భోజనం చివర్లో పెరుగుతో ముగించనిదే కొంతమందికి అన్నం తిన్న సంతృప్తి ఇవ్వదు. అనేక మంది ఇళ్ళల్లో పెరుగు ప్రధానమైన ఆహారం. ఇది ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలోని చెడు బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్స్ తొలగించేందుకు సహాయపడుతుంది. పెరుగు ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా ఇస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచి అధిక రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. బరువు తగ్గించడంలోను సహాయపడుతుంది. అందుకే పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతారు.


శరీరానికి చలువ చేస్తుందని పెరుగు తినమని అంటారు. మరి వచ్చేది చలికాలం.. జలుబు, దగ్గు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. ఇటువంటి సమయంలో పెరుగు తింటే జలుబు ఎక్కువ అవుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ చలి కాలంలో కూడా పెరుగు తినడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయుర్వేద నిపుణులు చెప్పుకొచ్చారు. కడుపులో ఎసిడిటీ ఏర్పడకుండా pH స్థాయిని బ్యాలెన్స్ చేస్తూ జీర్ణక్రియని మెరుగుపరచడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. బరువు పెరుగుతామనే భయం కూడా అవసరం లేదు. అయితే పెరుగు తినడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. పెరుగు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే ప్రతి రోజు పెరుగు తినకూడదని ఆయుర్వేదం భావిస్తోంది. పెరుగు ఆరోగ్యానికే మంచిదే అయినప్పటికీ మితంగా మాత్రమే తీసుకోవాలి. అందుకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి.


రాత్రిపూట వద్దు


రాత్రి వేళ కఫ దోషం అత్యధికంగా ఉంటుంది. పెరుగు తినడం వల్ల కఫ దోషం పెరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంది. కఫ దోషం పెరగడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది.  అందుకే రాత్రి వేళ ఎక్కువగా పెరుగు తినకూడదని చెప్తారు. దానికి బదులుగా మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


వేడి చెయ్యకూడదు


ఫ్రిజ్ లో పెట్టి తీసిన తర్వాత చల్లగా ఉందని పెరుగు కూడా వేడి చేసేస్తున్నారా? అలా అసలు చెయ్యకూడదు. పెరుగు వేడి చేసి తీసుకుంటే శరీరం వాపుకు దారి తీస్తుంది. అంతే కాదు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది తలెత్తుతుంది. అందుకే పెరుగు ఎప్పుడు వేడి చేయకూడదని ఆయుర్వేదం చెబుతోంది.


రోజూ తినక పోవడమే మంచిది


రోజు పెరుగు తినడం చాలా మందికి అలవాటు. కానీ అలా ప్రతి రోజు తినకూడదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శరీరంలో మంటని పెంచుతుంది. దాని వల్ల శరీరంలో కఫ, పిత్త దోషాలు పెరుగుతాయి. ఆరోగ్యానికి ఇది ఏ మాత్రం మంచిది కాదు. అందుకే రోజు పెరుగు తినే అలవాటు ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నించండి.


రుతుస్రావం అప్పుడు వద్దు


పీరియడ్స్ లో ఉన్నప్పుడు పెరుగు తినకూడదని ఇంట్లో పెద్దలు చెబుతూనే ఉంటారు. అది నిజమే.. ఎందుకంటే పెరుగు వేడిని పెంచుతుంది. దీని వల్ల పిత్త దోషంపెరుగుతుంది. అధిక రుతుస్రావం, నాసికా రక్తస్రావం జరుగుతున్నప్పుడు భోజనంలో పెరుగుని తీసుకోకపోవడమే ఉత్తమం.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఓ మై గాడ్, మీ కాళ్లు ఇలా వాచిపోతున్నాయా? జాగ్రత్త క్యాన్సర్ కావచ్చు!