Worms Found In Biscuit Packet In Adoni: పిల్లల నుంచి పెద్దల వరకూ అంతా బిస్కెట్స్ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా చిన్నారులకు బిస్కెట్స్ అంటే ప్రాణం. అయితే, అలాంటి బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే అందులో పురుగులు దర్శనమిచ్చిన షాకింగ్ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన పిల్లలకు బిస్కెట్స్ ఇద్దామని అనుకున్న ఆ తండ్రి ఒక్కసారిగా ఇది చూసి ఆందోళనకు గురయ్యాడు. దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని పట్టణంలోని ఎంఎం కాలనీకి చెందిన మనోజ్ కుమార్ తన పిల్లలకి బిస్కెట్స్ కోసమని దుకాణానికి వెళ్లి ఓ ప్రముఖ కంపెనీకి చెందిన బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు.


బిస్కెట్ ప్యాకెట్‌లో పురుగులు


పిల్లలకి తినిపిద్దామని సదరు వ్యక్తి ప్యాకెట్ ఓపెన్ చేయగా.. అందులో పురుగులను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. పెద్ద కంపెనీ నుంచి వచ్చిన బిస్కెట్లలోనే ఇలా ఉండడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాంటి బిస్కెట్స్ తింటే పిల్లల ఆరోగ్యం ఏమైపోతుందని వాపోయారు. నాసిరకం బిస్కెట్లను తయారు చేసి బ్రాండెడ్ కంపెనీల కవర్లతో ప్యాక్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సదరు కంపెనీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా, ఇటీవలే కొన్ని ప్రాంతాల్లో ఐస్ క్రీమ్‌లో వ్యక్తి వేలు, చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప రావడం కలకలం రేపింది.