Herbal Beedi In Guntur Kaaram: ఇటీవల విడుదలయిన మహేశ్ బాబు లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’లో ఫ్యాన్స్‌ను ఒక విషయం బాగా అట్రాక్ట్ చేసింది. అదే బీడీ. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ప్రతీ పోస్టర్‌లో మహేశ్ బాబు బీడీ తాగుతూనే కనిపించాడు. దీంతో ఫ్యాన్స్ ఫోకస్ అంతా ఆ బీడీపైనే పడింది. అది నిజమైన బీడీ కాదని, తనకు అసలు స్మోకింగ్ అలవాటు లేదని మహేశ్ బయటపెట్టాడు. సినిమాలో తాను కాల్చింది ఆయుర్వేదిక్ బీడీ అని అన్నాడు. దీంతో అసలు ఆయుర్వేదిక్ బీడీ అంటే ఏంటి అని దాని హిస్టరీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. 


ఏషియాలోనే మొదలు..


ఎక్కువశాతం హెర్బల్ సిగరెట్స్ అనేవి చైనాలోనే తయారు చేస్తారు. ఇందులో దాదాపు 20 రకాల బ్రాండ్స్ ఉన్నాయి. మామూలు సిగరెట్‌లో ఉండే మత్తు పదార్థాలు లేకుండా ఈ హెర్బల్ సిగరెట్స్‌ను తయారు చేస్తారు. అంతే కాకుండా స్మోకింగ్ అలవాటును దూరం చేసుకోవడానికి కూడా ఈ హెర్బల్ సిగరెట్స్ ఉపయోగపడతాయని చెబుతుంటారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మామూలు సిగరెట్స్‌ కంటే హెర్బల్ సిగరెట్సే చాలా డేంజర్ అని కొందరు వాదిస్తున్నారు. మామూలు వాటితో పోలిస్తే.. 2 నుంచి 3 శాతం ఎక్కువ నికోటిన్ శాతం ఉంటుందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా హెర్బల్ సిగరెట్స్ అనేవి ముందుగా ఏషియాలోనే తయారు చేశారు. 1970ల్లో చైనాలో వీటి తయారీని ప్రారంభించిన తర్వాత జపాన్‌లో దశాబ్దం తర్వాత మొదలయ్యింది.


ఆదరణ లభించకపోయినా..


హెర్బల్ సిగరెట్స్ తయారీని ప్రారంభించిన కొత్తలో దీనికి పెద్దగా ఆదరణ లభించలేదు. అయినా కూడా 1990ల్లో చైనా.. వీటి ప్రొడక్షన్‌లో ఆపలేదు. 2000లో కొరియా, తైవాన్, థాయ్‌లాండ్ లాంటి దేశాలు.. ఇలాంటి ప్రొడక్ట్స్‌నే తయారు చేయడానికి రంగంలోకి దిగాయి. ఎన్నో శతాబ్దాలుగా ఆరోగ్యపరమైన అవసరాలకు ఉపయోగపడే హెర్బ్స్‌ను కలిపి ఈ సిగరెట్స్‌ను తయారు చేసేవారు. మామూలుగా సిగరెట్స్ తాగేటప్పుడు వాటిలో ఉన్న కాంపోనెంట్స్ వల్ల కార్సినోజెన్స్ అనేవి మనిషి శరీరంలో చేరుతాయి. ఈ విషయం ఎన్నో ఏళ్లుగా అందరికీ తెలిసిందే. ఇదొక వ్యసనంలా అవ్వడం వల్ల చాలామంది సిగరెట్ మానేయాలని ఉన్నా మానేయలేకపోతారు. అందుకే వాటికి ప్రత్యామ్నాయంగా నికోటిన్ ప్యాచెస్, నికోటిన్ గమ్, హెర్బల్ సిగరెట్స్, ఈ సిగరెట్ లాంటివి మార్కెట్లోకి వచ్చాయి. మామూలు సిగరెట్స్‌లో ఉండే మత్తు పదార్థాలు కాకుండా హెర్బ్స్‌తోనే ముఖ్యంగా హెర్బల్ సిగరెట్స్‌ను తయారు చేస్తారు. 


మానేయడమే మంచిది..


నికోటిన్, నైట్రోసెమైన్స్‌లాంటివి హెర్బల్ సిగరెట్స్‌లో ఎంత శాతంలో ఉంటాయనేది ఇంకా పూర్తిగా తెలియలేదు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హర్బల్ సిగరెట్స్‌లో కచ్చితంగా కొన్ని హానికరమైన ఎలిమెంట్స్ ఉన్నాయని కొందరు పరిశోధకులు భావిస్తున్నారు. కొరియా, చైనా.. ఇలా ఏ దేశంలో హెర్బల్ సిగరెట్స్ తయారీ జరిగినా కూడా అందులో కచ్చితంగా కొన్ని హానికరమైన ఎలిమెంటస్ ఉంటాయని వారు గట్టిగా నమ్ముతున్నారు. మొత్తంగా దీనికి పరిష్కారం ఏంటి అనే ప్రశ్నకు స్మోకింగ్ మానేయడమే పరిష్కారమని శాస్త్రవేత్తలు సమాధానమిస్తున్నారు. మామూలు సిగరెట్స్‌తో పోలిస్తే హెర్బల్ సిగరెట్స్ సేఫ్ అని కంపెనీలు చెప్తున్నా.. అది నిజమని ప్రూవ్ చేసే వెరిఫికేషన్ మాత్రం ఇంకా జరగలేదు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: మహేష్ రికవరీ రేట్ @ 70% - ఐదు రోజుల్లో 'గుంటూరు కారం' వంద కోట్లకు దగ్గరకు వచ్చినా సరే...