కరోనా మహమ్మారి పూర్తిగా పోకముందే వ్యాక్సిన్ వేసుకున్నామనే ధైర్యంతో సామాజిక దూరం పాటించడం, మాస్క్ లు పెట్టుకోవడం మానేశారు. ఫలితంగా ఫ్లూ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో ఫ్లూ కేసుల సంఖ్య ఐదు రెట్లు పెరిగాయని అక్కడి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పెరుగుదల వ్యాప్తిని అడ్డుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్స్ సమయానికి తీసుకోవడం, పోషకాహారం తీసుకుంటూ ఉండటం వల్ల ఫ్లూ బారిన పడకుండా ఉంటారు. ఈ శీతాకాలంలో ఫ్లూ బారిన పడుతున్న వారు ఎక్కువగానే ఉంటున్నారు. జ్వరం, చలి, దగ్గు, ముక్కు కారటం, ఒళ్ళు నొప్పులు వంటివి ఫ్లూ లక్షణాలు. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మీరు కొన్ని పనులు చేయకుండా ఉండటమే మంచిది.
బయట తిరగకుండా ఉండాలి
ఫ్లూ వచ్చిన తర్వాత ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. చల్లటి వాతావరణం ఉంటే అసలు బయటకి రావద్దు. ఇంట్లోనే ఉంటూ పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. చదవడం, టీవీ చూడటం, మనసుకి హాయినిచ్చే సంగీతం వినడం వంటివి చేసుకోవచ్చు. ఆఫీసుకి వెళ్ళడం బయట స్నేహితులు, బంధువులను కలవకుండా ఉండాలి. లేదంటే వారికి ఫ్లూ అంటుకుని వ్యాపించడం ప్రారంభమవుతుంది.
ద్రవాలు తక్కువగా తీసుకోవద్దు
ఫ్లూ నుంచి త్వరగా బయటపడాలంటే ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి. శీతాకాలపు సూపు( చికెన్ సూప్ వంటివి), కెఫీన్ లేని హాట్ హెర్బల్ టీలు అల్లం టీ, చామంతి పూల టీ వంటివి ఫ్లూ తో పోరాదమలూ కీలకమైనవి. అలాగే నిమ్మకాయ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, తాజా పండ్ల రసం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
మంచి ఆహారం తీసుకోవాలి
అనారోగ్యంగా ఉన్నప్పుడు తిండి మీదకి ధ్యాస తక్కువగా ఉంటుంది. కానీ రోగానని ఎదుర్కోవాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి. నారింజ, దానిమ్మ, స్ట్రాబెర్రీ వంటి సీజనల్ పండ్లు తినాలి. ఆకుకూరలు, తాజా కూరగాయలు తినాలి. కారంగా ఉండే మిరియాలు, అల్లం వంటి వాటిని తినాలి. ఇవి వాపుని, నొప్పిని తగ్గిస్తాయి.
ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
ఫ్లూ లక్షణాలు నుంచి ఉపశమనం పొందేందుకు చిన్న చిన్న చిట్కాలు పాటించాలి. ఉదాహరణకి ముక్కు మూసుకుపోయినట్టుగా ఉంటే వేడి నీటితో స్నానం చేయడం, ఆవిరి పట్టడం చేయాలి. ఇవి నాసికా రంధ్రాలు క్లియర్ చేయడంలో సహాయపడతాయి. ఇంకా ఎక్కువ ఇబ్బందిగా ఉంటే మాత్రం వెంటనే వైద్యుడిని కలిసి సరైన చికిత్స తీసుకోవాలి.
వ్యాక్సినేషన్ ముఖ్యం
ఇన్ ఫ్లూఎంజా అనేది టీకా ద్వారా నివారించగలిగిన వ్యాధి. రోగనిరోధక శక్తిని పెంచుకుని ఫ్లూ బారిన పడకుండా ఉండేందుకు టీకాలు తీసుకోవడం మంచిది. పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా ఇన్ఫ్లూఎంజా బారిన పడకుండా పూర్తిగా టీకాలు తీసుకోవచ్చు. పిల్లల కోసం పీడియాట్రిక్ టీకా షెడ్యూల్ ని అనుసరించాలి. ఇక పెద్ద వాళ్ళు అయితే వార్షిక ఫ్లూ షాట్ ని పొందాలి. ఫ్లూ వైరస్ల వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున టీకాలు తీసుకోవడం చాలా అవసరమని డబ్ల్యూహెచ్ఓ కూడా హెచ్చరిస్తుంది.
ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ ఉపయోగించి చేతులు క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. బయట నుంచి వచ్చిన వెంటనే కళ్ళు లేదా ముక్కు, నోటిని తాకకుండా చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అనారోగ్యంగా ఉన్న వారికి దూరంగా ఉండటం మంచిది. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ లు ధరించి తిరగడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఎసిడిటీ వల్ల గుండెల్లో మంటగా ఉంటుందా? ఈ ఆహార పదార్థాలతో తగ్గించుకోవచ్చు