ఇష్టమైన సినిమా చూస్తూ ఫ్రెంచ్ ఫ్రైస్ బాక్స్ ముందు పెట్టుకున్నారంటే ఎన్ని తింటున్నారో కూడా అర్థం కాదు. సాస్ లో ముంచుకుని తింటూ ఉంటే అప్పుడే అయిపోయాయా అనిపిస్తుంది. ఇప్పుడు యువతకు జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. వాటి రుచి అద్భుతంగా ఉంటుంది. నోరూరించేలా ఉండే వాటికి అందుకే బానిసలుగా మారిపోతున్నారు. వీటి వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కంటే కలిగే హాని ఎక్కువగా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధన వెలుగులోకి వచ్చింది.
చైనాలోని హాంగ్ జౌ పరిశోధకుల వెల్లడించిన దాని ప్రకారం వేయించిన బంగాళాదుంపలు తరచుగా తీసుకోవడం వల్ల డిప్రెషన్, యాంగ్జయిటీ రిస్క్ 7%,12% పెరుగుతున్నాయని తేలింది. ఫ్రై చేయని ఆహారం తీసుకొని వ్యక్తులతో పోలిస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అధికంగా తీసుకునే వారిలో డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. యువకులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.
వేయించిన ఆహారం మానసిక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
డీప్ ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్ తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. దీని మీద చైనా నిపుణులు పరిశోధన అధ్యయనం నిర్వహికహారు. ఈ అధ్యయనం ఫలితాలు PNAS జర్నల్ లో ప్రచురించారు. అయితే ఈ ఫలితాలు ప్రాథమికమైనవి. మానసిక ఆరోగ్య సమస్యలు, వేయించిన ఆహార పదార్థాల మధ్య సంబంధాన్ని ఏర్పరచడంలో నిర్ణయాత్మకంగా ఉండకపోవచ్చని పరిశోధకులు తెలిపారు.
ఈ అధ్యయనం దాదాపు 11 సంవత్సరాలకు పైగా సాగింది. సుమారు 1,40,728 మంది వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. మొదటి రెండేళ్లలో డిప్రెషన్ తో బాధపడుతున్న వ్యక్తులను మినహాయించారు. మిగతా వారికి వేయించిన ఆహారాన్ని, ప్రత్యేకంగా వేయించిన్ బంగాళాదుంపలను తినే 8294 మంది వ్యక్తులలో యాంగ్జయిటీ, 12,375 డిప్రెషన్ కేసులు గుర్తించారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం వల్ల డిప్రెషన్ ప్రమాదాన్ని మరో 2 శాతం పెంచింది. ఇది ఎక్కువగా యువకుల్లో కనిపించింది. ఆందోళన, నిరాశతో బాధపడుతున్న వ్యక్తులు తమ మూడ్ మార్చుకునేందుకు తరచుగా ఆహారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ అనారోగ్య ఎంపికలు అతిగా తీసుకోవడం వల్ల మానసిక కల్లోలం, డిప్రెషన్, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి జీవక్రియ రుగ్మతలకు దారి తీస్తుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా తింటే ఆరోగ్యమే
బంగాళాదుంపలతో కాకుండా క్యారెట్, స్వీట్ పొటాటోతో చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటే నోటికి రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని అందిస్తాయి. అయితే వాటిని నూనెలో వేయించుకోవడం కాకుండా ఆవిరితో ఉడికించుకోవాలి. శరీరానికి కావాల్సిన పోషకాలను చిలగడదుంప అందిస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లతో నిండిన ఫుడ్ ఇది. మధుమేహులు కూడా దీన్ని తీసుకోవచ్చు. మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: నిద్రపోయే ముందు పాలు తాగకూడదా? ఎందుకు?