్వాత మీ జుట్టును కాస్త సున్నితంగా హ్యాండిల్ చేయండి. టవల్​తో జుట్టును మెత్తగా ఒత్తి, తడుతూ ఆరనివ్వండి. 


తడి జుట్టుపై హీటింగ్ టూల్స్ వద్దు


మేము చాలా బిజీగా ఉన్నాము. మాకు జుట్టును ఆరబెట్టుకునే సమయం లేదని.. డ్రయర్స్, హీటింగ్ టూల్స్ జోలికి వెళ్లకండి. జుట్టును స్మూత్ చేయడం కోసం, కర్ల్స్ చేయడం కోసం తడిజుట్టుపై ఎలక్ట్రిక్ టూల్స్ ఉపయోగించకండి. ఇది మీ జుట్టు రాలిపోయేలా, పొడిబారేలా చేస్తుంది. దాదాపు హీటింగ్ టూల్స్​కి దూరంగా ఉంటేనే మంచిది. కానీ తప్పదు అనుకున్నప్పుడు ఆరిన జుట్టుకు.. హీటింగ్ ప్రొటెక్టర్​ అప్లై చేసి.. జుట్టును డిజైన్ చేసుకోవచ్చు.


స్కాల్ప్ సంరక్షణ


జుట్టు మొత్తం పోషణ స్కాల్ప్​పై ఆధారపడి ఉంటుంది. స్కాల్ప్​ ఎంత బాగుంటే.. మీ జుట్టు అంత ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మీ జుట్టును సంరక్షించుకునేందుకు మీరు ఎక్స్​ఫోలియేట్ చేయవచ్చు. ఇది జుట్టుకు మాయిశ్చరైజ్ అందిచడమే కాకుండా.. హెయిర్​ గ్రోత్​ను ప్రమోట్ చేస్తుంది. ఇవే కాకుండా తీసుకునే ఆహారం కూడా జుట్టుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి హెల్తీ ఫుడ్​ని తీసుకుంటూ.. జుట్టును హెల్తీగా ఉంచుకోండి. 


Also Read : చలికాలం​లో ఆ జబ్బులు రాకూడదంటే ఈ కూరగాయాలు తినండి