Vangaveeti Radha Meets Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో వంగవీటి రాధా ఏకాంతంగా భేటీ అయ్యారు. గురువారం యువగళం పాదయాత్ర విరామ సమయంలో లోకేష్ తో చర్చించారు. దాదాపు 20 నిమిషాల పాటు వీరిద్దరూ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఈ భేటీ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ఇటీవల యువగళం పాదయాత్రలో వంగవీటి రాధా వరుసగా పాల్గొంటున్నారు. అయితే రాధా, లోకేష్ ఏకాంతంగా భేటీ అవ్వడంతో ఏం జరగబోతుందా అనే ఇతర పార్టీల నేతలు సర్వత్రా ఆసక్తి చూపిస్తున్నారు.


అయితే వంగవీటి రాధ లాంటి నేతను ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేయించాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏ స్థానం నుంచి రాధా పోటీ చేయబోతున్నారో చర్చించినట్లు సమాచారం. వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలోనే రాజకీయాలు చేస్తుంటారు. కానీ అక్కడ టీడీపీ తరఫున బొండా అమ అభ్యర్థిగా ఉన్నారు. ఇతర రెండు స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఈ క్రమంలోనే వంగవీటి రాధాను ఎక్కడి నుంచి పోటీ చేయిస్తారా అనే అంతా అనుకుంటున్నారు. విజయవాడలోనే కాకుండా కృష్ణా జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఆయన గెలిచే అవకాశం ఉందని ఆయన అనుచరులు అంటున్నారు.  






బాపులపాడు మండలం, రంగన్న గూడెంలో నారా లోకేష్ పాదయాత్రలో కొద్ది సేపు హై టెన్షన్ నెలకొంది. లోకేష్ పాదయాత్ర చేస్తున్న రోడ్డులోనే వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేయడం కలకలం రేగింది. బ్యానర్ పై వైసీపీ హయాంలో రెండు కోట్ల 71 లక్షలతో పనుల చేసిన వివరాలను వైసీపీ కార్యకర్తలు పొందు పరిచారు. ఇలా పాదయాత్ర జరుగుతున్న ఏరియాలో బ్యానర్లు వేయడాన్ని తెలుగు దేశం పార్టీ నేతలు తప్పు పట్టారు. బాపులపాడు మండలం రంగన్నగూడెంలో కొడాలి నాని, వల్లభనేని వంసీ ఫొటోలతో బ్యానర్లు ఏర్పాటు చేశారు. లోకేష్ పాదయాత్ర రంగన్న గూడెంకు రాగానే బ్యానర్ వద్ద నిలబడి టీడీపీ నేతలను వైసీపీ శ్రేణులు కవ్వించాయి. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య కాసేపు వాగ్వాదం చెరగేలింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీని తొలగించాలంటూ పోలీసులతో దేవినేని ఉమ వాగ్వాదానికి దిగారు. వైసీపీ శ్రేణులకు మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ నేతల భద్రత కోసం భారీగా పోలీసుల్ని మొహరించారంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. చివరకు ఫ్లెక్సీని తొలగించడంతో వివాదం సద్దుమణిగింది.