పాలు ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే. శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించే పాలను ప్రతి రోజు తీసుకోవాలి. ముఖ్యంగా వైరస్‌లు దాడి చేస్తున్న ఈ రోజుల్లో పాలు తీసుకోవడం చాలా అవసరం. వైద్యులు సూచించే పోషకాల్లో పాలు కూడా ఒకటి. కాబట్టి.. మీకు అలవాటు లేకపోయినా కనీసం ఒక పూటైనా తీసుకోండి. లేదా పాల ఉత్పత్తుల్లో ఏదో ఒకటి తీసుకోండి. అలాగని పాలతో తయారయ్యే స్వీట్లు, మిల్క షేక్‌లు మాత్రం తీసుకోవద్దు. దాని వల్ల ప్రయోజనాలు కంటే.. నష్టాలే ఎక్కువ. అయితే పాలను ఏ వేళలో తీసుకోవాలనే సందేహం చాలామందిలో కలుగుతుంది. రాత్రిళ్లు పాలు తాగి పడుకుంటే బాగా నిద్ర పడుతుందని పలువురు భావిస్తే.. కొందరు మాత్రం బరువు పెరిగిపోతామనే భయాన్ని వ్యక్తం చేస్తారు. అయితే, పాలు ఎప్పుడు తీసుకున్నా.. మీకు ఆరోగ్యకరమే అనే సంగతిని మరవద్దు. అయితే, ఆయుర్వేదం మాత్రం.. కొన్ని నిర్దిష్ట వేళల్లో పాలు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారు. మరి ఆ వేళలు ఏమిటో తెలుసుకుందామా.
⦿ ఆయుర్వేదం ప్రకారం పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ఇందుకు ఉదయం లేదా రాత్రి వేళలు మంచిది. ⦿ ఉదయం వేళల్లో పాలు తీసుకోవడం కంటే రాత్రి వేళల్లో తాగడం వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ⦿ పాలల్లో అశ్వగంధను కలిపి తాగితే మంచి నిద్ర వస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ⦿ ఆయుర్వేదం ప్రకారం పాలు తాగేందుకు ఉత్తమ సమయం.. సాయంత్రం నుంచి నిద్రపోయే వేళ వరకు పరిగణించారు.⦿ ఉదయం తీసుకొనే పాలు జీర్ణం కావడానికి కాస్త సమయం పట్టడమే కాకుండా ఎక్కువ శక్తిని కోల్పోతారు. దీనివల్ల నీరసం వస్తుంది.⦿ ఎక్కువగా వ్యాయామం చేసేవారు ఉదయం వేళ పాలు తాగితే అసిడిటీకి గురయ్యే అవకాశం ఉందని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ⦿ 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఉదయం వేళల్లో పాలు తాగడం మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ⦿ పాలతోపాటు ఉప్పగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. ⦿ పాలు బాగా జీర్ణం కావాలంటే సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తీసుకోవడమే మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. ⦿ రాత్రి వేళ పాలు తీసుకోవడం వల్ల అందం, ఆరోగ్యం కూడా లభిస్తుందట. ⦿ పాలలో మత్తు గుణాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిద్రపోయే ముందు పాలు తాగడం ప్రశాంతంగా నిద్రపోతారు. ⦿ పాలలోని సెరోటోనిన్ కంటెంట్ మంచి నిద్రకు ప్రేరేపిస్తుంది. ⦿ రాత్రి వేళల్లో మనం పనులు చాలా తక్కువ చేస్తాం. కాబట్టి పాలులో ఉండే కాల్షియాన్ని శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది.
పోషకాహర నిపుణులు ఏమంటున్నారంటే..: రాత్రి వేళ్లలో పాలు తీసుకోవడం అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు అంటున్నారు. పాలు మెదడు నియంత్రిస్తుంది కాబట్టి.. నిద్రపోయే ముందు పాలు లేదా మరేదైనా ఆహారం తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. శరీరం విశ్రాంతి తీసుకొనే సమయంలో పాలు తాగి.. శక్తిని వినియోగించడం మంచిది కాదని సూచిస్తున్నారు. అయితే, ఆయుర్వేదం మాత్రం రాత్రి పూట మంచి నిద్ర కావాలంటే పాలు తాగడమే మంచిదని తెలుపుతోంది. ఏది ఏమైనా.. మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యులు లేదా ఆహార నిపుణుల సలహాతో రోజూ పాలు తాగండి.
పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: ⦿ రోజూ పాలు తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంతా అనారోగ్యం దరిచేరదు. ⦿ పాలు తాగడం వల్ల మలబద్దకం, గ్యాస్ట్రిక్ సమస్యలు దరి చేరవు.⦿ పాలు తాగడం వల్ల ఒత్తిడి, చిరాకు దూరమవుతుంది. ⦿ జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు పాలు తాగడం మంచిది. ⦿ మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రాత్రిళ్లు పాలు తాగడం మంచిది. ⦿ పాలు శరీరంలో వేడిని దూరం చేస్తుంది.⦿ గొంతు నొప్పి వేదిస్తుంటే కాస్త గోరు వెచ్చని పాలు తాగండి. ⦿ వేడి పాలలో మిరియాలు, పసుపు వేసుకుని తాగడం ద్వారా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ⦿ రాత్రి వేళ పాలు తాడగడం వల్ల పురుషుల్లో హర్మోన్లు చురుగ్గా పనిచేస్తాయి. ⦿ పాలలోని కాల్షియం, సోడియం, పొటాషియం శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి. ⦿ పాలల్లో ప్రోటీన్, విటమిన్ ఎ, బి 1, బి 2, బి 12, డి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి.
Also Read: కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ 5 ఆహారాలను తప్పక తీసుకోవాలి
ఈ వాదనలు కూడా ఉన్నాయి: ⦿ పాలను చక్కెర కలిపి తాగడం కంటే ఉత్తివి తాగడమే ఉత్తమం. ⦿ పాలు అతిగా తాగినా అనార్థమే. పాలు, పాల ఉత్పత్తుల్లో ఆమ్ల, క్షారాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ⦿ రాత్రిళ్లు పాలు తాగిన వెంటనే నిద్రపోకూడదు. నిద్రపోవడానికి కనీసం గంట లేదా రెండు గంటలకు ముందే పాలు తాగాలి. ⦿ పాలల్లో ఎక్కువగా ప్రోటీన్లు రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపడం వల్ల అలర్జీలు ఏర్పడతాయి. ⦿ పాలు అతిగా తాగేవారిలో అసిడిటీ సమస్య వస్తుంది.
Also Read: చర్మం ఇలా మారుతుందా? జాగ్రత్త, అది డయాబెటిస్ వల్ల కావచ్చు!
గమనిక: పాల వల్ల మీకు అలర్జీలు ఉన్నా లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే తీసుకోవాలి. పైన పేర్కొన్న సమాచారం వివిధ అధ్యయనాలు, ఆయుర్వేద వైద్యుల సూచనల నుంచి గ్రహాంచి.. మీ అవగాహన కోసం అందించాం. ఈ సమాచారం వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు.
Also Read: మనుషుల కంటే ముందే అంతరిక్షానికి వెళ్లిన ఆ కుక్క, కోతులు ఏమయ్యాయి?