Winter Vegetables For Good Health : శీతాకాలంలో చాలామంది ఊరికే అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. వాతావరణంలో వచ్చే మార్పులవల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ సమయంలో హెల్తీగా ఉండడం చాలా అవసరం. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. కాబట్టి వ్యాయామంతో పాటు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ద వహించాలి. ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో.. వాటిని ఏవిధంగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


చిలగడదుంపలు


చిలగడదుంపల్లో (Sweet Potato) పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి శీతాకాలంలో విరివిగా దొరుకుతాయి. ఈ మధ్యకాలంలో ప్రతి సీజన్​లోనూ ఇవి లభ్యమవుతున్నాయి. బీటా కెరోటిన్ అధికంగా దీనిలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా చలికాలంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా ఇవి సహాయం చేస్తాయి. దీనిలోని డైటరీ ఫైబర్​.. జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వాటిని ఉడకబెట్టి.. లేదా కాల్చి.. సూప్​లలో కలిపి తీసుకోవచ్చు. 


బీట్​రూట్​


బీట్​రూట్​(Beetroots)లు పూర్తిగా పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలోని ఫోలేట్​, పొటాషియం, డైటరీ ఫైబర్​ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ఈ దుంపలలో ఉండే నైట్రేట్​లు రక్తపోటును, హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని కూరల్లో, ఫ్రై రూపంలో, సలాడ్స్, జ్యూస్​ల రూపంలో తీసుకోవచ్చు. అంతేకాకుండా వీటితో టేస్టీ, హెల్తీ స్మూతీలు తయారు చేసుకోవచ్చు. 


క్యారెట్లు


చలికాలంలో విరివిగా లభించేవాటిలో క్యారెట్లు (Carrots) ఒకటి. వీటిలో సి, బీటా కెరోటిన్​తో నిండి ఉంటాయి. బీటా కెరోటిన్​ను మన శరీరం విటమిన్ ఎగా మారుస్తాయి. ఇది మీకు కంటి ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు.. బలమైన రోగనిరోధక శక్తిని అందిస్తుంది. చలికాలంలో స్కిన్ కేర్ చాలా అవసరం. హెల్తీ స్కిన్ కోసం కూడా మీరు క్యారెట్లు తీసుకోవచ్చు. 


ముల్లంగి


ముల్లంగి (Raddish) విటమిన్​ సికి మంచి మూలం. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు సహాయం చేస్తుంది. ముల్లంగిలో ఫైబర్​, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. మీరు ఆరోగ్యరీత్యా సమతుల్యమైన ఆహారం తీసుకునేవారు అయితే.. మీరు మీ డైట్​లో ముల్లంగిని చేర్చుకోవచ్చు. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. దీనిని మీరు సలాడ్స్​, ఊరగాయలు లేదా క్రంచీ స్నాక్​గా ఆస్వాదించవచ్చు. 


బ్రోకలీ


బ్రోకలీ(Broccali)తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, డైటరీ ఫైబర్​ పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీలోని యాంటీ ఆక్సిండెంట్లు క్యాన్సర్​కు వ్యతిరేకంగా పోరాడుతాయి. వింటర్​లో దీనిని మీ డైట్​లో చేర్చుకోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిని ఉడికించి, సలాడ్స్, సూప్స్, వివిధ రూపాల్లో కలిపి తీసుకోవచ్చు. 


Also Read : ఆ సమస్యలకు చెక్ పెట్టేందుకు కుంకుమ పాలు కాదు.. టీ తాగండి


క్యాబేజీ..


క్యాబేజీ(Cabbage)లో విటమిన్ సి, కె వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలోని ఫైబర్, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శాఖాహారులకు అద్భుతమైన ఎంపిక. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు.. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. శీతాకాలంలో వచ్చే జలుబు, ఫ్లూ సమస్యలను దరికి రానీయదు. దీనిని చారులో, కూరల్లో, పప్పులో, సలాడ్స్​లో కలిపి తీసుకోవచ్చు.


పాలకూర 


ఆకుకూరలు (Leafy Vegetables) ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా పాలకూర పోషకాలకు పవర్​ హౌస్​ అని చెప్పవచ్చు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో పాటు.. ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనిలోని విటమిన్ కె ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని మీరు పప్పుతో, లేదంటే కూరగా.. సలాడ్​లు, స్మూతీలతో కలిపి తీసుకోవచ్చు. 


ఈ కూరగాయల్ని మీరు మీ డైట్​లో తీసుకుంటే.. శీతాకాలంలో వచ్చే ఫ్లూ సమస్యలను దూరం చేయడమే కాకుండా.. మెరుగైన రోగనిరోధక శక్తి (Immunity Boosters)ని అందిస్తుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.