మొటిమలు అనే సమస్య వినడానికి చిన్నగానే ఉన్నా, బాగా విసుగు కలిగిస్తుంది. ముఖ్యంగా పిల్లలు టీనేజీలోకి రావడం మొదలవగానే ఈ మొటిమలు  రావడం ప్రారంభమవుతాయి. ఎక్కువ మంది పిల్లలకు 8 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులో ఇవి ప్రారంభమవుతాయి. చర్మం పై పొరపైన ఇవి ఏర్పడతాయి. టీనేజ్లో ఇవి రావడానికి కారణం హార్మోన్ల అసమతుల్యత అని చెప్పుకోవచ్.చు ఆ ఏజ్‌లో టీనేజీ పిల్లల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. దానివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మొటిమలు రావడానికి ముఖ్య కారణం. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం మార్పులకు లోనవుతుంది.ఈ సమయంలో చర్మం సహజ నూనె అయినా సెబమ్‌ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. ఈ సెబమ్ వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దీనివల్ల మొటిమలు అధికంగా ఏర్పడతాయి.టీనేజీ పిల్లల్లో మొటిమలు రాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా మూడు పనులు చేస్తే వారిలో మొటిమల వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.


ఒత్తిడి లేకుండా
టీనేజీ పిల్లల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. వారికి ఒత్తిడి సాయిలు ఎలా తగ్గించుకోవాలో తెలియదు. ఆ బాధ్యత తల్లిదండ్రులే తీసుకోవాలి. వాళ్ళకి ఒత్తిడి ఏ విషయాల్లో కలుగుతుందో అర్థం చేసుకొని, ఆ అంశాల్లో సాయం చేయాలి. నిద్రపోవడానికి ఒక గంట ముందు ఫోన్లు, టీవీలు ఆఫ్ చేయాలి. ఇవి కూడా వారిలో తెలియని ఒత్తిడిని పెంచుతాయి.


వ్యాయామం
పిల్లలు పరీక్షలు, చదువుల వల్ల ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడిని వారు బయట పెట్టలేరు. ఎక్కువ గంటల పాటు కూర్చుని చదవడం వల్ల ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి రోజులో గంట నుంచి గంటన్నర వరకు ఆట, వ్యాయామం చేయడం వంటి పనులు చేసేలా చూసుకోవాలి. సైక్లింగ్, యోగా వంటివి శరీరంలో చురుకును పెంచుతాయి. చర్మంపై కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. దీనివల్ల మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది.


ఆహారం 
కొన్ని రకాల ఆహార పదార్థాలను దూరం పెట్టాలి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాదు మొటిమలు వచ్చే అవకాశాన్ని మరింత పెంచుతాయి. కూల్ డ్రింకులు, బిస్కెట్లు, ఎనర్జీ డ్రింక్స్, చిప్స్ ముఖ్యంగా తీపి పదార్థాలు అధికంగా తినకుండా చూసుకోండి. ఇవి తినకపోతే మొటిమలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. వారికి ప్రత్యేకంగా పండ్లు, తాజా కూరగాయలు పెట్టాలి. వీటిలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. అలాగే విటమిన్ ఏ కూడా ఉంటుంది. డ్రై ఆఫ్రికాట్లు, గుమ్మడి గింజలు, ఆకుపచ్చ కూరగాయలు తినిపించడం వల్ల వారి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.


Also read: పిసిఓఎస్ సమస్య ఉంటే మీ ముఖంలో కనిపించే లక్షణాలు ఇవే





























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.