Gautam Adani Net Worth: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ 62వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. సోమవారం (24 జూన్‌ 2024) గౌతమ్‌ అదానీ పుట్టిన రోజు. 61వ పుట్టిన రోజు నుంచి 62వ పుట్టిన రోజు వరకు, అంటే గత సంవత్సర కాలం అదానీకి అద్భుతంగా కలిసొచ్చింది. అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ కంపెనీ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌' ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న అదానీ గ్రూప్ కంపెనీలు (Adani Group Companies) ఈ ఏడాది కాలంలో సూపర్‌గా పని చేశాయి, షేర్‌ ధరలు రాకెట్లలా దూసుకెళ్లాయి. దీంతో, గౌతమ్ అదానీ సంపద భారీగా పెరిగింది. 


సరిగ్గా ఏడాది క్రితం, 61వ పుట్టిన రోజు సమయంలో, గౌతమ్ అదానీ నికర విలువ (Gautam Adani Net Worth) 58.2 బిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు అది దాదాపు 106 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఏడాది కాలంలోనే ఆయన సంపద విలువ దాదాపు 48 బిలియన్‌ డాలర్లు పెరిగింది. దీనిని భారతీయ రూపాయల్లోకి మారిస్తే, గౌతమ్‌ అదానీ ఒక్క సంవత్సరంలోనే 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా (40,06,67,52,00,000) సంపాదించారు. 


హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ రిపోర్ట్‌ తర్వాత భారీగా పడిన సంపద విలువ
గౌతమ్‌ అదానీ 61-62 పుట్టిన రోజుల మధ్య ఉన్న ఏడాది కాలంలో అదానీ గ్రూప్ చాలా బాగా పని చేసింది. షేర్ల ధరలు పెరగడంతో కంపెనీ మార్కెట్‌ విలువలు, తద్వారా గౌతమ్ అదానీ ఆస్తిపాస్తుల విలువ పెరిగింది. 61వ పుట్టిన రోజు నుంచి 62వ పుట్టిన రోజు వరకు, గౌతమ్ అదానీ మొత్తం సంపద విలువ 82 శాతానికి పైగా పెరిగింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత పతనమైన అదానీ సంపద, 40 బిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఆ కనిష్ట స్థాయి నుంచి అతని నికర విలువ నిరంతరం పెరుగుతోంది. 


ఒక గంటకు రూ. 46 కోట్ల సంపాదన
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 2023 జూన్ 24న (61వ పుట్టిన రోజున), గౌతమ్ అదానీ మొత్తం నికర విలువ 58.2 బిలియన్‌ డాలర్లు. అది ఇప్పుడు 106 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఈ మొత్తాన్ని భారతీయ రూపాయల్లోకి మారిస్తే 8 లక్షల 84 వేల కోట్ల రూపాయలకు పైగా (88,47,25,82,00,000) ఉంటుంది. గత ఏడాది కాలంలో ఆయన సంపద దాదాపు 48 బిలియన్ డాలర్లు లేదా రూ. 4 లక్షల కోట్లుకు పైగా పెరిగింది. ఈ లెక్కన ఒక్కో గంటకు దాదాపు 46 కోట్ల రూపాయలను (రూ. 45.74 కోట్లు) అదానీ ఆర్జించారు. ఇంకా వివరంగా చెప్పాలంటే, ఒక నిమిషానికి 76 లక్షల 23 వేల 333 రూపాయలు, ఒక సెకనుకు 1 లక్ష 27 వేల 055 రూపాయలు పోగేశారు.


ఇక్కడ ఒక తమాషా ఉదాహరణ చూద్దాం. ఒక 500 రూపాయల నోటు గౌతమ్‌ అదానీ జేబులోంచి కింద పడిందనుకోండి. కిందకు వంగి దానిని తీసుకోవడానికి ఒక రెండు సెకన్ల సమయం పడుతుందనుకుందాం. అదానీ కిందకు వంగి ఆ 500 రూపాయల నోటును తీసుకునే సమయంలో అతను రూ. 2 లక్షల 54 వేల రూపాయలకు పైగా (2 x 1,27,055) సంపాదిస్తారు. కింద పడిన నోటును తీసుకుంటే అదానీకి రూ.500 దక్కుతుంది. కానీ, రూ.500 కోసం రెండు సెకన్ల సమయాన్ని సమయాన్ని వెచ్చించినందుకు రూ. 2 లక్షల 54 వేల రూపాయలు నష్టపోతారు.


2024లో 21.3 బిలియన్ డాలర్లు
ఈ క్యాలెండర్‌ సంవత్సరంలోనే (2024లో) గౌతమ్ అదానీ నెట్‌వర్త్‌ దాదాపు 25 శాతం లేదా 21.3 బిలియన్ డాలర్లు... అంటే 1 లక్ష 77 వేల కోట్లు రూపాయలు (17,77,56,70,05,000) పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం,  గౌతమ్ అదానీ ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల లిస్ట్‌లో 14వ స్థానంలో ఉన్నారు. ఆసియాలో రెండో అత్యంత సంపన్న వ్యాపారవేత్తగానూ నిలిచారు. ఆసియాలో అత్యంత ధనికుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేష్ అంబానీ (Mukesh Ambani) ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ముకేష్ అంబానీది 12వ ప్లేస్‌.


మరో ఆసక్తికర కథనం: 20 ఏళ్లకే కోటీశ్వరుడు, కిడ్నాప్‌, హోటల్‌లో దాడి - సినిమాను మరిపించే ట్విస్ట్‌లు