Abnormal Weight Gain Reasons : బరువు పెరగకూడదని.. హెల్తీగా ఉండాలని కొందరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అప్పటివరకు ఫిట్​గా ఉన్నా.. లేదంటే సమానంగానే ఉన్నా.. సడెన్​గా బరువు పెరుగుతారు. అదేంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బరువు పెరిగిపోతున్నామని బాధపడుతున్నారా? అయితే ఇది మీకోసమే. బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అలాగే ఆకస్మికంగా బరువు పెరగడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఆ సంకేతాలు ఏంటో తెలుసుకుని.. సరైన ఆహారం, జీవనశైలిలో మార్పులతో ఈ బరువును తగ్గొచ్చు. 


PCOS (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్)


మహిళలు ఎదుర్కొనే అతి ప్రధాన సమస్యల్లో PCOS ఒకటి. అండాశయాలు కలిగిన వారిని ప్రభావితం చేసే హార్మోన్ల రుగ్మత. ఇది పీరియడ్స్ ఇర్​రెగ్యూలర్​ చేస్తుంది. వంధ్యత్వం, మొటిమలు, జుట్టురాలిపోవడం, బరువు పెరగడానికి కారణమవుతుంది. ఇది మీ శరీరంలో హార్మోన్లను దెబ్బతీసి.. వాటి సమతుల్యతలను డిస్టర్బ్ చేస్తుంది. ఇన్సులిన్​ నిరోధకతకు దారి తీసి.. జీవక్రియలో మార్పులకు కారణమవుతుంది. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అంతేకాకుండా ఆకలి పెరుగుతుంది. క్రమంగా ఇది బరువు పెరిగేలా చేస్తుంది. 


మెనోపాజ్


వయసు పెరిగే మహిళల్లో మెనోపాజ్ చాలా సహజమైనది. ఇది బరువు పెరిగేలా చేస్తుంది. ఎందుకంటే రుతువిరతి సమయంలో హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ముఖ్యంగా శరీరంలో ఈస్ట్రోజన్ స్థాయిలు తగ్గిపోతాయి. ఇది బరువు పెరగాడనికి కారణమవుతుంది. ముఖ్యంగా పొత్తికడుపు చుట్టూ.. కొవ్వు పెరుకుపోయి.. ఆకస్మికంగా బరువు పెరుగుతారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. 


హైపో థైరాయిడిజం


థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేయకపోతే హైపో థైరాయిడిజం వస్తుంది. ఇది ఆకస్మిక బరువు పెరగడానికి కారణమవుతుంది. జీవక్రియను నియంత్రించడంలో థైరాయిడ్ హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. అవి తగినంత లేనప్పుడు.. మీ జీవక్రియ రేటు తగ్గుతుంది. ఇది మీరు బరువు పెరిగేందుకు కారణమవుతుంది. దీనివల్ల త్వరగా అలసిపోతారు. జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది. 


స్టెరాయిడ్స్.. 


కొన్ని కారణాల వల్ల, ఆరోగ్యరీత్యా కొందరు స్టెరాయిడ్స్ తీసుకుంటారు. ఇవి కూడా సడెన్​గా బరువు పెరగడానికి సహాయం చేస్తాయి. యాంటీ డిప్రెసెంట్స్, సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్​టేక్ ఇన్హిబిటర్స్ ఆకలిని పెంచి.. కడుపు నిండిన అనుభూతిని తగ్గిస్తాయి. దీని ఫలితంగా అతి తినేసి.. బరువు పెరిగిపోతారు. 


ఒత్తిడి


ప్రస్తుత కాలంలో ఒత్తిడి అనేది పిల్లలు నుంచి పెద్దలవరకు అందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య. తీవ్రమైన, దీర్ఘకాలిక ఒత్తిడి, ఆకస్మిక బరువు పెరగేలా చేస్తుంది. మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరం కార్టిసాల్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒత్తిడి హార్మోన్​ను పెంచుతుంది. తద్వార మీరు ఎక్కువ కేలరీలు ఫుడ్ తీసుకునేందుకు మొగ్గు చూపుతారు. ఆకలి ఎక్కువ వేస్తుంది. దీనితోపాటు నిద్రసమస్యలు, అలసట, శ్వాస సమస్యలు, అజీర్ణం, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి మొదలైన లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇవన్నీ.. మీరు బరువు పెరగేలా చేస్తాయి. 


సరైన నిద్ర లేకుంటే


మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని.. వ్యాయామలు చేసి.. హెల్తీ డైట్​ తీసుకున్నా సరిగ్గా నిద్రపోకుంటే మీరు కచ్చితంగా బరువు పెరుగుతారు. శరీర బరువును నిర్వహించడంలో నిద్ర చాలా ముఖ్యమైనది. సరైన నిద్రలేకుండా మీ శరీరంలో హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయి. ముఖ్యంగా ఆకలి, జీవక్రియను నియంత్రించే హార్మోన్లు కంట్రోల్ తప్పుతాయి. గ్రెలిన్ అనే ఆకలిని పెంచే హార్మోన్ పెరిగి.. ఎక్కువ తినేలా చేస్తుంది. ఇది మీరు అతిగా తినేలా చేసి.. బరువు పెరిగేందుకు దారి తీస్తుంది. 


మీరు ఏ కారణం వల్ల అయితే బరువు పెరుగుతున్నారో తెలియకుంటే.. వెంటనే వైద్యుని సంప్రదించండి. వారు మీరు ఎందుకు బరువు పెరుగుతున్నారో తెలుసుకుని.. మీకు సరైన సలహాలు ఇస్తారు. అంతేకాకుండా.. మీ శరీరంలో మార్పులు గమనించిన వెంటనే ఎక్కువ ఒత్తిడికి లోనైపోకుండా.. తీసుకునే ఆహారం, డైట్, వ్యాయామాలపై ఎక్కువ ఫోకస్ చేయండి. నిపుణుల సలహాలతో ఆరోగ్యకరమైన రీతిలోనే బరువు తగ్గితే.. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు.


Also Read : చలికాలంలో బిర్యానీ ఆకుల కషాయం తాగితే ఎంత మంచిదో తెలుసా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.