భారతీయులు ఉసిరిని దైవంగా భావిస్తారు. ఆయుర్వేదంలో కూడా ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది. కాలక్రమేనా ఉసిరి మొక్కలు అంతరించి పోయే స్థితికి చేరుకున్నాయి. ఫాస్ట్‌ఫుడ్, ఫ్రూట్ సాలాడ్స్ కల్చర్‌కు అలవాటైపోయిన మనం క్రమేనా ఉసిరి వంటి ఔషద గుణాల కాయలకు దూరమైపోతున్నాం. ఉసిరి కాయలను తిన్నా, వాటిని రసం చేసుకుని తాగినా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో చూసేయండి మరి. 


⦿ ఉసిరికాయలో మినరల్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల వ్యాధుల నుంచి మనలను రక్షిస్తాయి. 
⦿ ఉసిరి రసంలో విటమిన్-సి పుష్కలంగా ఉంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
⦿ జలుబు, దగ్గుకు కారణమయ్యే బ్యాక్టీరియా నుంచి ఉసిరి మనలను రక్షిస్తుంది. 
⦿ ఉసిరి జీర్ణక్రియకు సహాయపడుతుంది.
⦿ అందమైన చర్మం కావాలంటే ఉసిరిని తినడం అలవాటు చేసుకోండి.
⦿ ఉసిరి.. జుట్టు బాగా పెరిగేందుకు సహకరిస్తుంది. 
⦿ ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగితే అనారోగ్య సమస్యలు ధరి చేరవు. 


ఖాళీ కడుపుతో ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే:


కంటి చూపుకు మంచిది, శక్తిని ఇస్తుంది: కంటి చూపును పెంచడానికి ఉసిరికాయ చాలా మంచిది. ఉసిరిలో కెరోటిన్ ఉంటుంది. ఇది దృష్టి మెరుగుదలకు సహాయపడుతుంది. రోజూ ఉసిరి రసాన్ని తీసుకోవడం వల్ల మీ కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటిశుక్లం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఉసిరి రసం ఉదయం పూట ఎనర్జీ బూస్టర్ లేదా ఎనర్జీ డ్రింక్‌గా పనిచేస్తుంది. రోజంతా మనల్ని ఫిట్‌గా, ఎనర్జీగా ఉంచుతుంది.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది: విటమిన్-సి అధికంగా ఉండే ఉసిరి, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. విటమిన్-C  రోగనిరోధక శక్తిని బలపరిచే విటమిన్. ఉసిరికాయలో నారింజలో కంటే ఎనిమిది రెట్లు విటమిన్-C ఉంటుంది. ఇది బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు,  వివిధ రకాల ఆరోగ్య సమస్యల నివారణలో సహాయపడుతుంది.


విష పదార్థాలను తొలగిస్తుంది: ఖాళీ కడుపుతో ఉసిరి రసం తాగడం ద్వారా శరీరం నిర్విషీకరణ చెందుతుంది. ఉసిరి రసంలో నీరు ఉంటుంది. ఇది ఎక్కువ మూత్రం ఉత్పత్తికి సహాయపడుతుంది. మూత్రం అధికంగా ప్రవహించడం వల్ల శరీరంలోని హానికరమైన విషపదార్థాలు బయటకు పోతాయి. అలాగే కిడ్నీ రాళ్లను తొలగించడంలో ఇది సహాయపడుతుంది. ఉసిరి రసంతో యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.


బరువు తగ్గుతారు: ఖాళీ కడుపుతో ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు మంచి ఆకృతిని పొందవచ్చు. ఉసిరి రసంలో యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. ఇది కొవ్వును కరిగించడంతోపాటు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరి రసంలో కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు శక్తిని పెంచే పోషకాలు ఉంటాయి.


Also Read: జ్వరం, నొప్పులకు ఈ మాత్ర వాడుతున్నారా? జాగ్రత్త, ప్రాణాలు పోతాయ్!


గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. వైద్యుల సూచనకు లేదా చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం కాదు. మీరు ఏదైనా డైట్ పాటించే ముందు, కొత్త రకం జ్యూస్‌లు ప్రయత్నించే ముందు డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యం. మీరు ఏదైనా అలర్జీలు, అనారోగ్యాలతో బాధపడుతున్నా.. డాక్టర్ సలహా తీసుకోకుండా ఇలాంటి చిట్కాలు పాటించకూడదు. ఈ కథనంలో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 


Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!