మనుషుల స్వార్థానికి ఎన్ని మూగజీవాలు బలవుతున్నాయో చెప్పడం కష్టమే. పరిశోధనల పేరిట ఎన్నో జంతువులపై మనం ప్రయోగాలు చేస్తున్నాం. మన మనుగడ సాగాలంటే.. ఇలాంటివి చేయక తప్పదనేది శాస్త్రవేత్తల వాదన. ఇందులోనూ వాస్తవం లేకపోలేదు. ఒక వేళ అవే ప్రయోగాలు మనుషులపై చేస్తే.. అది తప్పకుండా మానవ హక్కుల భంగమే. కానీ, మూగ జీవులకు అలాంటి చట్టాలు వర్తించవు. పైగా వాటి కోసం పోరాడేవారు కూడా ఉండరు. అందుకే.. మనం వాటిపై ఎప్పటికీ పైచేయి సాధిస్తుంటాం. ఔషద ప్రయోగాల కోసం మూగ జీవులను ఉపయోగించుకోవడం కూడా క్రూరత్వమే. కానీ, ఇందుకు మరో మార్గం లేదనే వాదన ఉంది. కానీ, అంతరిక్ష ప్రయోగం కోసం కూడా మూగ జీవులను కక్ష్యలోకి పంపడం మాత్రం క్రూరమైన చర్యే.. అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇందుకు కారణం.. ‘లైకా’ అనే శునకం విషాద గాధే. 


భూమి మీద నుంచి తొలిసారి అంతరిక్షంలో అడుగు పెట్టింది మనుషులు కాదు.. ఒక శునకం. ఔను.. నిజమండి. ఆ శునకం పేరు లైక. సుమారు 64 ఏళ్ల కిందట రష్యాకు చెందిన సోవియెట్ యూనియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ.. తొలిసారిగా ఈ ప్రయోగం చేపట్టింది. అంతరిక్షంలో జీవుల మనుగడ సాధ్యమా.. కాదా.. అని తెలుసుకోవడం కోసం అప్పట్లో పరిశోధనలు జరిగాయి. అయితే, మనుషులను స్పేస్‌లోకి పంపిస్తే ప్రాణాలకే ప్రమాదమని భావించి.. శునకాన్ని పంపించాలని నిర్ణయించారు. 


ఈ సందర్భంగా మూడేళ్ల వయస్సు గల లైక అనే వీధి కుక్కను ఎంపిక చేసి.. దానికి పూర్తిగా శిక్షణ అందించారు. 1957, నవంబరు 3వ తేదీన  80 సెంటీ మీటర్లు పొడవుండే స్పేస్ క్యాప్సుల్‌లో లైకాను ఉంచి ర్యాకెట్(స్పూత్నిక్-2) ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. ఈ సందర్భంగా పరిశోధకులు లైకా హార్ట్ బీట్‌ను పరిశీలించారు. రాకెట్ ద్వారా ఆకాశంలోకి దూసుకెళ్తున్న సమయంలో లైకా అయోమయానికి గురైంది. గుండె వేగంగా కొట్టుకుంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత దాని గుండె దడ తగ్గింది. అంతా బాగుంది కదా అనుకొనే సమయానికి ఊహించని విషాదం చోటుచేసుకుంది. 
 
రాకెట్ భూమి నుంచి 9వ కక్ష్యలోకి చేరగానే లైకాను ఉంచిన స్పేస్ క్యాప్సుల్‌లో క్రమేనా ఉష్ణోగ్రత పెరగడం మొదలైంది. దీంతో 15 సెకన్లలోనే చనిపోయింది. దాదాపు ఏడు రోజులు 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో నిండిన క్యాప్సుల్‌లోనే లైకా పరిభ్రమించింది. అయితే, అది వేడిని తట్టుకోలేక చనిపోయిందా? ఆక్సిజన్ అందకపోవడం వల్ల చనిపోయిందా అనే విషయం మీద స్పష్టత రాలేదు. లైకా అంతరిక్షంలోకి వెళ్లిన కొద్ది గంటల్లోనే చనిపోయింది. కానీ, వెంటనే లైకా భూమి మీదకు తిరిగి రాలేదు. సుమారు ఐదు నెలలు అంతరిక్షంలోనే పరిభ్రమించింది. 2,570 కక్ష్యలు తిరుగుతూ ఏప్రిల్ 14, 1958న తిరిగి భూమి మీదకు చేరింది. కానీ, దాని అవశేషాలు మాత్రం లభించలేదు. ‘లైకా’ ఆడ కుక్క. మగ కుక్కలు ఆకారంలో పెద్దగా ఉంటాయనే ఉద్దేశంతో పరిశోధకులు చిన్నగా ఉండే ఆడ కుక్కను ఎంచుకున్నారు. అయితే, లైకా చేసిన ప్రాణ త్యాగం ఇప్పటికీ పదిలంగా ఉంది. లైకా ఫొటోతో స్టాంప్ కూడా చెలామణిలో ఉంది. 


Also Read: వింత దంపతులు.. అడవిలో నగ్నంగా అనాగరిక జీవితం, ఎందుకంటే..


లైకా ప్రయోగం విఫలమైన తర్వాత పరివోధకులు మరో రెండు కుక్కలను అంతరిక్షంలోకి పంపించారు. 1960 సంవత్సరంలో ఆగస్టు 19న బెల్కా, స్ట్రెల్కా అనే రెండు కుక్కలను స్పెస్‌లోకి వదిలారు. అయితే, అవి విజయవంతంగా ప్రాణాలతో తిరిగి వచ్చాయి. దీంతో రష్యా పరిశోధకుల్లో ఆశలు చిగురించాయి. అప్పటి నుంచి జంతువులను అంతరిక్షంలోకి పంపే సాంప్రదాయానికి స్వస్తి పలికి వ్యోమగామి యురీ గగారిన్‌ను 1961 సంవత్సరం, ఏప్రిల్ 12న అంతరిక్షంలోకి పంపించారు. తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడిగా యురీ గగారీన్ చరిత్రలో నిలిచిపోయారు.  


Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!


కోతులను అంతరిక్షంలో పంపారు: రష్యాకు పోటీగా అమెరికా పరిశోధకులు సైతం జంతువులను అంతరిక్షంలోకి పంపారు. 1960వ సంవత్సరంలో పలు జంతువులను స్పేస్ ఫ్లైట్ ద్వారా అంతరిక్షంలో వదిలినట్లు సమాచారం. చింపాజీలను, కోతులను అంతరిక్షంలోకి వదిలి.. అవి అక్కడి ఉష్ణోగ్రతలను, వాతావరణాన్ని తట్టుకుంటున్నాయా.. లేదా అని ప్రయోగించారు. ఈ సందర్భంగా కొన్ని విజయవంతంగా ప్రాణాలతో తిరిగి రాగా.. మరికొన్ని మాత్రం ప్రాణాలు విడిచాయి. అలాగే ఫ్రాన్స్ సైతం 1967లో రెండు కోతులను అంతరిక్షంలోకి పంపించింది. ఇలా మనుషులు తమ స్వార్థం కోసం అప్పట్లో జంతువులను ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం అలాంటి ప్రయోగాలకు దాదాపు ఫుల్‌స్టాప్ పడినట్లే.