Chandrababu Delhi Tour :  ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఓట్ల గల్లంతుతో పాటు దొంగ ఓట్లను చేర్చిన అంశంపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 28వ తేదన రాష్ట్రపతి భవన్ లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్బీఐ రూపొందించిన రూ. వంద వెండి నాణెన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో కుటుంబసభ్యులందరితో పాల్గొంటారు. ఆ తర్వాత ఈసీని కలుస్తారు. రెండు రోజుల పాటు చంద్రబాబు ఢిల్లీలో ఉంటూండటంతో రాష్ట్ర రాజకీయాలపై కొన్ని కీలక చర్చలు నిర్వహించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 


బీజేపీతో కలిసి పని చేయడంపై మరోసారి చర్చిస్తారా ? 


గతంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు, అమిత్ షాలను కలిశారు. అయితే అది అనధికారిక సమావేశం. ఆ సమావేశానికి సంబంధించి ఎలాంటి ఫోటోలు బయటకు రాలేదు. కలిశామని అధికారికంగా కూడా ఎప్పుడూ చంద్రబాబు చెప్పలేదు. కానీ ఆ తర్వాత ఏపీ రాజకీయాలు కొంత మేర మారుతున్నాయి. బీజేపీ పెద్దలు ఏపీలో పెట్టిన రెండు బహింగసభల్లో వైఎస్ఆర్‌సీపీపై విమర్సలు గుప్పించారు.  కానీ టీడీపీ  నేతలు మాత్రం.. చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించడం ప్రారంభించారు. ఇటీవల చంద్రబాబు..  కేంద్రానికి , రాష్ట్రపతికి ఏడు పేజీల లేఖ రాశారు. అందులో ఏపీ ప్రభుత్వం మతి స్థిమితం లేని పాలన వల్ల రాష్ట్రం నష్టపోతోందని.. తనపైనా పదే పదే హత్యాయత్నాలు చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. తాను లేఖలో పేర్కొన్న ప్రతీ అంశానికి డాక్యుమెంట్లు జత చేశారు. కేంద్రం నుంచి ఈ లేఖ విషయంలో స్పందనను చంద్రబాబు కోరుతున్నట్లుగా తెలుస్తోంది. 


తెలంగాణ ఎన్నికల విషయంలోనూ బీజేపీ పెద్దలు చర్చిస్తారా ? 


తెలంగాణ రాజకీయం కూడా బీజేపీకి కీలకంగా ఉంది.  తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో బీజేపీ ఆగ్రనాయకత్వం కూడా టీడీపీతో మరోసారి చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు హస్తిన టూర్‌ ప్రోగ్రామ్‌ ఉన్నట్లుగా  చెబుతున్నారు. తెలంగాణలో  బీజేపీ ఇటీవలి కాలంలో మళ్లీ వెనుకబడినట్లుగా కనిపిస్తోంది. దీంతో పొత్తుల ద్వారా తెర ముందుకు రావాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ వంటి చోట్ల టీడీపీతో పొత్తు ఉపయోగకరంగా ఉంటుందని  బీజేపీ భావిస్తోందని అంటున్నారు. ఈ విషయంపై రెండు వర్గాలు చర్చలు జరిపితే ఏపీ విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 


వైసీపీకి బీజేపీ దూరం జరిగితేనే ఏపీలో  చాన్స్ 


 కవైపు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తరచూ పొత్తులతోనే ఎన్నికలకు వెళ్తామని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీతో మైత్రీ బంధం బలపడినా బీజేపీ వైఖరిపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో జనసేనాని కూడా బీజేపీ అగ్రనాయకత్వాన్ని పొత్తులకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.  వైసీపీతో బీజేపీ సాన్నిహిత్యమే ఇప్పుడు పొత్తులకు ఆటంకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వైసీపీ అక్రమాలపై చర్యలు తీసుకుంటే..  వైసీపీకి దూరం జరిగినట్లే టీడీపీ భావిస్తుంది.   బీజేపీకి పలు బిల్లుల అంశంలో టీడీపీ ఎటువంటి షరతులు లేకుండా సపోర్ట్‌ చేసింది. ఆ పార్టీ అగ్రనేతలు చంద్రబాబు స్వయంగా మాట్లాడటంతో ఆయన కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలోనూ పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.