Vice Chairman of the Planning Commission Chinnareddy : తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడిగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడిగా నియాకమైన చిన్నారెడ్డి కేబినెట్ హోదాను ఉంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ అంతలోనే చిన్నారెడ్డి పేరును తొలగిస్తూ మేఘా రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. అయితే మేఘారెడ్డి కూడా విజయం సాధించలేదు. టిక్కెట్ ప్రకటించిన తర్వాత తొలగించినప్పటికీ చిన్నారెడ్డి ఫీల్ కాలేదు. ఆయన పార్టీ కోసం పని చేశారు.
జి చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో యువజన కాంగ్రెస్ నేతగా ఉన్న చిన్నారెడ్డి.. వనపర్తి నియోజకవర్గంలో పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బాలకృష్ణయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 1989లో మళ్లీ పోటీ చేసి బాలకృష్ణయ్యపై విజయం సాధించి, తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు చిన్నారెడ్డి. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రావుల చంద్రశేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో రావుల చంద్రశేఖర్ రెడ్డిపై చిన్నారెడ్డి 3,500 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004 ఎన్నికల్లోనూ గెలుపొందారు. వైఎస్సార్ కేబినెట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో రావుల చేతిలో ఓటమి పాలయ్యారు చిన్నారెడ్డి. 2014 ఎన్నికల్లో చిన్నారెడ్డి గెలుపొందారు. మొత్తంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు చిన్నారెడ్డి. 2018 ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2021లో జరిగిన హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవి చూశారు.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కేబినెట్ హోదా కలిగి వుండడంతో పాటు కేబినెట్ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా ఉంటారు. వినోద్ కుమార్ ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారు. రాజకీయాల్లో, పరిపాలనా అంశాల్లో ఉన్న అనుభవంతో పాటు తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల అవగాహన కలిగిన చిన్నారెడ్డి సేవలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి ఈ పదవి ఇచ్చారు. బీఆర్ఎస్ హాయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పని చేశారు.
లోక్‌సభ ఎన్నికల కు ముందే సీనియర్ నేతలకు పదవులు ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇందులో భాగంగానే కీలక పదవుల భర్తీ చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది.