Jaideep Ahlawat Weight Loss: నటుడు అంటే.. పాత్ర ఏదైనా ఇట్టే పరకాయ ప్రవేశం చేయాలి. అన్ని రకాలకు పాత్రకు సరిపోయేలా తనను తాను మార్పు చేసుకోవాలి. బాడీ ఫిట్ నెస్ నుంచి వేసుకునే దుస్తుల వరకు అన్నింటిని మార్చుకోవాలి. పాత్రకు న్యాయం చేసేందుకు ఎంతైనా కష్టపడాలి. అలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లావత్. తన తాజా చిత్రం ‘మహారాజ్‘ కోసం గంటల తడబడి జిమ్ లో గడపడమే కాదు, ఏకంగా 26 కిలోల బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు.


109 కేజీల నుంచి 83 కేజీలకు..


‘మహరాజ్‘ సినిమాలో పాత్రను తగినట్టుగా బాడీని మార్చుకోవాలి అనుకున్నారు జైదీప్. అనుకోవడమే కాదు, కేవలం 5 నెలల్లో 26 కిలోల బరువు తగ్గి చూపించారు. ఈ పాత్ర చేయడానికి ముందు ఆయన 109.7 కిలోలు ఉండేవారు. 5 నెలల వ్యవధిలో  83 కిలోలకు తగ్గారు. ఫిట్ నెస్ ట్రైనర్ ప్రజ్వల్ సమక్షంలో ఆయన తన బాడీనికి పూర్తిగా మార్చుకున్నారు. అప్పట్లో పెద్ద పొట్టతో కనిపించిన ఆయన ఇప్పుడు ఫిట్ బాడీతో ఆశ్చర్యపరిచారు. ట్రైనర్ ప్రజ్వల్ కూడా జైదీప్ వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


బరువు తగ్గేందుకు ఎలా కష్టపడ్డారంటే?


బరువు తగ్గేందుకు ఎలాంటి పద్దతులు పాటించారో తాజాగా జైదీప్ వివరించారు. “‘మహారాజ్‘ సినిమాకు ముందు నేను 109 కిలోలకు పైగా ఉండే వాడిని. ఈ మూవీలో పాత్రకు సరిపోయేలా బాడీని రూపొందించుకునేందుకు దాదాపు ఐదున్నర నెలలు చాలా కష్టపడ్డాను. నేను అనుకున్న బాడీ తయారయ్యేందుకు నా ట్రైనర్ కూడా చాలా కష్టపడ్డారు. రోజుకు 3 నుంచి 4 సార్లు వర్కౌట్స్ చేసేవాడిని. నా బాడీ ఫిట్ నెస్ కోసం సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు” అని జైదీప్ చెప్పుకొచ్చారు.  






‘మహారాజ్’ సినిమా గురించి..


బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కిన తొలి మూవీ ‘మహారాజ్’. ఈ సినిమాను సిద్దార్థ్ మల్హోత్రా తెరకెక్కించారు. ‘యష్ రాజ్ ఫిల్మ్స్’ బ్యాన‌ర్‌పై ఆదిత్య చోప్రా ఈ మూవీని నిర్మించారు. 1862 మహారాజ్ లిబెల్ కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. 1862లో మ‌తాన్ని అడ్డుపెట్టుకుని స్వామీజీలు ఎలాంటి దారుణాలు చేశారు? భ‌క్తి ముసుగులో అమ్మాయిల‌పై ఎలాంటి ఆఘాయిత్యాలను కొనసాగించారు? అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రం జునైద్ ఖాన్ సోషల్ యాక్టివిస్టుగా పని చేయగా, స్వామీజీ పాత్ర‌లో జైదీప్ అహ్లావత్ కనిపించారు.  అయితే, ఈ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. హిందువుల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు కోర్టు మెట్లెక్కాయి. గుజరాత్ హైకోర్టు తొలుత ఈ సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు తీర్పు అనంతరం ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ వేదిక‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేక‌ర్స్.



Read Also: అనుష్క హీరోయిన్ కావడానికి కారణం నేను, అసలు విషయం చెప్పిన పశుపతి!