Accused in Jagan attack case Goes hunger Strike : కోడి కత్తి కేసులో రిమాండు ఖైదీగా ఉన్న జనుపల్లె శ్రీనివాసరావును జైలు నుంచి విడుదల చేయాలని అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో వారు మీడియాతో మాట్లాడారు. తన తమ్ముడు శ్రీనివాస్‌ను అడ్డుపెట్టుకుని జగన్ ఎన్నికల్లో సీఎం అయ్యారు కానీ దళితుడు అనే కారణంతో శ్రీనివాస్‌పై అందరూ వివక్ష చూపుతున్నారన్నారని శ్రీనివాస్ అన్న సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
కుమారుడు జైల్లో మగ్గిపోతున్నాడని తల్లి ఆవేదన
కోడికత్తి కేసులో తన కుమారుడు సుమారు ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అతడికి ఏమవుతుందోనని భయంగా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. విశాఖ జైలులో గురువారం నుంచి నిరాహారదీక్ష చేయనున్నట్లు శ్రీనివాసరావు తమకు చెప్పినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని సావిత్రి కోరారు. నిందితుడు దళితుడు కాబట్టే ఇప్పటివరకు న్యాయం జరగలేదని అతడి సోదరుడు సుబ్బరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యం చెప్పేందుకు సీఎం జగన్ కోర్టుకు రావడం లేదన్నారు. ‘‘సీఎం మా జిల్లాకు వస్తే ఒక రోజు ముందే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. శ్రీను ఫోన్ చేసి జైలులో నిరాహారదీక్ష చేపడుతున్నట్లు చెప్పాడు. మా కుటుంబం కూడా విజయవాడలో దీక్ష చేపడుతుంది. గురువారం దుర్గమ్మ దర్శనం చేసుకుని దీక్షకు కూర్చుంటాం’’ అని తెలిపారు.
జైల్లోనే నిరాహారదీక్ష చేయనున్న జనపల్లి శ్రీనివాస్
కోడికత్తి కేసులో గత ఐదేళ్లుగా నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్నారు. బాధితుడిగా ఉన్న సీఎం జగన్ నిరభ్యంతర పత్రం ఇవ్వాలని, బెయిల్‌కు అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించినప్పటికీ సీఎం జగన్ ్పందించలేదు. దీంతో శ్రీనివాస్ నేటికి కూడా రిమాండ్ ఖైదీగానే జైల్లో ఉండిపోయాడు. ఈ క్రమంలో తనకు న్యాయం జరిగే వరకూ జైలులోనే దీక్ష చేస్తానని శీను కుటుంబసభ్యులకు చెప్పారు. ఈ కేసులో సీఎం జగన్ బాధితుడు. ఆయన కోర్టుకుహాజరై.., జరిగిందేమిటో వాంగ్మూలం ఇస్తే కేసు విచారణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు కానీ సీఎం జగన్ హాజరు కావడంలేదు.ఈ కారణంతోనే నిందితునికి బెయిల్ రావడం లేదని లాయర్ చెబుతున్నారు.
కింది కోర్టు ట్రయల్ పై హైకోర్టు స్టే
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. కేసులో లోతైన విచారణ జరపాలిని బాధితుడు జగన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చడంతో ఎన్‌ఐఏ కోర్టు ఉత్తర్వులను హైకోర్టులో జగన్ సవాల్ చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసు విచారణ వాయిదా పడింది. శీను దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లకు మోక్షం కలగడం లేదు. గతంలో శీను తల్లి సీజేఐకి.. రాష్ట్రపతికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది.