Southwest Monsoon : భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. వ్యవసాయరంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని ఐఎండీ ప్రకటించింది. ముందుగా జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ భావించినప్పటికీ మూడు రోజుల ముందుగానే ఆదివారం కేరళలో ప్రవేశించాయిని పేర్కొంది. భారత వాతావరణ విభాగం డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర ఈ విషయాన్ని ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను ప్రభావంతో మే 27వ తేదీన కేరళకు చేరుకునే అవకాశం ఉందని ఓ దశలో ఐఎండీ అంచనా వేసింది.
ఈ ఏడాది సాధారణ వర్షపాతం
పగటి పూట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదుతున్న వేళ ఐఎండీ చల్లడి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో రుతుపవనాలు ఈ ఏడాది త్వరగా భారత్‌లోకి ప్రవేశించాయని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ ఇప్పటికే స్పష్టం చేసింది.
మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు
అయితే సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని తాకుతాయి. ఈసారి మూడు రోజుల ముందుగానే దేశంలోకి వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇటీవల మే 27న కేరళకు రుతుపవనాలు చేరుకుంటాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే ఆ సమయానికి నాలుగు రోజులు తేడా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో అసని తుపాను కారణంగా నైరుతి రుతుపవనాల్లో వేగం పుంజుకున్నాయని వాతావరణ విశ్లేషకులు అంటున్నారు. సాధారణం కంటే చాలా ముందుగానే అంటే మే 16వ తేదీనే నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయని తెలిపారు. కేరళ నుంచి దక్షిణ రాష్ట్రాలకు విస్తరించే నైరుతి రుతుపవనాలు మరో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.