సాధారణంగా రాత్రి ఫుల్‌గా మందు కొట్టి నిద్రపోతే.. ఉదయం చాలా భయంకరమైన అనుభవం ఏర్పడుతుంది. దీన్నే హ్యాంగోవర్ అని అంటారు. అయితే, ఈ పరిస్థితి చాలా ప్రమాదకరమైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మద్యం తాగకపోయిన తరుచుగా ఇలాంటి అనుభవం ఏర్పడుతున్నట్లయితే.. తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలని అంటున్నారు. ఎందుకంటే. ప్రాణాంతక మైనింజైటిస్ ప్రభావం వల్ల కూడా అలా అనిపిస్తుందట. హ్యంగోవర్ ఫీల్ కలిగిన 24 గంటల్లోనే చనిపోయే ప్రమాదం ఉందట. ముఖ్యంగా మనం నిబ్బా నిబ్బీలుగా పేర్కొనే టీనేజర్ల విషయంలో ఎక్కువగా ఇలా జరుగుతుందట.
మెనింజైటిస్ అంటే?
మెనింజైటిస్ అనేది మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్. దీనికి త్వరగా చికిత్స అందించకపోతే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. బాధితుల్లో కొంతమంది 24 గంటల్లో మరణించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మద్యానికి బానిసైన వారిలో దీన్ని గుర్తించడం చాలా కష్టం. వారు దీన్ని హ్యాంగోవర్‌గా భావించి డాక్టర్లను సంప్రదించరు. ఫలితంగా ప్రాణాలు కోల్పోతారు. ఇది కేవలం తాగుబోతులపైనే ప్రభావం చూపుతుందని అనుకుంటే పొరపాటే. శిశువులు నుంచి యువతీ, యువకుల వరకు ఎవరైనా సరే దీని ప్రభావానికి గురికావచ్చు. ముఖ్యంగా టీనేజర్స్‌లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయట.
ఇటీవల యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) బయటపెట్టిన డేటా ప్రకారం.. విద్యార్థుల్లో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తున్నాయట. కాలేజ్, యూనివర్శిటీ విద్యార్థుల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ప్రాణాంతకమైన మెనింజైటిస్‌తో బాధపడుతున్నారు. మెనింజైటిస్ రీసెర్చ్ ఫౌండేషన్‌లోని ఇన్‌సైట్స్ అండ్ పాలసీకి చెందిన నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మెనింజైటిస్ ఆరోగ్యకరమైన వ్యక్తులను గంటల్లోనే చంపగలదు. ప్రారంభ దశలో హ్యాంగోవర్‌లా అనిపిస్తుంది. ఆ తర్వాత అనారోగ్య లక్షణాలు బయటపడతాయి. టీనేజ్‌లోనే ఆల్కహాల్‌కు అలవాటుపడే విద్యార్థుల్లో దీన్ని గుర్తించడం కష్టమట.
ఈ వ్యాక్సిన్‌తో అడ్డుకోవచ్చట
మెనింజైటిస్‌ను కంట్రోల్ చేయడం సాధ్యమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. MenACWY వ్యాక్సిన్ తీసుకొనేవారికి ఇన్ఫెక్షన్ ముప్పు ఉండదట. అయితే, 18 నుంచి 24 ఏళ్ల వయస్సులో ఆరోగ్యంగా కనిపించే యువత.. ఈ వ్యాక్సిన్ తీసుకోడానికి ఇష్టపడటం లేదని, ఫలితంగా వారే బాధితులు అవుతున్నారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎప్పుడైనా హ్యంగోవర్ లక్షణాలతో బాధపడుతుంటే.. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. అర్థమయ్యే విధంగా చెప్పాలంటే.. కాస్త నలతగా ఉండి, కళ్లు తిరుగుతున్నట్లుగా, కాంతిని చూడలేక ఇబ్బంది కలుగుతున్నా.. డాక్టర్‌ను కలవాలి.
బ్యాక్టీరియాలు చాలా రకాలు
మైనింజైటిస్‌కు కారణమయ్యే బ్యాక్టీరియాలు చాలానే ఉన్నాయట. వాటిలో ప్రమాదకమైనవి.. మెనింగోకాకల్ A, B, C, W, Y. ఇవి మెనింజైటిస్, సెప్టిసిమియా (బ్లడ్ పాయిజనింగ్)కి కారణమవుతాయి. అయితే ఇవి గంటల్లోనే చనిపోతాయి. కానీ, అప్పటికే చాలా నష్టాన్ని మిగుల్చుతాయి. ఈ బ్యాక్టీరియా సోకిన వారిలో వినికిడి లోపం, మెదడులో గాయాలు ఏర్పడవచ్చు. అవయవాలు కూడా పాడయ్యే ప్రమాదం ఉంది.
మెనింజైటిస్, సెప్టిసిమియా ప్రారంభ దశలో కనిపించే లక్షణాలివే:
⦿ ఫ్లూ లేదా హ్యాంగోవర్ లాగా ఉండవచ్చు
⦿ వికారం
⦿ వాంతులు
⦿ అతిసారం
⦿ కండరాల నొప్పి
⦿ కడుపు తిమ్మిరి
⦿ చేతులు చల్లగా మారిపోవడం
⦿ కాళ్లు వణకడం
⦿ జ్వరం
⦿ తలనొప్పి
⦿ మెడ పట్టేయడం
⦿ లైట్లను చూడలేకపోవడం
⦿ మగత
⦿ గందరగోళం
⦿ చర్మంపై పలుచని మచ్చలు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.