Hyena In Rajahmundry: ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన హైనా (దుమ్ముల గొండి) జంతువు రాజమండ్రి శివార్లలో తిరుగుతున్నట్టు మాజీ ఎంపీ హర్షకమార్ తెలిపారు. స్వయంగా దాన్ని చూసినట్టు హర్షకుమార్ ABP దేశంతో చెప్పారు. తాను కూడా చూసినట్టు హర్షకుమార్ తనయుడు శ్రీ రాజ్ అంటున్నారు. 


గాడాల పాలచర్ల గ్రామ సమీపంలో హైనాను చూశానని.. తమ తోటలో పని చేసే సిబ్బంది తరచూ హైనా తిరగడం చూసారని శ్రీరాజ్‌ తెలిపారు. ఇదే విషయాన్ని కోరుకొండ DSP దృష్టికి తీసుకెళ్ళామని పరిసర గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. చిన్నపిల్లలు సాయంత్రం సమయాల్లో రోడ్డుపైకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.


సాధారణంగా హైనాలు గుంపుగా తిరుగుతాయి. ఆయితే హర్షకుమార్ చెబుతున్నట్టు ఇక్కడ తిరుగుతోంది దారి తప్పి వచ్చిన ఒకటే హైనా నా లేక వేరే ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. చాలా ఏళ్ళ క్రితం పొలాలకు, తోటలకు దగ్గర్లోని గ్రామాల్లో ఆరుబయట నిద్రపోతున్న పిల్లలపై హైనాలు దాడులు చేసిన ఘటనలను పాత తరం వాళ్ళు చెబుతుంటారు. దుమ్ముల గొండిగా పిలిచే ఈ జంతువులు చాలా బలమైన కోరలు కలిగి ఉంటాయి. చిరుత పులులకు సైతం ఇవంటే చాలా భయం. 


గతంలో గోదావరి జిల్లాలో సంచరించిన పెద్దపులి
ఏడాది క్రితం ఇదే గోదావరి ప్రాంతంలో ఒక ఒంటరి పెద్ద పులి సంచరించడం తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో పెద్ద వార్తగా మారింది. అయితే అది ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేదు. ఛత్తీస్ ఘడ్ ప్రాంతం నుంచి తోడు వెతుక్కుంటూ వచ్చిన ఆ పులి తరువాత దట్టమైన అడవుల్లోకి వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడు హర్ష కుమార్ చూశానని చెబుతున్న  హైనా కూడా అలానే వచ్చిన వైల్డ్ యానిమల్ నా అన్నది తెలియాల్సి ఉంది .