Cancer Kill: క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా మానవాళిని కలవరపెడుతున్న ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తోంది. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా పుట్టిన పిల్లవాడి నుంచి 80 ఏళ్ళు దాటిన ముసలివాళ్ల వరకూ అందరినీ కబళిస్తోంది. క్యాన్సర్ వ్యాధికి చికిత్స పూర్తిస్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. కొన్ని రకాల క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడం వల్ల ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
క్యాన్సర్ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పలు వైద్య సంస్థలు, శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరుపుతున్నారు. వీటిలో క్యాన్సర్ వ్యాధి మూలకారణం గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. క్యాన్సర్ వ్యాధిపై సింగపూర్‌కు చెందినటువంటి కొందరు శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైనటువంటి అంశాలను వెలుగులోకి తెచ్చారు. క్యాన్సర్ పరిశోధనలకు, చికిత్స రూపకల్పనలో ముందుకు వెళ్లే మార్గంలో, సింగపూర్ శాస్త్రవేత్తలు క్యాన్సర్ కణాలు ఎలా ఉత్పత్తి అవుతాయి. అవి తీవ్రమైన మార్పులకు లోనవడానికి, అలాగే ప్రాణాంతక కణతులుగా అభివృద్ధి చెందడంపై సింగపూర్ శాస్త్రవేత్తలు పలు అంశాలను వెలుగులోకి తెచ్చారు.
క్యాన్సర్ ఒక ప్రాణాంతక వ్యాధిగా మారడానికి ప్రధానంగా న్యూట్రోఫిల్స్ అనేది ఒక రకమైన తెల్ల రక్త కణం కారణమని చెబుతున్నారు. న్యూట్రోఫిల్స్ తెల్ల రక్త కణాల్లో భాగం, ఇది ఇన్ఫెక్షన్లు, ఇన్‌ఫ్లమేషన్‌కు వ్యతిరేకంగా శరీరానికి మొదటి రక్షణ వలయంగా పనిచేస్తుంది. అయితే క్యాన్సర్ వ్యాధి సోకినప్పుడు కణతులు పెరగడానికి ఈ న్యూట్రోఫిల్స్ ప్రత్యక్షంగా కారణం అవుతున్నాయి. కణితిలో ఉండే న్యూట్రోఫిల్స్ కణితి పెరుగుదలకు తోడ్పడడంలో కీలక పాత్ర పోషిస్తాయని సింగపూర్ శాస్త్రవేత్తలు తేల్చారు. న్యూట్రోఫిల్స్ ఇన్ఫెక్షన్లు సోకకుండా మనశరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థలో భాగం. ప్రాథమికంగా ఫాగోసైటోసిస్‌కు బాధ్యత వహిస్తాయి. ఈ ప్రక్రియ ద్వారా ఇవి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వంటి సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి.
తాజాగా శాస్త్రవేత్తలు ప్రచురించిన సైన్స్ జర్నల్ ప్రకారం.. పరిశోధనలో బృందం క్యాన్సర్ కణితి పెరిగేందుకు ప్రోత్సహించే కణాల్లో న్యూట్రోఫిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. శాస్త్రవేత్తలు పరిశోధనల్లో భాగంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రీ-క్లినికల్ మోడల్‌ను ఉపయోగించి న్యూట్రోఫిల్స్ క్యాన్సర్ కణితి లోపల ఎలా మారాయి. ఎలాంటి కొత్త లక్షణాలను పొందాయి. వంటివి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే న్యూట్రోఫిల్స్ క్యాన్సర్ కణితి కేంద్రంలో కొత్త రక్తనాళాల నిర్మాణాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఆక్సిజన్ సహా ఇతర పోషకాలను అందించడం ద్వారా కణితి పెరుగుదలను సులభతరం చేస్తాయని రిప్రోగ్రామింగ్ ప్రక్రియను ట్రాక్ చేయడం ద్వారా వెల్లడైంది.
న్యూట్రోఫిల్-ట్యూమర్ చర్యలను నిరోధించడం ప్యాంక్రియాటిక్ కణితి పెరుగుదలలో గణనీయమైన తగ్గింపు కనిపించిందని పరిశోధక బృందం కనుగొంది. నిజానికి తెల్ల రక్త కణాలు అనేవి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంపొందిస్తాయి. వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను, వైరస్‌ను అంతం చేసేందుకు తెల్ల రక్త కణాలు తోడ్పడతాయి. కానీ ఇవే తెల్ల రక్త కణాలు క్యాన్సర్ వ్యాధికి కూడా కారణం అవుతున్నాయని ముఖ్యంగా న్యూట్రోఫిల్స్ అనే తెల్ల రక్త కణాలు ఈ క్యాన్సర్ కణితులు పెరగడానికి ఎక్కువగా తోడ్పడుతున్నాయని తమ పరిశోధనల్లో తేలింది. అయితే శాస్త్రవేత్తల పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ పరిశోధనలు మరింత ముందుకు కొనసాగే అవకాశం ఉంది తద్వారా క్యాన్సర్ వ్యాధికి మూల కారణం విషయంలో ఒక ముందడుగు పడే అవకాశం ఉంది.
Also Read : గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతున్న విటమిన్.. కొత్త పరిశోధన వివరాలు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.