Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో అంగన్‌వాడీలు పోరును ఉద్ధృతం చేశారు. డిమాండ్ల సాధన కోసం నేటి నుంచి నిరవధిక దీక్షలకు దిగారు. విజయవాడలోని ధర్నా చౌక్‌లో అంగన్వాడీ సంఘ జేఏసీ నేతలంతా కలిసి దీక్షలు చేస్తున్నారు. మిగతా జిల్లాల్లో మండలాల్లో కూడా నేతలు నిరసన దీక్షల్లో పాల్గొన్నారు. 


ఇచ్చిన హామీలపైనే పట్టు


పాదయాత్ర టైంలో జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్‌ 12 నుంచి అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారు. వీళ్ల ప్రభుత్వం పలు దఫాలు చర్చలు జరిపింది. వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో సమ్మె కొనసాగుతోంది. ఇంతలో ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంగన్‌వాడీ సిబ్బంది సమ్మెను మరింత తీవ్రం చేశారు. నేటి నుంచి నిరవధిక దీక్షలు చేస్తున్నారు. 


ప్రభుత్వం కవ్విస్తోందని ఆరోపణలు 


తమ డిమాండ్లను ప్రభుత్వ తీర్చకపోగా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని అంగన్ వాడీ సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. వీళ్లకు ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. సంక్రాంతి టైంలో కూడా అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. వినూత్న మార్గాల్లో తమ ఆందోళన చేపట్టారు. విజయవాడలో రోడ్డుపైనే పిండి వంటలు చేశారు. ఇతర జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిరసనలు కొనసాగించారు. అనంతపురంలో అంగన్‌వాడీల దీక్ష శిబిరంలో ఉన్న టెంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారు. దీనిపై అంగన్వాడీ సంఘ నేతలు మండిపడుతున్నారు. అక్కడ మహిళలు లేరు కాబట్టి ప్రమాదం తప్పిందని...లేకుంటే ఘోరం జరిగేదని అంటున్నారు.


ఎన్నికల తర్వాత పెంచుతామని బొత్స హామీ 


ప్రభుత్వం తమ డిమాండ్‌పై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనక్కి తగ్గేది లేదని అంగన్‌వాడి సిబ్బంది అంటున్నారు. అయితే ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. అంగన్‌ వాడీల డిమాండ్లలో పదింటికి ప్రభుత్వం ఓకే చెప్పిందని అన్నారు. సమ్మె కాలంలో జీతాలు ఇస్తమని కూడా చెప్పారు. ఎన్నికల ముందు జీతాలు పెంచడం సరికాదని, రెండు నెలలు ఆగితే వెయ్యి కాదు రెండు వేలు ఇస్తామని అన్నారు. విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం సోమలింగగాపురంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న బొత్స సత్యనారాయణను అంగన్‌వాడీ సిబ్బంది కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని రిక్వస్ట్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ ప్రభుత్వంపై నమ్మకంతో సమ్మె విరమించాలని కోరారు. పెద్ద మనుసతో గర్భిణులకు, బాలితలకు, చిన్న పిల్లలకు అందిస్తున్న సేవలను అందించాలని రిక్వస్ట్ చేశారు.