Winter Hair Care : చలికాలంలో జుట్టు సమస్యలు తప్పవు. ఈ శీతాకాలంలో చల్లగాలులు, గాలిలో తేమ లేకపోవడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు వస్తాయి. చర్మం, స్కాల్ప్ పొడిబారుతుంది. దానిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చుండ్రు గురించి. ఇది మీ తలలో విపరీతమైన దురదను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడానికి ప్రధాన కారణమవుతుంది. చుండ్రు అనేది ఈస్ట్ జాతికి చెందిన ఫంగస్. ఇది కెమికల్ షాంపూలు ఉపయోగించడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. విటమిన్ బి3, బి2, బి6 లోపాల వల్ల కూడా చుండ్రుకు కారణమవుతుంది.
ఇంటి చిట్కాలు
చుండ్రు సమస్యను కొన్ని హోమ్ రెమిడీస్తో తగ్గించుకోవచ్చు. జుట్టు పొడిబారడాన్ని, చుండ్రు సమస్యను తగ్గించడంలో కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టుకు సంబంధించిన ప్రతి సమస్యను దూరం చేయడంలో కొబ్బరి నూనె (Coconut Oil) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు తలస్నానం చేసే పది నిముషాల ముందు కొబ్బరినూనెను స్కాల్ప్‌కు అప్లై చేసి మంచి మసాజ్ ఇవ్వండి. పది నిమిషాలు అలాగే ఉంచండి. అనంతరం తలస్నానం చేసి.. కండీషనర్ అప్లై చేయండి. ఇది చుండ్రును తొలగించడమే కాకుండా.. జుట్టు పొడిబారకుండా చేస్తుంది.
ఆముదం..
తలపై పొడి, చుండ్రు, దురదను తొలగించడంలో ఆముదం (Castor Oil) గొప్పగా పనిచేస్తుంది. దీనికోసం మీరు ఆముదాన్ని అలోవెరా జెల్లో మిక్స్ చేసి.. మీ పొడి తల, ముఖ్యంగా స్కాల్ప్‌పై అప్లై చేయండి. దీనిని మాస్క్‌లాగా 30 నిమిషాలు ఉండనివ్వండి. అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి. ఇలా రెగ్యూలర్‌గా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. జుట్టు తేమతో ఉంటుంది.
కలబంద
దాదాపు ప్రతి ఇంట్లో దొరికే మొక్క ఇది. దీనిలోని ఔషదగుణాలు.. ఆరోగ్యానికి, అందానికి, జుట్టును సంరక్షించుకునేందుకు సహాయం చేస్తాయి. కలబంద(Aloe Vera) యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది మీ స్కాల్ప్‌ను హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయం చేస్తుంది. డ్రై స్కాల్ప్ దూరమైతే.. చుండ్రు కూడా దూరమైపోతుంది.
అరటి మాస్క్
మీ జుట్టుకు మాయిశ్చరైజింగ్ అందించాలి అనుకుంటే.. మీరు హెయిర్ మాస్క్ (Hair Mask) కచ్చితంగా వేసుకోవాలి. వారంలో ఓ రోజు హెయిర్ మాస్క్ వేస్తే జుట్టు సమస్యలు తొలగి మంచి గ్రోత్ వస్తుంది. దీనికోసం అరటిపండు గుజ్జు, తేనె కలిపి మాస్క్ తయారు చేసుకోండి. దీనిని జుట్టుకు అప్లై చేసి అరగంట అలాగే ఉంచండి. ఇది మీ జుట్టుకు తేమను అందించి.. స్కాల్ప్‌పై ఉన్న చుండ్రును తొలగిస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
చుండ్రును తొలగించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్(Apple Cider Venigar) మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి.. కాస్త నీళ్లు వేసి డైల్యూట్ చేయండి. ఇప్పుడు కాటన్ బాల్ తీసుకుని.. దానిలో ముంచి.. తలకు మొత్తంగా అప్లై చేయండి. 5 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేయండి.
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ (Tea Tree Oil) కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. దీనిలోని యాంటీ ఫంగల్, ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రును తొలగిస్తాయి. అయితే ఈ ఆయిల్లో కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. అనంతరం మంచిగా మసాజ్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత షాంపూ చేయండి. ఈ చిట్కాలు వింటర్లో మీ జుట్టును పొడిబారడం, చుండ్రు సమస్యలను తగ్గిస్తాయి. హైడ్రెట్‌గా ఉండడం కూడా అస్సలు మరిచిపోకండి. ఇది మీ మొత్తం ఆరోగ్యంతో పాటు.. జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది.
Also Read : మీరు సడెన్‌గా బరువు పెరుగుతున్నారా? అయితే ఇవే కారణాలు కావొచ్చు