టైప్ 2 మధుమేహం ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 6.28% మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగేలా చేసి ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుంది. దీనివల్ల కణాలు శక్తి కోసం చక్కెరను వినియోగించుకోవడంలో విఫలమవుతాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ సూచించే ఆహారాలను తినాలి. ప్రోటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటివి అధికంగా ఉండే ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయం లేచాక అల్పాహారంలో వారు ఏం తింటారు? అనేది ఆ రోజు వారి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే అల్పాహారంలో తినేవి రక్తంలో చక్కెర స్థాయిలను పెరగకుండా చూసేవిగా ఉండాలి. ఇందుకోసం ఐదు రకాల అల్పాహారాలను డయాబెటిస్ రోగుల కోసం సూచిస్తున్నారు వైద్యులు. వీటిని ఇంట్లో చక్కగా వండుకొని తినవచ్చు. వీటిని వండడం కూడా చాలా సులువు. టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ నచ్చేవి.
పోహా
వీటిని బియ్యంతోనే తయారు చేస్తారు. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. పోహాలో కొన్ని రకాల కూరగాయలు కలుపుకొని వండుకుని తింటే మంచిది. ఎంతో ఆరోగ్యకరం కూడా.
దలియా
ఇది ఒక రకమైన ధాన్యం గ్లూటెన్ రహితంగా ఉంటాయి. మధుమేహ రోగులకు ఎంతో మంచివి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి కూరగాయలతో కలిపి వండుకొని తింటే మంచిది.
శెనగ దోశ
శెనగపిండితో ఎక్కువగా పకోడీలు చేసుకుంటారు కానీ, ఆ పిండితో దోశలు వేసుకొని తింటే చాలా మంచిది. శెనగపిండిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. శెనగపిండితో వేసిన అట్లు, దోశెలు అల్పాహారంలో తింటే రక్తంలో చక్కెర పెరుగుదల ఉండదు.
గుడ్లు
గుడ్లలో ప్రోటీన్లు, కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు గుడ్లు మంచివే. ఉదయం లేచాక అల్పాహారంగా ఉడికించిన రెండు గుడ్లను తీసుకుంటే సరిపోతుంది. ఆరోజు లంచ్, డిన్నర్లలో ఇక గుడ్లు తినకూడదు. కేవలం అల్పాహారంగా తింటే చాలు. చాట్ మసాలాను పైన చల్లుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి.
పనీర్ బుర్జీ
పన్నీర్‌లో కొవ్వులు, ప్రోటీన్లు అధికం. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అల్పాహారంలో పనీర్‌ను సన్నగా తరుక్కుని పనీర్ బుర్జీలా చేసుకుని తింటే త్వరగా పొట్ట కూడా నిండిపోతుంది. పనీర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
పైన చెప్పిన అయిదు బ్రేక్ ఫాస్ట్‌లు మాత్రమే అల్పాహారంగా తినడం కొన్నేళ్ల పాటూ కొనసాగిస్తే మీకే ఆరోగ్యంలోని మార్పు కనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు కాబట్టి, ఆ రోజంతా చురుగ్గా ఉంటారు. ఇవి డయాబెటిక్ రోగులకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ ఐడియాలు.
Also read: ప్రేమించండి, ప్రేమను పంచండి - ఇలా చెప్పినందుకే సెయింట్ వాలెంటైన్ ప్రాణాలు తీశారా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.