Healthy and Tasty Breakfast : ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలా మంది ఉదయాన్నే మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటారు. వీటిలోని పోషక విలువలు శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. యాంటీఆక్సిడెంట్లకు స్ప్రౌట్స్(Sprouts) పవర్‌హౌస్ లాంటివి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. అయితే ఈ స్ప్రౌట్స్ రోటీన్‌కు భిన్నంగా.. టేస్టీగా తీసుకోవాలంటే దానిలో మరికొన్ని కలిపి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న స్ప్రౌట్స్ ఆరోగ్య ప్రయోజనాలు(Health Benefits) అందించడమే కాకుండా.. సౌందర్య సంరక్షణలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి.
ఎందుకంటే మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్ సి (Vitamin C) పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టు, చర్మానికి మంచి ప్రయోజనాలు అందిస్తుంది. చలికాలంలో కలిగే జుట్టు, చర్మ సమస్యలను ఇది దూరం చేస్తుంది. అంతేకాకుండా వాటికి మెరుగైన పోషణను అందిస్తుంది. స్ప్రౌట్స్‌లో విటమిన్ ఎ(Vitamin A), కె, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరానికి శక్తిని అందించడమే కాకుండా.. రోగనిరోధక శక్తి (Immunity Booster)ని పెంచుతాయి. మధుమేహం(Diabetes)తో ఇబ్బంది పడేవారు దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. మరి దీనిని టేస్టీగా ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
మొలకెత్తిన పెసర్లు - 15 గ్రాములు
శెనగలు - 15 గ్రాములు
పెరుగు - అర కప్పు
నువ్వులు - 1 స్పూన్
ఉల్లిపాయ - 2 స్పూన్ (తరిగినవి)
కీరదోస - సగం (చిన్న ముక్కలుగా కోసుకోవాలి)
దానిమ్మ - 2 టేబుల్ స్పూన్లు
పుదీనా - గుప్పెడు
కొత్తిమీర - గుప్పెడు
వెల్లుల్లి - 2 రెబ్బలు
సాల్ట్ - తగినంత
తయారీ విధానం
ఒక గిన్నె తీసుకుని దానిలో మొలకలు వేయాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని దానిలో పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లి సాల్ట్ వేసి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలో వేసి.. బాగా కలపాలి. దానిలో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, కీరదోస, నువ్వులు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. అనంతరం కొత్తిమీర, దానిమ్మ గింజలతో దానిని గార్నిష్ చేయాలి. అంతే టేస్టీ టేస్టీ స్ప్రౌట్స్ బౌల్ రెడీ.
ఈ టేస్టీ స్ప్రౌట్స్ బౌల్ రెసిపీలో ఉపయోగించే పెరుగు మీకు ప్రోబయోటిక్(Proboitic)గా పని చేసి.. మీ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. రోజూ తీసుకునే స్ప్రౌట్స్కు చెక్ పెట్టి.. కాస్త హెల్తీగా.. అలాగే టేస్టీగా తీసుకోవాలనుకునేవారికి ఇదో మంచి రెసిపీ అవుతుంది. అంతేకాకుండా ఇది మీ కడుపు నిండుగా చేసి.. రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఉండే బద్ధకాన్ని దూరం చేసి.. మీరు యాక్టివ్‌గా ఉండడంలో హెల్ప్ చేస్తుంది.
Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో ఆ అపోహలు నమ్మి తినేస్తున్నారా? జాగ్రత్త
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.