ప్రాచీన కాలం నుంచి అందం పెంచే ఉత్పత్తిగా రోజు వాటర్ వాడుకలో ఉంది. అనేక సౌందర్య ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగిస్తారు. చర్మాన్ని తేమవంతంగా ఉంచడంలో ఇది ముందుంటుంది. రోజ్ వాటర్‌ని దాదాపు అందరూ మార్కెట్లో కొనే తెచ్చుకుంటారు. నిజానికి దీన్ని ఇంట్లో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా నిల్వ చేయడం కోసం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేయచ్చు. కనుక ఇంట్లో తయారు చేసిన రోజ్ వాటర్ అన్ని విధాలా మంచిది. దీన్ని పెద్దలే కాదు, చిన్న పిల్లలకు ఉపయోగించవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. 


ఎలా తయారు చేయాలి
రోజ్ వాటర్‌ను చాలా సులువుగా ఇంట్లో తయారు చేయొచ్చు. తాజా గులాబీ పూల నుంచి రేకులను విడదీయాలి. చిన్న కుండలో లేదా గిన్నెలో నీళ్లు పోసి గులాబీ రేకులను వేయాలి. తక్కువ మంట మీద ఆ నీటిని వేడి చేయాలి. నీటి ఆవిరి వచ్చేవరకు ఉంచి, తర్వాత స్టవ్ కట్టేయాలి. గిన్నెపై మూత పెట్టి 20 నిమిషాలు అలా వదిలేయాలి. గది ఉష్ణోగ్రత వద్దకు ఆ నీరు వచ్చాక, ఒక చిన్న సీసాలో ఈరోజు వాటర్‌ను వేసి మూత పెట్టి ఫ్రిజ్లో నిల్వ చేయాలి. దీన్ని వారం రోజుల వరకు వాడుకోవచ్చు. అవసరమైనప్పుడు మళ్ళీ తయారు చేసుకోవాలి. దీన్ని సహజంగా సేంద్రియ పద్ధతిలోని తయారు చేసాము కాబట్టి, ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే గులాబీలు ఎంచుకునేటప్పుడు సేంద్రీయ పద్ధతిలో పెంచినవే అయి ఉండాలి. వాటిపై మందులు స్ప్రే చేసి ఉండకూడదు. కాబట్టి మీరు ఇంట్లో పెంచుకున్న మొక్కకు పూసిన గులాబీలనే వాడడం ఉత్తమం. బయటకొన్న గులాబీలు అయితే వాటిని శుభ్రం చేసేందుకు చల్లని నీటిలో ముంచండి. త్వరగా మురికి పోతుంది.


ఎన్నో ఉపయోగాలు 
రోజ్ వాటర్‌తో రోజు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మురికి పోతుంది. చర్మాన్ని ఇది హైడ్రేట్ చేస్తుంది. చర్మంలోని Ph బ్యాలెన్స్ నిర్వహించడానికి సహాయపడుతుంది. స్కిన్ టోనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. రోజూ రాత్రి పడుకునే ముందు దూదిని రోజ్ వాటర్‌లో ముంచి ముఖానికి అప్లై చేసుకుంటే చాలా మంచిది.


వంటల్లో ఈరోజు వాటర్‌ను ఉపయోగించవచ్చు. కుకీలు, కేకులు, డిజర్ట్‌లు తయారు చేసేటప్పుడు ఒక చుక్క లేదా ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుంది. యాలకులు, కొత్తిమీర, కుంకుమ పువ్వు, జీలకర్ర, అల్లం వంటివి... వంటకాలకు ఎలా సువాసనను జతచేరుస్తాయో, రోజ్ వాటర్ కూడా అలా మంచి వాసన వచ్చేలా చేస్తుంది. దీన్ని వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు.


Also read: డయాబెటిస్ ఉన్నవారికి ఉత్తమ అల్పాహారాలు ఇవే



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.