Tips for Better Sleep : స్క్రీన్ ఎక్కువగా ఉపయోగించడం, ఒత్తిడి, లైఫ్స్టైల్లో మార్పుల కారణంగా పెద్దల నుంచి టీనేజర్స్ వరకు చాలామంది నిద్ర సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఈ రోజుల్లో మంచి నిద్ర అనేది సూపర్ లగ్జరీగా మారింది. అయితే ఆయుర్వేదంలోని కొన్ని చిట్కాలు మెరుగైన నిద్రను అందించడంలో హెల్ప్ చేస్తాయంటున్నారు నిపుణులు. ప్రశాంతమైన నిద్ర కోసం శరీరం, మనస్సును సహజంగా సిద్ధం చేయడంలో ఇవి మంచి ఫలితాలు ఇస్తాయని చెప్తున్నారు. ఇవి నిద్ర నాణ్యతను పెంచడమే కాకుండా.. వాత, పిత్త, కఫ దోషాలను దూరం చేస్తాయంటున్నారు. మరి మెరుగైన నిద్ర కోసం.. ఉదయాన్నే రిఫ్రెష్‌గా మేల్కొనడానికి రొటీన్లో చేర్చుకోగల ఆయుర్వేద చిట్కాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
అభ్యంగ
అభ్యంగ అనేది నువ్వుల నూనె లేదా బాదం నూనెను ఉపయోగించే చేసుకునే మసాజ్. ఇది నాడీ వ్యవస్థను శాంతింపజేయడానికి, ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న నూనెను తీసుకుని గోరువెచ్చగా చేసి.. మీ పాదాలు, తలపై, మెడ, భుజాలపై మసాజ్ చేసుకోవాలి. దీనివల్ల రక్త ప్రసరణను పెరుగుతుంది. కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఆలోచనలు తగ్గించి.. విశ్రాంతిని అందిస్తుంది. హార్మోన్ల సమతుల్యతను, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
గోరువెచ్చగా వాటిని తాగండి
జాజికాయ, అశ్వగంధ, పసుపు లేదా చమోలి వంటి మూలికలతో చేసిన గోరువెచ్చని హెర్బల్ టీలు లేదా గోరువెచ్చని పాలు తాగితే మంచిది. ఇది జీర్ణక్రియను శాంతపరచడమే కాకుండా.. మీ నరాలను శాంతపరచడానికి, మెలటోనిన్ ఉత్పత్తిని సహజంగా ప్రోత్సహించడానికి హెల్ప్ చేస్తుంది. పాలు ఇష్టం లేని వారికి హెర్బల్ టీలు బెస్ట్. నిద్రపోయే ముందు కెఫిన్ లేదా తీపి కలిగిన డ్రింక్స్ తీసుకోకూడదు.
నాస్య
నాస్య అనేది ఎక్కువమందికి తెలియదు. ఆయుర్వేదంలోని ఈ అలవాటు గురించి చాలా తక్కువమందికి తెలుస్తుంది. నాస్యలో భాగంగా నిద్రపోయే ముందు తైలం లేదా నెయ్యి వంటి దానిని కొన్ని చుక్కలు ముక్కు రంధ్రాలలో వేసుకోవాలి. నాస్య నాసికా మార్గాలను సజావుగా చేసి.. మానసిక ఆందోళనను తొలగించడానికి హెల్ప్ చేస్తుంది. ఆలోచనలను శాంతపరచడానికి సహాయపడుతుంది. సైనస్లు, మైగ్రేన్లు లేదా శ్వాస సమస్యలతో నిద్ర సమస్యలు ఎదుర్కొనేవారికి ఇది మంచిది. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం.. ముక్కు మెదడుకు మార్గం. ఈ మార్గాన్ని పోషించి, నాడీ వ్యవస్థను స్థిరీకరించడానికి ఈ ప్రక్రియ హెల్ప్ చేస్తుందని చెప్తారు.
శిరోధార
శిరోధార అనేది నుదుటిపై చల్లని తడి గుడ్డ లేదా ఐస్ ప్యాక్ పెట్టి చేసే పద్ధతి. దీనిని ఎక్కువగా ఆయుర్వేద చికిత్సా కేంద్రాలలో చేర్చుతారు. అయితే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చల్లని లేదా తడి గుడ్డను మీ నుదిటిపై ఉంచి రిలాక్స్ అవ్వాలి. నిద్రపోయే ముందు 5-10 నిమిషాల పాటు డీప్ బ్రీత్ లేదా ధ్యానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆలోచనలను తగ్గి.. ఆందోళన కంట్రోల్ అవుతుంది. వాత దోషాల తగ్గుతాయి. ఈ టెక్నిక్ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
డిజిటల్ డిటాక్స్
ఆయుర్వేదంలో.. నిద్రపోయే ముందు స్క్రీన్ ఎక్స్పోజర్ ఉంటే నిద్రకు అంతరాయం కలిగిస్తుందని చెప్తారు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, LED లైటింగ్ కూడా మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగించే బ్లా రేస్ విడుదల చేస్తాయి. ఇవి పిత్త దోషాన్ని అధికం చేస్తాయి. మిమ్మల్ని చురుకుగా, విశ్రాంతి లేకుండా, ఆందోళనతో ఉంచుతాయి. కాబట్టి ఆయుర్వేదం ప్రకారం నిద్రపోయే కనీసం గంట ముందు పూర్తిగా డిజిటల్ డిటాక్స్ ఫాలో అవ్వాలని అంటున్నారు. గది చీకటిగా ఉంటే.. బెటర్ అని సూచిస్తున్నారు.
ఈ 5 ఆయుర్వేద చిట్కాలు నిద్రను ప్రేరేపించడంతో పాటు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తాయని చెప్తున్నారు. మరి నిద్ర సమస్యలతో ఇబ్బంది పడేవారు హాయిగా వీటిని ఫాలో అయిపోవచ్చు.