Happy Birthday Gautam Adani: భారతదేశంలో రెండో అత్యంత సంపన్నుడు, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈ రోజు (సోమవారం, 24 జూన్ 2024) 62వ ఏట అడుగుపెట్టారు. అదానీ గ్రూప్‌ను గ్రౌండ్‌ రేంజ్‌ నుంచి గ్లోబల్‌ రేంజ్‌కు తీసుకెళ్లిన గౌతమ్ అదానీ, ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. డబ్బు మాత్రమే కాదు పేరుప్రఖ్యాతులు సంపాదించాలనే కసితో పని చేశారు. ఆ కసి, పట్టుదల ఫలితమే నేడు దేశ, విదేశాల్లో వివిధ రంగాల్లో విస్తరించి ఉన్న వ్యాపార సామ్రాజ్యం. అంత పెద్ద వ్యాపార కోటను అదానీ సొంతంగా నిర్మించుకున్నారు. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి వెళ్లే దారిలో సవాలక్ష సవాళ్లతో పోరాడారు. అప్పటికే దేశంలో పాతుకుపోయిన టాటా గ్రూప్‌, రిలయన్స్‌కు పోటీగా నిలబడ్డారు. అదానీ గ్రూప్‌ను దేశంలోనే అతి పెద్ద వ్యాపార సమూహాల్లో ఒకటిగా నిలబెట్టారు. గౌతమ్ అదానీని 'సెల్ఫ్ మేడ్ మిలియనీర్' అంటారు. అంటే, ఎలాంటి వారసత్వం లేకుండా సొంతంగా ఎదిగి సంపన్నుడైన వ్యక్తి అని అర్ధం. కేవలం 20 ఏళ్ల వయస్సులోనే 'సెల్ఫ్ మేడ్ మిలియనీర్' టైటిల్‌ను సాధించారు. 


విశేషం ఏంటంటే... గౌతమ్‌ అదానీ ఒక కాలేజ్ డ్రాపౌట్ కుర్రాడు. అయినా సూపర్‌ సక్సెస్ స్టోరీని రాశారు, ప్రజల్లో స్ఫూర్తిని నింపారు.


100 గంటల్లో రూ.6000 కోట్ల డీల్
గౌతమ్ అదానీ, 24 జూన్ 1962న, అహ్మదాబాద్‌లో గుజరాతీ జైన కుటుంబంలో జన్మించారు. గౌతమ్‌ తండ్రి పేరు శాంతిలాల్ అదానీ, తల్లి పేరు శాంతబెన్ అదానీ. వాళ్ల కుటుంబం వస్త్ర వ్యాపారం చేసేది. ఆ బిజినెస్‌ను పెంచుకోవడానికి థారాడ్ పట్టణం నుంచి అహ్మదాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. కానీ, గౌతమ్ అదానీకి వస్త్ర వ్యాపారం చేయడం ఇష్టం లేదు. రంగుల వాసన వచ్చే వస్త్రాల కంటే ధగధగలాడే వజ్రాలను అతని మనస్సు కోరుకుంది. డైమండ్‌ బిజినెస్‌ కోసం అహ్మదాబాద్‌ నుంచి ముంబై వచ్చారు. అక్కడ, మహీంద్ర బ్రదర్స్‌లో డైమండ్ సార్టర్‌గా పని చేశారు. ఆ వ్యాపారం మెళకువలు తెలుసుకుని పట్టు సంపాదించాక సొంతంగా డైమండ్ బ్రోకరేజీని స్థాపించారు. కేవలం 100 గంటల్లోనే 6,000 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుని అందర్నీ ఆశ్చపరిచారు. ప్రతిభతో పాటు అదృష్టం కూడా అదానీ చుట్టూ వైఫైలా తిరుగుతోందని ఆ సంఘటన రుజువు చేసింది. ఆ తరువాత అదానీ వ్యాపారం పెరిగింది, అదానీ గ్రూప్ ఆఫ్‌ కంపెనీస్‌ తయారయ్యాయి. ఆతని బిజినెస్‌ పోర్ట్‌ల నుంటి ఎఫ్‌ఎంసీజీ వరకు విస్తరించింది. ప్రస్తుతం, 10 లిస్టెడ్ కంపెనీలతో పెద్ద వ్యాపార సమూహంగా మారింది. అదానీ గ్రూప్‌లో అన్‌-లిస్టెడ్‌ కంపెనీలు కూడా ఉన్నాయి.


తాజ్ హోటల్‌లో ముంబై దాడుల్లో చిక్కుకున్న అదానీ
ముంబైలో, 26/11 ఉగ్రదాడి సమయంలో గౌతమ్ అదానీ తాజ్ హోటల్‌లో రాత్రి భోజనం చేస్తున్నారు. కాల్పుల శబ్దాలు విని నేలమాళిగలో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. అంతేకాదు.. 1998లో, 1.5 మిలియన్ డాలర్ల డిమాండ్‌తో కిడ్నాప్‌నకు గురయ్యారు. గతేడాది వచ్చిన హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూప్‌ను చాలా పెద్ద దెబ్బ కొట్టింది. అంతపెద్ద నష్టం నుంచి కేవలం ఒక్క ఏడాదిలోనే కోలుకున్న గౌతమ్ అదానీ, తాజాగా మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు.


60వ పుట్టినరోజు సందర్భంగా 60 వేల కోట్ల రూపాయల విరాళం
రెండేళ్ల క్రితం, తన 60వ పుట్టిన రోజు నాడు గౌతమ్‌ అదానీ సహృదయత చాటుకున్నారు. అదానీ ఫౌండేషన్‌కు రూ. 60,000 కోట్లను విరాళంగా ప్రకటించారు. అదానీ ఫౌండేషన్ ఛైర్మన్‌గా ఆయన భార్య ప్రీతి అదానీ పని చేస్తున్నారు. తన విజయాల వెనుకున్న వ్యక్తి తన భార్యేనని గౌతమ్ అదానీ చాలాసార్లు చెప్పారు. 


అదానీకి ఇద్దరు కుమారులు - కరణ్ అదానీ, జీత్ అదానీ. ఈ ఇద్దరు ఇప్పుడు తండ్రి వ్యాపారంలో సాయం చేస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: అదానీ కంటే అతని ఉద్యోగుల జీతమే ఎక్కువ - కంపెనీ సిబ్బంది ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?