వైన్, విస్కీ, బీర్, వోడ్కా, టకీలా... ఇలా ఎన్నో రకాల ఆల్కహాల్ మార్కెట్లో విరివిగా దొరుకుతోంది. వీటిని తాగడం చాలా ఫ్యాషన్ గా భావించే వారూ ఉన్నారు. మరికొందరు తాగితాగి బానిసలుగా మారిపోయారు. ఎంత తాగుతున్నామో కూడా తెలియకుండా మద్యాన్ని సేవించే వారి శాతం పెరిగిపోతోంది. మీరు తాగే మద్యం హద్దులు దాటితే... ఆ విషయాన్ని మీ చర్మం చెప్పేస్తుంది అంటున్నారు వైద్యులు. మద్యం అతిగా తాగేవారు డీహైడ్రేషన్ కు గురవుతారు. వారి గుండె, కాలేయం కూడా అనారోగ్యం పాలవుతాయి. ఊబకాయం వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. అతిగా మద్యం తాగుతున్నట్టు కొన్ని లక్షణాలు చర్మంపై కూడా కనిపిస్తాయి. 


చర్మం రంగు
ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే అది శరీరంలో వాపు, మంటకు కారణం అవుతుంది. ఇలా దీర్ఘకాలంలో వాపు, మంట శరీరంలో ఉంటే, అది చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. ఎలా అంటే చర్మం కింద ఉన్న రక్తనాళాలు విస్తరించేలా చేసి, మరింత రక్తం ప్రవహించేలా చేస్తుంది. దీంతో పైన ఉన్న చర్మం ఎరుపుగా మారుతుంది. కొన్నాళ్లకు ‘ఫేషియల్ టెలాంగియోక్టాసియా’ పరిస్థితికి దారి తీస్తుంది. అంటే రక్తనాళాలు చిట్లి, చెంపలు, ముక్కు ఎర్రగా మారిపోతాయి. 


డల్ స్కిన్
అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ చర్మం దాని సహజసిద్ధమైన లక్షణాలను, స్థితిని కోల్పోతుంది. మద్యపానం సెల్యులార్ టర్నోవర్ ని తగ్గిస్తుంది. నిస్తేజమైన ఛాయను (డల్ స్కిన్) ఇస్తుంది. 


బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్
ముఖంపై అధికంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఏర్పడతాయి. అధికంగా ఆల్కహాల్ తాగడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య మొదలవుతుంది. ఇది చర్మాన్ని పొడిగా చేస్తుంది. దీనివల్ల చర్మ రంధ్రాలు మరింత విస్తరిస్తాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పెరుగుతాయి. మొటిమల సమస్య కూడా మొదలవుతుంది. 


ముడతలు ప్రారంభం
మద్యపానం అధికంగా చేసేవారు త్వరగా ముసలివారైపోతారు. అంటే ముఖంపై ముడతలు వచ్చేసి ఎక్కుడ వయసు వారిలా కనిపిస్తారు. డల్ స్కిన్, ముఖంపై గీతలు, మెడపై ముడతలు రావడం ప్రారంభం అవుతాయి. వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది ఆల్కహాల్. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: ఇతడు గజినీల సంఘానికే లీడర్... ఆరుగంటలకోసారి అంతా మర్చిపోతాడు, చివరికి కొడుకు పుట్టిన సంగతి కూడా...


Also read:  భోజనం చేసే మధ్యలో నీళ్లు ఎందుకు తాగకూడదు? తాగితే ఏమవుతుంది?


Also read: ఈ మహమ్మారి లక్షణాలను ముందే తెలుసుకోండి... రాకుండా జాగ్రత్త పడండి


Also read:  తెల్ల బ్రెడ్ లేదా బ్రౌన్ బ్రెడ్... రెండింటిలో ఏది తింటే బెటర్? ఏది తినకూడదు?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి