Protein Shake: ప్రోటీన్ షేక్ తాగడం వల్ల కండలు బలిష్టంగా అవుతాయని, బాడీ మంచి షేప్ వస్తుందని ఎంతోమంది నమ్మకం. ఇది నిజమే కానీ కొందరిలో ఇది ట్రిగ్గర్‌గా పనిచేస్తుంది. అరుదైన వ్యాధులు వచ్చి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా సంభవించవచ్చు. దీనికి ఉదాహరణ రోహన్ గోధానియా. ఇతడికి 16 ఏళ్లు. తల్లిదండ్రులతో బ్రిటన్లో స్థిరపడ్డాడు. కొడుకు చాలా సన్నగా ఉండడంతో తండ్రి సూపర్ మార్కెట్లో కనిపించిన ఓ ప్రోటీన్ షేక్ కొనిచ్చాడు. అది తాగాక అతడి ఆరోగ్యం క్షీణించింది. మొదట కడుపునొప్పిగా ఉందని చెప్పాడు. తర్వాత రెండు, మూడు వాంతులు చేసుకున్నాడు. ఆ రోజంతా ఇంకెలాంటి ప్రభావం కనబడలేదు. మరుసటి రోజు ఉదయం కళ్ళు మసక బారాయి. ఎదురుగా ఉన్న వస్తువులు కూడా కనిపించడం లేదు. దీంతో అతనిని ఆసుపత్రిలో చేర్చారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టి వైద్యం చేయించారు. సిటీ స్కాన్ తీస్తే తీవ్రమైన మెదడువాపు వచ్చినట్టు వైద్యులు చెప్పారు. శస్త్ర చికిత్స చేసినా ఫలితం ఉండదని, పరిస్థితి చేయిదాటి పోయిందని చెప్పారు వైద్యులు. ఆ తరువాత రోహన్ మరణించాడు.
ప్రోటీన్ షేక్ తాగడం వల్ల ఆ అబ్బాయిలో ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బమైలేస్ లోపం వచ్చింది. ఆర్నిథైన్ ట్రాన్స్‌కార్బమైలేస్ అనేది కాలేయంలో అమ్మోనియాను యూరియాగా మార్చడంలో కీలకమైన ఎంజైమ్. కాలేయంలో యూరియా ఏర్పడిన తర్వాత, అది రక్తప్రవాహం ద్వారా మూత్రపిండాలకు వెళుతుంది, అక్కడ అది మూత్రం ద్వారా శరీరం నుండి బయటికి పోతుంది. ఈ లోపం రోహన్లో రావడం వల్ల అమ్మోనియా విచ్ఛిన్నత ఆగిపోయింది. దీనివల్ల రక్త ప్రవాహంలో అమోనియా అధికంగా చేరి ప్రాణాంతక పరిస్థితికి చేరుకుంది. దీని కారణంగానే రోహన్ మరణించినట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రొటీన్ షేక్ అనేది ఈ అరుదైన పరిస్థితి తలెత్తడానికి ట్రిగ్గర్ గా మారిందని వివరించారు వైద్యులు.
ప్రోటీన్ షేక్ అధికంగా తాగితే అనేక రకాల సైడ్ ఎఫెక్టులు ఉంటాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.
ప్రోటీన్ పౌడర్లలో కొన్ని రకాల హార్మోన్లు, బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మంలో సెబమ్ ఉత్పత్తి అధికంగా పెరిగితే మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అలాగే జీర్ణాశయంతర సమస్యలు కూడా రావచ్చు. మాంసం, పాలు, గుడ్లు వంటి సహజ ప్రోటీన్ వనరులతో పోలిస్తే ప్రోటీన్ పౌడర్లు అసమతుల్యంగా ఉంటాయి. ప్రోటీన్ పౌడర్లలో ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల శరీరంలో పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. ప్రోటీన్ షేక్ అధికంగా తాగడం వల్ల పొట్ట నొప్పి రావడం, పొట్టలోని మంచి బ్యాక్టీరియాకు సమస్యలు రావడం జరుగుతుంది. ప్రోటీన్ పౌడర్లు ఏవి పడితే అవి తీసుకోకూడదు. కొన్ని కంపెనీలు తయారు చేసే ప్రోటీన్ పౌడర్లలో సీసం, కాడ్మియం, ఆర్సెనిక్, పాదరసం వంటి అత్యంత విషపూరిత లోహాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవి శరీరానికి చాలా హానికరమైనవి. ప్రోటీన్ షేక్ తాగిన వెంటనే తలనొప్పి, అలసట, మలబద్ధకం, కండరాలు, కీళ్లల్లో నొప్పి వస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తిని కూడా ప్రోటీన్ షేక్ లు పెంచుతాయి. వర్కౌట్స్ తర్వాత ప్రోటీన్ షేక్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ.
Also read: నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం అవుతుందా? దానికి ఇవి కారణాలు కావచ్చు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.