Gautam Adani Salary 2024: అదానీ గ్రూప్ ఓనర్, దేశంలోనే రెండో అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ తీసుకుంటున్న వేతనానికి సంబంధించి ఒక ఆసక్తికర సమాచారం ఇప్పుడు వైరల్ అవుతోంది. గౌతమ్ అదానీ, 2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 9.26 కోట్ల ప్యాకేజీని అందుకున్నారు. విశేషం ఏంటంటే... అదానీ అందుకున్న జీతం పరిశ్రమలోని సహచర ఛైర్మన్‌ల కంటే తక్కువ. అంతేకాదు, తన సొంత కంపెనీ ఉద్యోగులతో పోల్చినా, చాలా మంది సిబ్బంది తమ బాస్ (గౌతమ్ అదానీ) కంటే తక్కువ జీతం తీసుకుంటున్నారు.
2 కంపెనీల నుంచి మాత్రమే జీతం
గౌతమ్ అదానీ గ్రూప్‌లో (Adani Group) చాలా కంపెనీలు ఉన్నాయి, వాటిలో 10 స్టాక్ మార్కెట్‌లో లిస్యయ్యాయి. వీటిలో, కేవలం 2 కంపెనీల నుంచి మాత్రమే అదానీ వేతనం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. లిస్టెడ్ కంపెనీల వార్షిక నివేదికల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం... గౌతమ్ అదానీ, 2023-24 ఆర్థిక సంవత్సరానికి, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (Adani Enterprises Ltd) నుంచి రూ. 2.19 కోట్ల జీతం తీసుకున్నారు. దీంతోపాటు సుమారు 27 లక్షల రూపాయల విలువైన అలవెన్సులు లభిస్తాయి. వీటిని కలిపితే, అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి గౌతమ్ అదానీకి ముట్టిన వార్షిక ప్యాకేజీ మొత్తం విలువ రూ. 2.46 కోట్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు 3 శాతం తక్కువ. ఇక... అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ (Adani Ports and SEZ Ltd) నుంచి 6.8 కోట్ల వార్షిక వేతనం తీసుకున్నారు. ఈ రెండు కంపెనీల నుంచి వచ్చిన డబ్బును కలిపితే, 2023-24 ఆర్థిక సంవత్సరానికి అదానీకి అందిన మొత్తం వార్షిక వేతనం రూ. 9.26 కోట్లు.
బాస్ కంటే ఉద్యోగుల జీతం ఎక్కువ
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన వినయ్ ప్రకాష్ వార్షిక వేతనం రూ. 89.37 కోట్లు. అదానీ గ్రూప్ CFO జుగేషీందర్ సింగ్ వేతనం రూ. 9.45 కోట్లు. అదానీ గ్రీన్ ఎనర్జీ CEO వినీత్ జైన్ వేతనం రూ. 15.25 కోట్లు. మరోవైపు... గౌతమ్ అదానీ తమ్ముడు రాజేష్ అదానీ రూ.8.37 కోట్లు, మేనల్లుడు ప్రణవ్ అదానీ రూ.6.46 కోట్ల వార్షిక వేతనం తీసుకుంటున్నారు. గౌతమ్ అదానీ వారసుడు కరణ్ అదానీ రూ.3.9 కోట్ల ప్యాకేజీ తీసుకుంటున్నారు.
ముకేష్ అంబానీ జీతం దాదాపు రూ.15 కోట్లు
దేశంలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ ఏడాది జీతభత్యాలు (Mukesh Ambani Salary) దాదాపు రూ. 15 కోట్లు. సునీల్ భారతి మిట్టల్ సుమారు రూ. 16.7 కోట్లు, రాజీవ్ బజాజ్ సుమారు రూ. 53.7 కోట్లు, పవన్ ముంజాల్ సుమారు రూ. 80 కోట్లు అందుకుంటున్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్, ఇన్ఫోసిస్ CEO సలీల్ పరేఖ్ వార్షిక వేతనం కూడా గౌతమ్ అదానీ కంటే ఎక్కువ.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గౌతమ్ అదానీ సంపద విలువ 106 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 12వ స్థానంలో ఉంటే, గౌతమ్ అదానీ 14వ స్థానంలో ఉన్నారు.
మరో ఆసక్తికర కథనం: గూగుల్ కొత్త టూల్ - ఇంటర్నెట్ నుంచి మీ పర్సనల్ డేటాను తీసేయండి