చర్మాన్ని కాపాడుకుంటూ అందంగా ఉంచుకోడానికి మార్కెట్లో వివిధ రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల వయస్సు దాచేసుకునే అవకాశం లభిస్తుంది. అటువంటి వాటిలో ఇప్పుడు ఎక్కువ ప్రజాదరణ పొందిన హైలురోనిక్ యాసిడ్. ఇదొక యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్. సెలబ్రిటీలు కూడా దీన్నే వాడుతున్నామంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. దీనికి ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది. మరి ఈ ఉత్పత్తి నిజంగానే అందాన్ని పెంచి.. వయస్సును తగ్గిస్తుందా? లాభాలేంటి? నష్టాలేమిటీ?
హైలురోనిక్ యాసిడ్ అంటే ఏమిటీ?
హైలురోనిక్ యాసిడ్ అనేది గ్లైకోసమినోగ్లైకాన్. ఇదొక సహజ కార్బోహైడ్రేట్. చర్మ నిర్మాణాన్ని అందించి స్కిన్ మెరిసేలా హైడ్రేట్ గా కనిపించేలా చేయడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలని నిరోధించడంలో సహాయపడుతుంది. మొటిమలు, వాటి వల్ల కలిగే మచ్చలు, గాయాలు నయం చేయడంలో మెరుగ్గా పని చేస్తుంది.
హైలురోనిక్ యాసిడ్ ఎందుకు అవసరం?
ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. అయితే చర్మంలో వయస్సు పెరుగుతున్న కొద్ది ఈ ఉత్పత్తి తగ్గిపోతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, నీరు తక్కువగా తాగడం, సాధారణ ఆహారపు అలవాట్లు వల్ల ఇది క్షీణించిపోవడం జరుగుతుంది. ఫలితంగా చర్మం నిస్తేజంగా ముడతలు కనిపిస్తాయి. దీన్ని పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సరైన సమతుల్య పోషకాహారం తీసుకోవడం.
హైలురోనిక్ యాసిడ్ వల్ల ప్రయోజనాలు
⦿ వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
⦿ మాయిశ్చరైజింగ్, హైడ్రేటింగ్ ఇస్తుంది
⦿ గాయాలను నయం చేస్తుంది
⦿ ముడతలు లేని చర్మం
⦿ ముఖానికి రంగు వచ్చేలా చేస్తుంది
⦿ హైలురోనిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఒక పరిశోధన వెల్లడించింది. కాలుష్యం, ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
⦿ చర్మం తేమగా ఉండేందుకు సహాయపడుతుంది. తేమ లేకపోవడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. దాన్ని తగ్గించేందుకు ఇది సహకరిస్తుంది.
⦿ కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మంలోకి వెళ్లలేవు. కానీ ఇది త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. చికాకు కలిగించదు. అన్ని రకాల చర్మాల వారికి చక్కగా సరిపోతుంది.
⦿ ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటే అది ఏడాది పాటు ఉంటుంది. ఇది సహజంగా కరిగిపోతుంది. ఉదయం వేళ దీన్ని రాసుకుంటే మంచిదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు.
హైలురోనిక్ యాసిడ్ వల్ల దుష్ప్రభావాలు
చర్మ నిపుణులు అభిప్రాయం ప్రకారం దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కానీ దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి కొన్ని సమస్యలు కలిగిస్తుంది. హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళు ఈ దుష్ప్రభావాలు ఎదుర్కొనే అవకాశం ఉంది.
☀ నొప్పి
☀ ఎర్రగా మారడం
☀ దురద
☀ వాపు
☀ గాయాలు కావడం
హైలురోనిక్ యాసిడ్ ద్రావణం కంటే ఇంజెక్షన్ గా తీసుకుంటేనే ఎక్కువ దుష్ప్రభావాలు సంభవిస్తాయి. చర్మ స్థితిని మార్చేందుకు ఇప్పుడు అనేక సీరమ్, క్రీమ్, మాయిశ్చరైజర్ లలో హైలురోనిక్ యాసిడ్ పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు. చర్మ సంరక్షణ కోసం సీరమ్, ఫేస్ క్రీమ్స్ ఉపయోగించే బదులు ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: ఇలా చేశారంటే మీ పాదాలు మృదువుగా మారిపోతాయ్, ఇన్ఫెక్షన్లు దరిచేరవు