అప్పులు చేయడం కష్టంగా ఉందని .. అయినా అభివృద్ధి చేస్తామని ప్రజల వద్దకు వెళ్తే వారు అర్థం చేసుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు తమ పార్టీ అధినేత, సీఎం జగన్‌కు సలహా ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన అన్నారు. ఈ అప్పుల కుప్పతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని జోస్యం చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలకు వివరించడమే మంచిదని ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు సూచించారు. బ్యాంకులు ఇప్పులు ఇవ్వడడానికి సిద్ధంగా లేవన్నారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకులు ఏపీ ప్రభుత్వానికి రుణాలిస్తే చిక్కుల్లో పడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపీగా చెబుతున్నానని బ్యాంకులకు సలహాలిచ్చారు. 


అదే సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందని రఘురామ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలను పంపించే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని...  అమరరాజా వంటి కంపెనీలే  ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిపోతే కొత్తగా ఎవరు వస్తారని రఘురాజు ప్రశ్నించారు. పరిశ్రమలు రాకుండా అభివృద్ధి జరగదన్నారు. గతంలో ఎయిడెడ్ విద్యా సంస్థల స్థలాల్నిప్రభుత్వం తీసుకుని అప్పులు చేయాలనుకుంటోందని విమర్శలు చేసిన రఘురామ.. తాజాగా ఆలయాల భూములను కూడా ప్రభుత్వం తీసుకోవాలనుకుంటోందని ఆరోపణలు చేశారు.  నెల్లూరులోని వేణుగోపాలస్వామి ఆలయం కింద 100 ఎకరాల భూమి ఉందని దాన్ని లీజుకు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా నడిచే ఆలయాల భూములను తీసుకోవడం సరికాదని పేర్కొన్నారు. ఇంత భూదాహం ఎందుకని రఘురామ ప్రశ్నించారు. దేవుడి సొమ్ముపై కన్నేయడం సరి కాదన్నారు


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వారిని అసభ్యంగా తిడుతూ యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేసే ఎన్నారై చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి అలియాస్ ప్రభాకర్ రెడ్డిపై తానే ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు.  అయితే  తమకు సంబంధం లేదని ఎన్నారై వైసీపీకి చెందిన వాసుదేవరెడ్డి మీడియాప్రకటన విడుదల చేయడాన్ని రఘురామ ఎద్దేవా చేశారు. వాసుదేవరెడ్డి, పంచ్ ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ స్నేహితులని.. వారి ఫేస్ బుక్ పోస్టుల్ని మీడియాలో ప్రదర్శించారు. తమ పార్టీకి ఇబ్బంది అవుతుందనుకుంటే సొంత పార్టీ వారిని కూడా తమ పార్టీకి సంబంధం లేని వారని చెబుతారని విమర్శించారు. 


రఘురామకృష్ణరాజు ప్రతీ రోజూ ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి రోజువారీగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. రోజు రోజుకు విమర్శల ఘాటు పెంచుతున్నారు. ఆయనపై అనర్హతా వేటు వేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.